మళ్లీ వస్తా: సీఎం కేసీఆర్
నేనొచ్చేలోగా అల్లం పంట పనులు పూర్తి చేయాలని బాధ్యులకు సూచన
జగదేవ్‌పూర్: ‘ఫాంహౌస్‌కు మళ్లీ వస్తా.. అప్పటి వరకు అల్లం పంట విత్తే పనులు అయిపోవాలి. ఆలస్యం చేయొద్దు’ అంటూ ముఖ్యమంత్రి కేసీఆర్ తన వ్యవసాయక్షేత్రంలో ఆదివారం బాధ్యులకు పలు సూచనలు చేసినట్లు తెలిసింది. ఐదు రోజులుగా ఫాంహౌస్‌లోనే గడిపిన కేసీఆర్.. మధ్యాహ్నం 3:40 గంటలకు తన కాన్వాయ్‌లో హైదరాబాద్ బయలుదేరారు. కాన్వాయ్ సిద్ధం కాగానే మళ్లీ ఓ సారి అల్లం పంట విత్తే సాగు వైపు వెళ్లి కూలీలతో మాట్లాడి పలు సూచనలు చేసినట్టు తెలిసింది.
మంగళవారం రాత్రి హైదరాబాద్ నుంచి వచ్చిన సీఎం కేసీఆర్ ఆదివారం మధ్యాహ్నం వరకు ఫాంహౌస్‌లోనే గడిపారు. ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టిన నాటి నుంచి ఫాంహౌస్‌లో ఎక్కువ రోజులు గడిపింది ఇప్పుడే. ఇక్కడి నుంచే రాష్ట్ర రాజకీయాలను నడిపించినట్లు తెలుస్తోంది.
హరితహారంపై దృష్టి పెట్టాలి
కేసీఆర్ హైదరాబాద్‌కు వెళుతున్న సందర్భంగా జాయింట్ కలెక్టర్ వెంకట్రామిరెడ్డి, గడా అధికారి హన్మంతరావు, సిద్దిపేట ఆర్డీఓ ముత్యంరెడ్డిలు ఉదయమే ఫాంహౌస్‌కు చేరుకున్నట్లు తెలిసింది. కొద్దిసేపు సీఎం వారితో జిల్లాలో జరుగుతున్న అభివృద్ధి పనులపై ఆరా తీసినట్లు తెలిసింది. నర్సన్నపేట, దామరకుంట, తదితర గ్రామాల్లో అభివృద్ధి పనులను కూడా అడిగినట్టు తెలిసింది. జిల్లాలో హరితహారం కార్యక్రమం ఉద్యమంలా జరగాలని సూచించినట్లు సమాచారం.