బంగారు తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి | KCR promises overall development of Muslim community | Sakshi
Sakshi News home page

బంగారు తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి

Published Wed, Aug 16 2017 1:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:37 PM

బంగారు తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి - Sakshi

బంగారు తెలంగాణ కోసం అల్లాను ప్రార్థించండి

భవిష్యత్తులో మైనార్టీల సంక్షేమానికి రూ.12 వేల కోట్ల బడ్జెట్‌  
► వృద్ధి రేటులో రాష్ట్రం నంబర్‌ వన్‌: కేసీఆర్‌  
► హజ్‌ యాత్రను ప్రారంభించిన సీఎం  


సాక్షి, హైదరాబాద్‌: బంగారు తెలంగాణ సాధన కోసం అల్లాను ప్రార్థించాలని హజ్‌ యాత్రికులకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు విజ్ఞప్తి చేశారు. రాష్ట్రం అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించాలని, ప్రజలు సుఖశాంతులతో జీవించాలని హజ్‌ ఆరాధనల్లో దువా చేయాలని కోరారు. మంగళవారం రాష్ట్ర హజ్‌ కమిటీ ఆధ్వర్యంలో హజ్‌ యాత్రికుల బస్సును జెండా ఊపి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా కేసీఆర్‌ మాట్లాడుతూ... యాత్రికులు విజయవంతంగా యాత్ర పూర్తి చేసుకొని తిరిగి రావాలని ఆకాంక్షిం చారు.

వారికి ఎలాంటి ఇబ్బందులు కలగకుండా ప్రభుత్వం అన్ని ఏర్పాట్లూ చేసిందన్నారు. నిజాం పాలకులు మక్కా, మదీనాలో నిర్మించిన రుబాత్‌లో తెలంగాణ ఏర్పడిన నాటి నుంచి గతంలో ఎన్నడూ లేనంతగా 1,280 మంది యాత్రికులకు ఉచిత వసతులు కల్పిస్తున్నట్లు తెలిపారు. ‘తెలంగాణ ఉద్యమ సమయంలో ప్రధాని, కేంద్ర మంత్రులు, రాజకీయ నేతలు ప్రత్యేక రాష్ట్రం ఎందుకని అడిగేవారు. ఇక్కడి సంస్కృతి, సంప్రదాయాలు దేశంలో ఎక్కడా లేవని వారికి చెప్పాను. వారికి తెలంగాణ కట్టుబాట్లు పరిచయం చేశాను.

1927లో గాంధీజీ హైదరాబాద్‌ సంస్థానానికి వచ్చినప్పుడు నిజాం పరిపాలన, హిందూ.. ముస్లింల ఐక్యతకు ఎంతో ప్రభావితమయ్యారు. ఇక్కడి సంస్కృతిని ఉత్తర భారతీయులు నెర్చుకోవాలని ఆయన చెప్పారు. నిజాం దాన గుణం గల వ్యక్తి. ప్రపంచంలో హైదరాబాద్‌కు ధనిక సంస్థానంగా పేరుండేది. చైనా యుద్ధ సమయంలో నాటి ప్రధాని ఆర్థిక సాయం కోరగా దేశంలో నిజాం తప్ప ఎవరూ స్పందించలేదు. నిజాం ఆరు టన్నుల బంగారం ఇచ్చి పంపించారు. బంగారాన్ని తిరిగి ఇస్తామంటే... ముందు దేశ రక్షణకు పాటుపడమని నిజాం పేర్కొన్నారు’ అని కేసీఆర్‌ కొనియాడారు.  

సీఎం అంటే ప్రధాన సేవకుడు...  
మూడేళ్లలో రాష్ట్ర వృద్ధి రేటు 21 శాతానికి చేరుకుందని సీఎం చెప్పారు. వృద్ధి రేటులో దేశంలోనే తెలంగాణ నంబర్‌ వన్‌గా ఉంద న్నారు. ఛత్తీస్‌గఢ్‌ 10.05 శాతంతో రెండో స్థానంలో ఉందన్నారు. ఉమ్మడి ఏపీలో రాష్ట్రా నికి ఎంతో నష్టం జరిగిందన్నారు. మైనార్టీ లు అన్ని రంగాల్లో అభివృద్ధి సాధించేలా ప్రభు త్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందన్నారు. ‘మైనార్టీ పిల్లల కోసం రాష్ట్ర వ్యాప్తంగా 204 గురుకుల పాఠశాలలు ప్రారంభించి, అంతర్జాతీయ స్థాయిలో విద్యా బోధన సాగిస్తున్నాం.

ఓ గ్రామంలో ఎమ్మెల్సీ ఫారుఖ్‌హుస్సేన్‌ మైనార్టీ గురుకుల పాఠశాల సందర్శనకు వెళ్లినప్పు డు... విద్యా బోధన, సౌకర్యాల గురించి ఆరా తీశారు. తమ పిల్లలకు ఇలాంటి విద్య, సౌకర్యలు లభిస్తాయని ఉహించలేదంటూ తల్లిదండ్రులు కంట తడి పెట్టుకున్నారని ఫారుఖ్‌ చెప్పారు. ఒక్కో విద్యార్థిపై ప్రభుత్వం రూ.1.25 లక్షలు ఖర్చు చేస్తోంది. మైనార్టీ సంక్షేమానికి ఈ ఏడాది రూ.12 వందల కోట్లు కేటాయించింది. ఐదేళ్లలో దీనిని రూ.12 వేల కోట్లకు పెంచే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. ఈ మూడేళ్లలో రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు సురక్షితంగా, సుఖశాంతులతో ఉన్నారు. ముఖ్యమంత్రి అంటే ప్రధాన సేవకుడు మాత్రమే’ అని సీఎం చెప్పారు.  

కేసీఆర్‌తోనే మైనార్టీల అభివృద్ధి: మహమూద్‌ అలీ
దేశంలోని హజ్‌ కమిటీల ఏర్పాట్ల కంటే తెలంగాణ హజ్‌ కమిటీ ఏర్పాట్లు అద్భుతంగా ఉన్నట్లు కేంద్ర హజ్‌ కమిటీ సభ్యులు కితాబిచ్చారని ఉప ముఖ్యమంత్రి మహమూద్‌అలీ చెప్పారు. మైనార్టీ సంక్షేమం, అభివృద్ధి జరగాలంటే పదేళ్లు కేసీఆర్‌ నేతృత్వంలోని టీఆర్‌ఎస్‌ పార్టీ అధికారంలో ఉంటేనే సాధ్యమన్నారు.

ఉమ్మడి రాష్ట్రంలో అప్పటి ప్రభుత్వం హజ్‌ కమిటీకి కేవలం రూ.కోటిన్నర కేటాయిస్తే, తెలంగాణ ఏర్పాటు అనంతరం కేసీఆర్‌ ప్రభుత్వం రూ.3 కోట్లు కేటాయిస్తున్నట్లు తెలిపారు. కార్యక్రమంలో మైనార్టీ సంక్షేమ శాఖ సలహాదారుడు ఏకే ఖాన్, కార్యదర్శి సయ్యద్‌ ఉమర్‌ జలీల్, హజ్‌ కమిటీ ప్రత్యేక అధికారి ఎస్‌ఎ షుకూర్, వక్ఫ్‌ బోర్డు చైర్మన్‌ మహ్మద్‌ సలీం, మైనార్టీ ఫైనాన్స్‌ కార్పొరేషన్‌ చైర్మన్‌ అక్బర్‌హుస్సేన్, ఎమ్మెల్సీలు ఫారుఖ్‌ హుస్సేన్, ఫరీదుద్దీన్, టీఆర్‌ఎస్‌ మైనార్టీ నేతలు ముజీబ్, మసీవుల్లాఖాన్‌ పాల్గొన్నారు. 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement