సూర్యాపేట ప్రజా ఆశీర్వాద సభలో మాట్లాడుతున్న ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్, పక్కన మంత్రి జగదీశ్‌రెడ్డి, నాయకులు
సాక్షిప్రతినిధి, సూర్యాపేట : ‘గత ఎన్నికల్లో సూర్యాపేటకు వచ్చి జగదీశ్‌రెడ్డిని గెలిపించాలని కోరా.. అతను గెలిస్తే మామూలు ఎమ్మెల్యేగా ఉండడని.. మంత్రి అవుతాడని చెప్పిన.. ఆ ప్రకారం నేను అతడ్ని మినస్టర్‌ను చేశా.. ఆయన పెరిగి నేను ఇచ్చిన మాట నిలబెట్టి, ఇవ్వాళ సూర్యాపేటను జిల్లా కేంద్రం చేయించుకున్నాడు. ఈ ఘనత జగదీశ్‌రెడ్డికి దక్కింది’అని ముఖ్యమంత్రి కేసీఆర్ అన్నారు. ఎన్నికల ప్రచారంలో భాగంగా శుక్రవారం సూర్యాపేటలో వ్యవసాయ మార్కెట్ సమీపంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభకు మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అధ్యక్షత వహించగా ఆపద్ధర్మ ముఖ్యమంత్రి కేసీఆర్ ముఖ్య అతిథిగా హాజరై మాట్లాడారు. జగదీశ్‌రెడ్డి మంత్రిగా లేకపోతే, కేసీఆర్ సీఎం కాకపోతే, తెలంగాణ రాష్ట్రం రాకపోతే ఈ జన్మల కూడా సూర్యాపేట జిల్లా అయ్యేది కాదన్నారు. మెడికల్ కాలేజీ ఇవ్వడంతో పాటు ఆస్పత్రిని 600 బెడ్లకు పెంచామని.. ఇవన్నీ మీ కళ్ల ముందే ఉన్నాయని ప్రజలనుద్దేశించి అన్నారు. జిల్లా కేంద్రం కావడంతో అన్నీ ఒకటి తర్వాత ఒకటి అవే పరుగెత్తుకుంటూ వస్తాయన్నారు. సూర్యాపేట నియోజకవర్గంలో 40 కొత్త గ్రామ పంచాయతీలను చేసుకున్నారని, అందులో 35 తండాలు పంచాయతీలయ్యాయని పేర్కొన్నారు. 30 ఏళ్ల కింద శిథిలమైన ముసీ ప్రాజెక్టును ఆధునికీకరించడంతో చివరి భూములకు మూసీ నీళ్లు పోతున్నాయన్నారు. సూర్యాపేట చైతన్య వంతమైన ప్రాంతం అని, జిల్లా వాసి వేణుగోపాల్‌రెడ్డి లాంటి వారి ఆత్మత్యాగాలతో తెలంగాణ తెచ్చుకున్నామని గుర్తుచేశారు.
నాకన్నా దొడ్డుగున్న వారు కరెంట్ ఎందుకు తేలేదు..?
నల్లగొండ జిల్లాలో మనుషులు లేరా..? నా కన్నా రెండింతల దొడ్డుగ ఉన్నరు.. నాకన్నా పిడికెడు ఎత్తు ఉన్నరు.. వాళ్లు తెలంగాణను ఎందుకు తేలే. కరెంట్‌ను ఎందుకు ఇవ్వలేదని కాంగ్రెస్ పార్టీ నేతలను ఉద్దేశించి విమర్శించారు. ఈ సభను చూస్తే పెద్ద మెజార్టీతో జగదీశ్‌రెడ్డి గెలిచిపోయిండని అర్థమైందని, ఇందులో ఎవ్వరికి అనుమానం లేదన్నారు. ఓటు వేసే ముందు నాలుగున్నరేళ్లలో నియోజకవర్గానికి ఏం జరిగిందో దాన్ని చూసి వేయాలని కోరారు.
చీకట్లను పారదోలిన ఘనత జగదీశ్‌రెడ్డిదే:
రాష్ట్రంలో చిమ్మచీకట్లను పారదోలిన ఘనత జగదీశ్‌రెడ్డికే దక్కిందని కేసీఆర్ కొనియాడారు. విద్యుత్‌చ్ఛక్తి రంగంలో తెలంగాణ ఆ ప్రగతి సాధించిందంటే నాకు ఎంత గౌరవం దొరుకుతదో అంతే సమానంగా విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్‌రెడ్డికి కూడా లభిస్తుందని పేర్కొన్నారు. రాత్రిబవళ్లు తిరిగి కష్టపడ్డాడడని.. కొన్ని సందర్భాల్లో హెలికాప్టర్ ఇస్తానన్నా వద్దని రోడ్డమీదనే పోయాడని చెప్పారు. రాత్రింబవళ్లు కష్టపడితే ఈ రోజు ముఖం తెలివికి వచ్చినం అని అన్నారు. కిరణ్‌కుమార్‌రెడ్డి సీఎంగా ఉన్నప్పుడు.. తెలంగాణ అయితే మీకు తెలివి తక్కువని మాట్లాడిండడని.. పరిపాలన చేయరాదని, రాష్ట్రం చీమ్మచీకటి అయితదన్నడని గుర్తుచేశారు.
వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం నీళ్లు..
వచ్చే జూన్ తర్వాత కాళేశ్వరం ప్రాజెక్టు స్విచ్‌ఆన్ అవుతుందని.. సూర్యాపేటకు రెండు పంటలకు నీళ్లు తెచ్చే బాధ్యత తాను తీసుకుంటానని అన్నారు. గతంలో ఉన్నవాళ్లు సూర్యాపేట పట్టణ వాసులకు మూసీ మురికినీళ్లు తాగించారని, కానీ జగదీశ్‌రెడ్డి మిషన్ భగీరథతో స్వచ్ఛమైన నీళ్లు తెచ్చి బ్రహ్మాండమైన శుద్ధజలం ఇక్కడి వాసులకు అందిస్తున్నారని చెప్పారు. ఆటోనగర్, ఇండ్రస్టీయల్ పార్కును సూర్యాపేటకు తెచ్చిపెడతామని, సూర్యాపేటకు డ్రైపోర్టు వచ్చే అవకాశం ఉందన్నారు. మళ్లీ కారు గుర్తుకు ఓటేసి జగదీశ్‌రెడ్డిని భారీ మెజార్టీతో గెలిపించాలని కోరారు. కార్యక్రమంలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్, ఉప ముఖ్య మంత్రి కడియం శ్రీహరి, ఎంపీలు బడుగుల లింగయ్యయాదవ్, గుత్తా సుఖేందర్‌రెడ్డి, ఎమ్మెల్సీ పూల రవీందర్, మాజీ మంత్రి ఎలిమినేటి ఉమామాధవరెడ్డి, మార్కెట్ చైర్మన్ వై.వెంకటేశ్వర్లు, జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ నిమ్మల శ్రీనివాస్‌గౌడ్, మున్సిపల్ చైర్‌పర్సన్ గండూరి ప్రవళ్లికప్రకాశ్, నాయకులు వర్దెల్లి శ్రీహరి, కాకి కృపాకర్‌రెడ్డి, గండూరి ప్రకాష్, కాకి దయాకర్‌రెడ్డి, శనగాని రాంబాబుగౌడ్, డాక్టర్ వూర రామ్మూర్తియాదవ్, నేరెళ్ల లక్ష్మి, నంద్యాల దయాకర్‌రెడ్డి, వూర గాయత్రి, పుట్ట కిషోర్, నాతి సవీందర్, నేరెళ్ల మధు, బైరు దుర్గయ్యగౌడ్, నర్సింహారెడ్డి, రాజా, రాములు, రంగారెడ్డి, భిక్షం, నాగిరెడ్డి, నర్సయ్యయాదవ్, ఉప్పల ఆనంద్, లచ్చిరాంనాయక్, శ్రీనివాస్‌గౌడ్, నాగిరెడ్డి, వన జ, ఇంద్రసేనారావు, రమేష్, ఉపేందర్‌రావు, షేక్ తాహేర్‌పాషా, కిరణ్, నర్సింహారావు, వెంకటేశ్వర్లు తదితరులు పాల్గొన్నారు.
దేశంలోనే నంబర్ వన్ రాష్ట్రం తెలంగాణ : జగదీశ్‌రెడ్డి
అన్ని సంక్షేమ పథకాల అమలుతో నేడు తెలంగాణ రాష్ట్రం దేశంలో మొదటిస్థానంలో కొనసాగుతుందంటే అది కేసీఆర్ ఘనతేనని మంత్రి గుంటకండ్ల జగదీశ్‌రెడ్డి అన్నారు. 58 ఏళ్లుగా అభివృద్ధికి నోచుకోని తెలంగాణను అభివృద్ధి పథంలో నడిపిస్తున్న ఘనుడు కేసీఆర్ అని కొనియాడారు. కేసీఆర్ సూర్యాపేటను కూడా సిద్దిపేటతో సమానంగా అభివృద్ధి చేస్తానని.. ఇక్కడ జగదీశ్‌రెడ్డిని శాసనసభ్యుడిగా చేస్తే.. అనుకున్న దానికంటే ఎక్కువగా అభివృద్ధి చేస్తానని ఇచ్చిన హామీని నిలబెట్టుకున్నారని పేర్కొన్నారు. గత ఎన్నికల ముందు సూర్యాపేటకు వచ్చిన సందర్భంలో ఇచ్చిన మాటను నిలబెట్టుకొని సూర్యాపేటను తెలంగాణ రాష్ట్రానికే తలమానికంగా తీర్చిదిద్దేలా సహకరించిన ముఖ్యమంత్రికి ధన్యవాదాలు తెలిపారు. అధ్వానంగా ఉన్న రోడ్లకు రూ.500 కోట్లకు పైగా నిధులు తెచ్చి అభివృద్ధి చేశామని, రూ.75 కోట్లతో గ్రామీణ అంతర్గత రోడ్ల నిర్మాణం చేపట్టామని తెలిపారు. రూ. 3,800 కోట్లు తెచ్చి వివిధ అభివృద్ధి కార్యక్రమాలు చేశామని.. ఇది కేవలం టీఆర్‌ఎస్‌తోనే సాధ్యమైందన్నారు.
నాయకుడు కాదు.. సేవకుడు : ఎంపీ బడుగుల
తాళ్లగడ్డ/దురాజ్‌పల్లి (సూర్యాపేట) : జగదీశ్‌రెడ్డి నాయకుడు కాదు.. ప్రజా సేవకుడు అని రాజ్యసభ సభ్యుడు బడుగుల లింగయ్యయాదవ్ అన్నారు. ప్రస్తుతం సూర్యాపేట ప్రజలు గుండెమీద చెయ్యి వేసుకుని నిద్రపోతున్నారంటే అది టీఆర్‌ఎస్, మంత్రి జగదీశ్‌రెడ్డి పాలనలోనే అని పేర్కొన్నారు. శుక్రవారం జిల్లా కేంద్రంలోని అంబేద్కర్‌నగర్‌లో నిర్వహించిన ప్రజా ఆశీర్వాద సభలో ఎంపీ బడుగుల మాట్లాడారు. జిల్లా ఏర్పాటు దగ్గర నుంచి జిల్లాలో నూతన కలెక్టరేట్ నిర్మాణం, మినీ ట్యాంక్‌బండ్, మున్సిపాలిటీలో అంతర్గత రోడ్లు, మెడికల్ కళాశాల నిర్మాణాలు జరుగుతున్నాయంటే అది కేవలం జగదీశ్‌రెడ్డి వల్లే అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment