రాష్ట్రమంతా నీటితో కళకళలాడాలి | KCR Meeting On Kaleshwaram Project | Sakshi
Sakshi News home page

రాష్ట్రమంతా నీటితో కళకళలాడాలి

Published Sun, Mar 31 2019 1:19 AM | Last Updated on Sun, Mar 31 2019 8:20 AM

KCR Meeting On Kaleshwaram Project - Sakshi

సాక్షి, హైదరాబాద్‌: రాష్ట్రంలో నిర్మాణం చేపట్టిన భారీ సాగునీటి ఎత్తిపోతల పథకాల ద్వారా మొదటి దశలో చెరువులన్నీ నింపాలని ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు అధికారులను ఆదేశించారు. తెలంగాణ భూభాగమంతా నీటితో కళకళలాడేలా చెరువులు, చెక్‌డ్యామ్‌లలో నీటిని నిల్వ చేయాలన్నారు. ప్రాజెక్టుల కింద వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు నీటిని అందించేలా సమగ్ర ప్రణాళికలు సిద్ధం చేయాలని ఆదేశించారు. ప్రాజెక్టులవారీగా సాగునీటి సమర్థ వినియోగానికి సంబంధించి వర్క్‌షాప్‌ నిర్వహించి కార్యాచరణ ప్రణాళిక తయారు చేయాలని సూచించారు. కాళేశ్వరం ప్రాజెక్టు పనుల పురోగతిపై ముఖ్యమంత్రి కేసీఆర్‌ శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షించారు.

ఈ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌. కె.జోషి, సీఎంఓ కార్యదర్శి స్మితా సబర్వాల్, ఓఎస్డీ శ్రీధర్‌ దేశ్‌పాండే, ఈఎన్‌సీలు మురళీధర్‌రావు, హరిరామ్, ఎస్‌ఈలు కె.ఎన్‌. ఆనంద్, టి. వేణు, శ్రీనివాస్, ఈఈలు బుచ్చిరెడ్డి, రవీందర్‌రెడ్డి, బద్రి నారాయణ, సత్యవర్ధన్, అశోక్, పోచమల్లు, కనకేశ్, హైదర్‌ఖాన్‌ పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మేడిగడ్డ, అన్నారం, సుందిళ్ల బ్యారేజీల పనులు, పంపుహౌస్‌ల నిర్మాణాల వివరాలను అడిగి తెలుసుకున్నారు. మేడిగడ్డ నుంచి మిడ్‌మానేరు వరకు నీటిని తరలించడానికి నిర్మిస్తున్న కాలువ పనులపై చర్చించారు. అనంతగిరి, రంగనాయక సాగర్, మల్లన్న సాగర్, కొండపోచమ్మ, గంధమల్ల, బస్వాపూర్‌ తదితర రిజర్వాయర్ల పనులు, కాల్వల పనులు, టన్నెల్‌ పనులపై సమీక్షించారు. కాళేశ్వరం ప్రాజెక్టులో భాగంగా నిర్మిస్తున్న బ్యారేజీలు, పంపుహౌస్‌ల నిర్మాణం ఈ ఎండాకాలంలోనే పూర్తవుతున్నందున గోదావరి నీటిని ఎత్తిపోసి చెరువులు నింపాలన్నారు. ఈ వర్షాకాలంలో చెరువులన్నీ నింపాలని, దీనికోసం కాల్వలకు ఎక్కడెక్కడ తూములు తీయాలో నిర్ణయించి పనులు చేపట్టాలని ఆదేశించారు.

చెరువులే ముందు...
ఇదే సమయంలో కాళేశ్వరం ప్రాజెక్టు నీటితో ముందుగా చెరువులు నింపేందుకే ప్రాధాన్యం ఇవ్వాలని సీఎం కేసీఆర్‌ సూచించారు. ‘భారీ ఎత్తిపోతల పథకాల ద్వారా తెలంగాణలోని భూములకు సాగునీరు ఇవ్వడానికి ప్రభుత్వం అత్యధిక ప్రాధాన్యత ఇస్తోంది. ప్రాజెక్టుల రీ డిజైన్‌ చేపట్టింది. మహారాష్ట్రతో చారిత్రక ఒప్పందం కుదుర్చుకుంది. సీడబ్ల్యూసీ ఆమోదం పొందింది. అటవీశాఖతోపాటు అనేక అనుమతులు తీసుకుంది. భూ సేకరణ ప్రక్రియ కూడా విజయవంతంగా పూర్తి చేసింది. ఈ ప్రాజెక్టుకు పెద్ద ఎత్తున నిధులు ఖర్చు చేస్తోంది. బడ్జెట్‌ నిధులే కాకుండా ఇతర ఆర్థిక సంస్థల నుంచి కూడా నిధులు సేకరించింది. ఇంత చేసిందీ తెలంగాణ రైతులకు సాగునీరు ఇవ్వడానికే.

కాబట్టి అధికారులు ప్రాజెక్టుల ద్వారా వచ్చే నీటిని వీలైనంత ఎక్కువ ఆయకట్టుకు అందించడానికి ప్రాధాన్యత ఇవ్వాలి. మొదటి దశలో చెరువులు నింపాలి. ప్రాజెక్టు కాలువల ద్వారా వచ్చే నీరు, వర్షం నీళ్లు, పడబాటు నీళ్లు అన్నీ చెరువులకు మళ్లాలి. దీనికోసం కావల్సిన కాల్వలను సిద్ధం చేయాలి. తెలంగాణలోని చెరువులు, కుంటలతోపాటు కాల్వలు, వాగులు, వంకలపై పెద్ద ఎత్తున నిర్మించిన చెక్‌ డ్యాముల్లో కూడా నీరు నిల్వ ఉండాలి. తెలంగాణ భూభాగమంతా నీటితో కళకళలాడాలి’అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. ఎన్నో వ్యయ, ప్రయాసలకోర్చి నిర్మి స్తున్న ప్రాజెక్టుల ద్వారా వీలైనంత ఎక్కువ ఆయ కట్టుకు సాగునీరు అందించేలా సమగ్ర ప్రణాళిక రూపొందించాలని అధికారులను ఆదేశించారు.

నిర్వహణ బాధ్యత ఇంజనీర్లదే...
ప్రాజెక్టుల నిర్మాణం పూర్తి చేయడంతోనే నీటిపారుదలశాఖ బాధ్యత పూర్తికాదని, ఆ ప్రాజెక్టులను విజయవంతంగా నిర్వహించాలని సీఎం చెప్పారు. ప్రాజెక్టుల నిర్వహణకు అవసరమైన ప్రణాళిక సిద్ధం చేసుకోవాలని సూచించారు. ఇప్పటికే నడుస్తున్న ప్రాజెక్టులకు అవసరమైన బ్యారేజీలు, రిజర్వాయర్లు, కాల్వల వంటి వ్యవస్థ సిద్ధంగా ఉందని, కానీ కాళేశ్వరంతోపాటు ఇతర కొత్త ప్రాజెక్టులకు అవసరమైన వ్యవస్థలను అంతా కొత్తగా రూపొందించుకోవాల్సి ఉంటుందన్నారు. కొత్త వ్యవస్థలకు రూపకల్పన చేసే క్రమంలోనే జాగ్రత్తగా, వ్యూహాత్మకంగా వ్యవహరించాలని... ఎక్కువ ఆయకట్టుకు నీరిచ్చే ప్రణాళిక రూపొందించాలని చెప్పారు.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement