
ఎనిమిదోసారి ఏకగ్రీవం
టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖరరావు ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు.
టీఆర్‌ఎస్ అధ్యక్షునిగా కేసీఆర్
పార్టీ నేతల అభినందనల జల్లు.. కార్యకర్తల సంబరాలు
హైదరాబాద్: టీఆర్‌ఎస్ అధ్యక్షుడిగా కె.చంద్రశేఖరరావు ఎనిమిదోసారి ఏకగ్రీవంగా ఎన్నికయ్యారు. ఆ పార్టీ ఎన్నికల అధికారి నాయిని నర్సింహారెడ్డి శుక్రవారమిక్కడ ప్లీనరీ వేదికపై అధికారికంగా ఈ ప్రకటన చేశారు. ‘మన కల నిజమైంది. తెలంగాణ తల్లిని బంధ విముక్తిని చేసేందుకు 2001లో కేసీఆర్‌ను అధ్యక్షునిగా చేసిన రోజే మన పంట పండింది. 14 ఏళ్లుగా ఎన్నో కష్టాలు.. ఇబ్బందులను ఎదురొడ్డి కేసీఆర్ నాయకత్వాన్ని కాపాడుకున్నాం. ఫలితంగా తెలంగాణ రాష్ట్రం తెచ్చుకున్నాం. ఇది సువర్ణాక్షరాలతో లిఖించాల్సిన చరిత్ర. ప్రజాస్వామ్య పద్ధతిలో పార్టీకి ఎన్నికలు నిర్వహించాం. మంత్రులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, జడ్పీ అధ్యక్షులు, స్టీరింగ్ కమిటీ మెంబర్ల నుంచి అయిదు సెట్ల నామినేషన్లు వచ్చాయి. వీటన్నింటా కేసీఆర్ నామినేషన్ ఒక్కటే దాఖలైంది. అందుకే ఆయనను ఏకగ్రీవంగా ఎన్నికైనట్లు ప్రకటిస్తున్నా’ అని చెప్పారు. వెంటనే వేదికపై ఉన్న మంత్రులు, పార్లమెంటరీ కార్యదర్శులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ముఖ్యనేతలందరూ కేసీఆర్‌కు పుష్పగుచ్ఛాలు అందించి అభినందనలు తెలిపారు. వేదికపై పూలవర్షం కురిపించారు. ఎల్‌బీ స్టేడియం వెలుపలా కార్యకర్తలు బాణాసంచా కాల్చి సంబరాలు జరుపుకున్నారు.
డప్పు మోగించిన కేసీఆర్
హైదరాబాద్‌లోని ఎల్‌బీ స్టేడియంలో ఏర్పాటు చేసిన తెలంగాణ రాష్ట్ర సమితి ప్లీనరీ నిర్ణీత సమయం కంటే గంట ఆలస్యంగా ప్రారంభమైంది. ఉదయం 12 గంటలకు ముఖ్యమంత్రి, పార్టీ అధ్యక్షుడు కేసీఆర్ ప్లీనరీ వేదికపైకి చేరుకున్నారు. ముందుగా జ్యోతి ప్రజ్వలన చేసి ప్రారంభించారు. అక్కడే ఏర్పాటు చేసిన తెలంగాణ అమర వీరుల స్థూపం వద్ద నివాళులర్పించి పార్టీ పతాకాన్ని ఆవిష్కరించారు. అనంతరం ప్లీనరీ ప్రారంభ సూచికగా కేసీఆర్ డప్పు మోగించారు. తెలంగాణలోని పది జిల్లాల నుంచి పార్టీ శ్రేణులు భారీ సంఖ్యలో ప్లీనరీకి తరలి వచ్చాయి. పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి ప్రారంభోపన్యాసం చేశారు. పార్టీ సంస్థాగత నిర్మాణం, సభ్యత్వ నమోదు, జిల్లాల వారీగా సంస్థాగత ఎన్నికలకు సంబంధించిన నివేదికను చదివి వినిపించారు. అనంతరం పార్టీ సెక్రటరీ జనరల్, ఎంపీ కేశవరావు తొలి పలుకులు వినిపించారు.
పునర్నిర్మాణ యజ్ఞం: పల్లా రాజేశ్వరరెడ్డి
ప్రజలు, ప్రభుత్వానికి మధ్య పార్టీ కార్యకర్తలు వారధిగా పని చేయాలని పార్టీ అడ్‌హాక్ కమిటీ కన్వీనర్ పల్లా రాజేశ్వరరెడ్డి అన్నారు. ‘టీఆర్‌ఎస్ కార్యకర్తలంటే తెలంగాణ సమాజాన్ని జాగృతపరిచిన స్వయం సేవకులు. తెలంగాణ సమాజమంతా టీఆర్‌ఎస్, కేసీఆర్ వైపు చూస్తోంది. అందుకే తెలంగాణ పునర్నిర్మాణంలో పాలుపంచుకునే బాధ్యత మనందరిపై ఉంది. ఇది పవిత్ర యజ్ఞం. ఉద్యమంలో ఎన్నో కష్టనష్టాలు చవిచూసిన కార్యకర్తలు పునర్నిర్మాణంలోనూ బాధ్యతాయుతంగా వ్యవహరించాలి’ అని అభిప్రాయపడ్డారు. ఉద్యమకారుడే పాలకుడైన సందర్భం చరిత్రలో కొత్త అధ్యాయానికి తెర లేపిందన్నారు.
కేసీఆరే అసలైన లీడర్: ఎంపీ కేశవరావు
గత పది నెలల్లో తెలంగాణ రాష్ట్రంలో జరిగిన ప్రగతి దేశంలో ఎక్కడా జరగలేదని పార్టీ సెక్రెటరీ జనరల్ కేశవరావు అన్నారు. ‘తెలంగాణ వచ్చింది.. నా జీవితం ధన్యమైంది. నేను పాటలు రాసుకుంటూ ఉండొచ్చు. ఇంతకంటే పరిపూర్ణత ఏముంది.. అని ఇటీవల కళాకారుల సదస్సులో సీఎం కేసీఆర్ అన్నట్లు టీవీలో చూశాను. తెలంగాణ సాధించిన తర్వాత పీడిత సమాజానికి విముక్తి కల్పించాలనేదే ఆయన తపన. రాష్ట్రం వచ్చేది నిజమే. ఈ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఎవరు కావాలా..? అని నేను కాంగ్రెస్‌లో ఉన్నప్పుడే కేసీఆర్ ఒకసారి అడిగారు. మీరే కావాలని నేను చెప్పాను. ఆయన చాలాసార్లు ముఖ్యమంత్రి బాధ్యతలు చేపట్టేందుకు నిరాకరించారు. ఆ విషయంలో ఆయన ఓడిపోయారు గానీ.. తెలంగాణ గెలిచింది. తెలంగాణకు కావాల్సిన నాయకత్వం దొరికింది’ అని కేకే అన్నారు.