ప్రాజెక్టు ఫేస్–1 పనులను పరిశీలిస్తున్న మంత్రి అజయ్
సాక్షి, కొత్తగూడెం: ముఖ్యమంత్రి కేసీఆర్ ఈ నెలలో భద్రాద్రి జిల్లాలో పర్యటించేందుకు రంగం సిద్ధం చేస్తున్నట్లు తెలుస్తోంది. ఇందుకోసం అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. సీఎంను జిల్లాకు తీసుకొచ్చేలా ప్రభుత్వ విప్, పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు కొన్ని నెలలుగా తీవ్రంగా ప్రయత్నిస్తున్నారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారు అయినట్లేనని రేగా తెలిపారు. రాష్ట్ర ప్రభుత్వం కాళేశ్వరం తర్వాత అత్యంత ప్రాధాన్యత ఇస్తున్నది సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుకే. ఖమ్మం, భద్రాద్రి, మహబూబాబాద్ జిల్లాల్లోని 6.7 లక్షల ఎకరాలకు సాగునీరు అందించే లక్ష్యంతో ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా తలపెట్టిన ఈ ఎత్తిపోతల పథకాన్ని రూ.13,884కోట్ల వ్యయంతో నిర్మిస్తున్నారు.
భవిష్యత్తులో ఆయకట్టును 9.36 లక్షల ఎకరాలకు పెంచాలని సైతం ప్రభుత్వం నిర్ణయించింది. ఖమ్మం జిల్లాలోని నాగార్జునసాగర్ కెనాల్ కింద 80 వేల ఎకరాల ఆయకట్టు స్థిరీకరణ కోసం ఏన్కూర్ వద్ద ఒక లింక్ ఇవ్వనున్నారు. భవిష్యత్తులో నాగార్జునసాగర్ ద్వారా సాగునీటి సరఫరాలో ఇబ్బంది వచ్చినా ఆయకట్టుకు ఎలాంటి సమస్య లేకుండా సీతారామతో అనుసంధానం చేయాలని ప్రభుత్వం నిర్ణయించింది. సీతారామ ప్రాజెక్టుకు సంబంధించి దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి 372 కిలోమీటర్ల పొడవున కాలువ నిర్మించనున్నారు. అశ్వాపురం మండలం కుమ్మరిగూడెం వద్ద దుమ్ముగూడెం ఆనకట్ట నుంచి ప్రారంభమయ్యే ఈ ప్రాజెక్టుకు సంబంధించి బీజీకొత్తూరు వద్ద ఫేస్–1 పనులను ముఖ్యమంత్రి పరిశీలించే అవకాశముంది.
ఇక తాజాగా దుమ్ముగూడెం వద్ద రూ.3,400 కోట్లతో మరో ఆనకట్ట నిర్మించాలని సర్కారు నిర్ణయించింది. సీతారామ ఎత్తిపోతల ప్రాజెక్టుతో పాటు, భద్రాద్రి థర్మల్ పవర్ స్టేషన్‌కు నీటి కొరత లేకుండా 30 టీఎంసీలా నీరు నిల్వ ఉండేలా దీనికి రూపకల్పన చేశారు. గోదావరిలో ప్రతిఏటా వస్తున్న వరద నీరంతా వృథాగా సముద్రంలోకి వెళుతోంది. మరోవైపు గత వేసవిలో నీటిమట్టం పూర్తిగా తగ్గడంతో అశ్వాపురం మండలంలోని భారజల కర్మాగారంలో రెండురోజుల పాటు ఉత్పత్తి నిలిపేశారు. దుమ్ముగూడెం హైడల్ ప్లాంట్‌లోనూ విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. దీంతో మరో ఆనకట్ట నిర్మించేలా కార్యాచరణ రూపొందించారు.
రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్..
ఏజెన్సీ ఏరియాలో సాగునీటి కోసం రూ.300 కోట్లతో త్రీఫేస్ విద్యుత్ సరఫరా ఏర్పాటు చేయాలని నిర్ణయించారు. ఈ నేపథ్యంలో ముఖ్యమంత్రి పర్యటన ఖరారైనట్లు సమాచారం. ఈ క్రమంలోనే గత నెల 21న నార్త్‌జోన్ ఐజీ నాగిరెడ్డి మణుగూరు సబ్‌డివిజన్‌లో పర్యటించారు. 30వ తేదీన మంత్రి అజయ్‌కుమార్ పినపాక, భద్రాచలం నియోజకవర్గాల్లో విస్తృతంగా పర్యటించారు. ఇప్పటికే కరీంనగర్ జిల్లాలో ఇరిగేషన్ ప్రాజెక్టుల వద్ద పర్యటించిన సీఎం.. సీతారామ ప్రాజెక్టు వద్దకు రానున్నారు. అలాగే జిల్లాలో పోడు భూముల సమస్య పరిష్కరిస్తానని ఇప్పటికే సీఎం కేసీఆర్ చెప్పడంతో పర్యటన మరింత ప్రాధాన్యం సంతరించుకుంటోంది.
సీఎం పర్యటన ఖాయమైనట్లే
పినపాక నియోజకవర్గంలో అన్ని మండలాలకు పూర్తిస్థాయిలో సాగునీరు అందించడమే లక్ష్యంగా ప్రణాళికలు రూపొందించాం. అందుకే ఉమ్మడి ఖమ్మం జిల్లాలో ముఖ్యమంత్రి పర్యటన మొదట పినపాక నియోజకవర్గంలో ఉండేలా కృషి చేశాను. సీఎం అంగీకారంతో ఇది సాధ్యమవుతోంది. పోడుభూముల సమస్య పరిష్కారానికి కూడా కేసీఆర్ అంగీకరించారు. సీఎం పర్యటన తరువాత ఈ సమస్య కొలిక్కి వస్తుంది.
– రేగా కాంతారావు, ప్రభుత్వ విప్
Comments
Please login to add a commentAdd a comment