సాక్షి, హైదరాబాద్: కొత్త సచివాలయం.. చట్ట సభలకు సరికొత్త భవన సముదాయం.. ఇప్పటికే భూమి పూజ జరుపుకొని నిర్మాణాలకు సిద్ధమైన రెండు కొత్త ప్రాజెక్టులు. ఈ జాబితాలో మరోటి కూడా చేరబోతోంది. అదే రాష్ట్రానికి చెందిన ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలకు ప్రత్యేక క్లబ్. ఢిల్లీలో ఉన్న కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తరహాలో దీన్ని నిర్మించబోతున్నారు. ప్రజాప్రతినిధులకు ఇలాంటి వసతి అవసరమని ముఖ్యమంత్రి కేసీఆర్ చాలాకాలంగా భావిస్తున్నారు. ఇప్పుడు కొత్త సచివాలయం, కొత్త అసెంబ్లీ భవనాల నిర్మాణంపై ప్రభుత్వం ముందడుగు వేసిన నేపథ్యంలో.. దీన్ని కూడా సాకారం చేయాలని ఆయన భావిస్తున్నారు. దీనికి సంబంధించి దాదాపు ఏడాదిగా ఆయన రోడ్లు భవనాల శాఖ అధికారులతో తరచూ ప్రస్తావిస్తున్నారు.
ఇప్పుడు దానికి సంబంధించి కూడా ఏర్పాట్లు చేయాల్సిందిగా ఆయన అధికారులను ఆదేశించినట్టు తెలిసింది. హైదర్‌గూడలో ఎమ్మెల్యేలకు కొత్త క్వార్టర్ల భవన సముదాయ ప్రారంభోత్సవం రోజునే ఆయన దీనిపై కొంత స్పష్టతనిచ్చారు. ఇప్పుడు ప్రజా ప్రతినిధులకు కూడా దానిపై కొంత సమాచారాన్ని అందించారు. ప్రస్తుతం జరుగుతున్న బడ్జెట్ సమావేశాలను ఎన్ని రోజులు నిర్వహించాలనే విషయంలో చర్చ సందర్భంగా అసెంబ్లీ బీఏసీ సమావేశంలో దీని ప్రస్తావన తెచ్చారు. ఢిల్లీ తరహాలో హైదరాబాద్‌లో కూడా కాన్‌స్టిట్యూషన్ క్లబ్ ఏర్పాటు చేయనున్నట్టు వెల్లడించినట్టు తెలిసింది.
ఆధునిక వసతులతో..
ఐఏఎస్, ఐపీఎస్ అధికారులకు ఉన్నట్టుగానే ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీల కుటుంబ సభ్యుల కోసం ఓ క్లబ్ అవసరమని సీఎం భావిస్తున్నారు. ఢిల్లీలోని ఎంపీల కాన్‌స్టిట్యూషన్ క్లబ్ తరహాలోనే ఇక్కడి ప్రజా ప్రతినిధులు, వారి కుటుంబ సభ్యులు ఆహ్లాదంగా గడిపేందుకు.. ఫంక్షన్లు, గెట్ టు గెదర్‌లు, సమావేశాలు, సదస్సులు, ఇష్టాగోష్టుల నిర్వహణ... తదితరాల కోసం ఈ ప్రత్యేక క్లబ్ ఉపయోగపడనుంది. ఇందులో అత్యాధునిక సమావేశ మందిరాలు, సౌకర్యవంతమైన గదులు, ఆధునిక వసతులతో ఫంక్షన్ హాలు, రెస్టారెంట్, డైనింగ్ హాళ్లను, స్విమ్మింగ్ పూల్, ఇతర క్రీడా కోర్టులను ఏర్పాటు చేయనున్నారు. విశాలమైన స్థలం అవసరం కావటంతో ఆదర్శనగర్‌లోని ఎమ్మెల్యే క్వార్టర్ల స్థలాన్ని దీనికి ఎంపిక చేశారు. ప్రస్తుతం అందులోని క్వార్టర్లలో ఇతరులు ఉంటున్నారు.
వాటి నిర్వహణ కూడా సరిగా లేదు. కొత్త క్వార్టర్లతో కూడిన సముదాయం అందుబాటులోకి వచ్చినందున దీని అవసరమే లేదు. దాదాపు 11 ఎకరాల విస్తీర్ణంలో ఉన్న ఆ ప్రాంతం దీనికి యోగ్యంగా ఉంటుందని గతంలోనే నిర్ణయించారు. తాజాగా బీఏసీలో దీని ప్రస్తావన వచ్చినట్టు తెలిసింది. ముఖ్యమంత్రి, మాజీ ముఖ్యమంత్రులు, స్పీకర్, డిప్యూటీ స్పీకర్, కౌన్సిల్ చైర్మన్, డిప్యూటీ చైర్మన్, మాజీ స్పీకర్లు, డిప్యూటీ స్పీకర్లు, మాజీ చైర్మన్, డిప్యూటీ చైర్మన్లు, మంత్రులు, మాజీ మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, అసెంబ్లీ కార్యదర్శి, ఇతర సిబ్బంది, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, డీజీపీ తదితరులకు ఇందులో సభ్యత్వాలు ఉంటాయని సమాచారం. కానీ దీనిపై ఇంకా స్పష్టత రావాల్సిఉంది.
రెండేళ్ల తర్వాత అందుబాటులోకి..
ఆర్థిక మాంద్యం, ఇతర సమస్యల కారణంగా కొత్త సచివాలయం, అసెంబ్లీ భవన సముదాయ నిర్మాణం జాప్యమయ్యే అవకాశం ఉంది. అన్ని అవాంతరాలు అధిగమించి వాటిని పూర్తి చేసిన తర్వాతనే ఈ కాన్‌స్టిట్యూషన్ క్లబ్ నిర్మాణం ఉంటుందని అధికారులంటున్నారు. రెండుమూడేళ్ల తర్వాత గాని అది అందుబాటులోకి వచ్చే అవకాశం లేదని పేర్కొంటున్నారు.
Comments
Please login to add a commentAdd a comment