
సాక్షి, హైదరాబాద్: జిల్లా కేంద్ర సహకార బ్యాంకు (డీసీసీబీ), జిల్లా సహకార మార్కెటింగ్ సొసైటీ (డీసీఎంఎస్) మేనేజింగ్ కమిటీ ఎన్నికల నామినేషన్లు మంగళవారం స్వీకరిస్తారు. నామినేషన్ల పరిశీలన, ఉప సంహరణ కార్యక్రమం మంగళవారం సాయంత్రం ఐదు గంటల లోపు పూర్తి కానుంది. మేనేజింగ్ కమిటీ సభ్యుల ఎన్నిక ఏకగ్రీవం కాని పక్షంలో ఈ నెల 28న ఎన్నిక నిర్వహించి, అదే రోజు సాయంత్రం ఫలితాన్ని ప్రకటిస్తారు. తిరిగి ఈ నెల 29న డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్, వైస్ చైర్మన్ ఎన్నిక నిర్వహించి నూతన పాలక మండలికి బాధ్యతలు అప్పగిస్తారు. హైదరాబాద్ మినహా రాష్ట్రంలోని పూర్వం ఉమ్మడి జిల్లాల వారీగా తొమ్మిది డీసీసీబీ, డీసీఎంఎస్‌ల పాలక మండలి ఎన్నికలను సహకార ఎన్నికల అథారిటీ నిర్వహిస్తోంది.
ఒక్కో డీసీసీబీకి 20 మందిని మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నుకోవాల్సి ఉండగా, ఇందులో ఏ క్లాస్ సొసైటీలుగా పేర్కొనే ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల నుంచి 16 మందిని ఎన్నుకుంటారు. బీ క్లాస్ సొసైటీలుగా పేర్కొనే చేనేత, ఉద్యోగ, గీత, మత్స్య సహకార సంఘాల నుంచి నలుగురిని ఎన్నుకుంటారు. డీసీఎంఎస్‌లకు పది మంది డైరెక్టర్లను ఎన్నుకోవాల్సి ఉండగా, ఏ క్లాస్ సొసైటీల నుంచి ఆరుగురు, బీ క్లాస్ సొసైటీల నుంచి నలుగురిని ఎన్నుకుంటారు.
డీసీసీబీలన్నీ టీఆర్‌ఎస్ ఖాతాలోకే!
ఇటీవల జరిగిన ప్రాథమిక వ్యవసాయ సహకార సంస్థల (పీఏసీఎస్) ఎన్నికల్లో మెజారిటీ స్థానాల్లో టీఆర్‌ఎస్ మద్దతుదారులే చైర్మన్లుగా ఎన్నికయ్యారు. డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీ ఎన్నికల్లో వీరి ఓట్లే కీలకం కానుండటంతో మేనేజింగ్ కమిటీ సభ్యులు కూడా టీఆర్‌ఎస్‌కు చెందిన వారే ఎన్నికయ్యే అవకాశముంది. చాలాచోట్ల పోటీ లేకుండా టీఆర్‌ఎస్ మద్దతుదారులను మేనేజింగ్ కమిటీ సభ్యులను ఏకగ్రీవంగా ఎన్నుకునే ప్రయత్నాలు సాగుతున్నాయి. ఈ మేరకు మంత్రులు రెండు రోజులుగా ఉమ్మడి జిల్లాల వారీగా ఎమ్మెల్యేలు, కీలక నేతల నుంచి అభిప్రాయ సేకరణ చేసి ఆశావహుల జాబితాను రూపొందించారు. మరోవైపు డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులను ఆశిస్తున్న టీఆర్‌ఎస్ నేతలు మేనేజింగ్ కమిటీ సభ్యులుగా నామినేషన్లు వేసేందుకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మేనేజింగ్ కమిటీ సభ్యులుగా ఎన్నికైన వారే డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులకు పోటీ పడే అవకాశం ఉంటుంది.
పీఏసీఎస్ డైరెక్టర్, చైర్మన్ పదవుల ఎంపికలో స్థానిక టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు క్రియాశీలకంగా వ్యవహరించారు. ప్రస్తుతం జరిగే డీసీసీబీ, డీసీఎంఎస్ మేనేజింగ్ కమిటీ పదవులను ఆశించే వారి ఎంపికను మాత్రం సంబంధిత జిల్లా మంత్రులకు అప్పగించారు. మరోవైపు జిల్లాల వారీగా డీసీసీబీ, డీసీఎంఎస్ చైర్మన్ పదవులు ఆశిస్తున్న ఆశావహుల జాబితాను జిల్లాల వారీగా క్రోడీకరించి పార్టీ అధినేత, సీఎం కేసీఆర్‌కు జిల్లా మంత్రులు, పార్టీ ప్రధాన కార్యదర్శులు అప్పగించినట్లు సమాచారం.
జాబితాకు తుదిరూపు..
టెస్కాబ్ చైర్మన్ పదవిని ఆశిస్తున్న కొందరు టీఆర్‌ఎస్ నేతలు డీసీసీబీ చైర్మన్ పదవి కోసం ప్రయత్నాలు సాగిస్తున్నారు. ఈ పదవి దక్కని కొందరు నేతలకు డీసీఎంఎస్ చైర్మన్ పదవిని ఇవ్వడం ద్వారా సంతృప్తి పరిచే అవకాశం ఉంది. ఉమ్మడి జిల్లాల వారీగా.. డీసీసీబీ పీఠం కోసం నల్లగొండ నుంచి గొంగిడి మహేందర్‌రెడ్డి, మల్లేశ్ గౌడ్, ఏసిరెడ్డి దయాకర్‌రెడ్డి పేర్లు పరిశీలనలో ఉన్నాయి. పాలమూరు నుంచి మాజీ ఎమ్మెల్యే గురునాథ్‌రెడ్డికి కేటీఆర్ ఇప్పటికే హామీ ఇచ్చారు. మెదక్ నుంచి దేవేందర్‌రెడ్డి, డీసీసీబీ మాజీ చైర్మన్ చిట్టి దేవేందర్‌రెడ్డి, బక్కి వెంకటయ్య పేర్లు సీఎం పరిశీలనకు పంపినట్లు సమాచారం. రంగారెడ్డి జిల్లా నుంచి మనోహర్‌రెడ్డి, నవాబ్‌పేట మండలం అర్కతలకు చెందిన పోలీస్ రాంరెడ్డి, డీసీసీబీ మాజీ అధ్యక్షుడు లక్ష్మారెడ్డి పదవిని ఆశిస్తున్నారు.
ఉద్యమ సమయం నుంచి పార్టీలో ఉన్న రాంరెడ్డి, మనోహర్‌రెడ్డి పేర్లు సీఎం పరిశీలనకు వెళ్లినట్లు తెలిసింది. కరీంనగర్ నుంచి టెస్కాబ్ మాజీ చైర్మ న్ కె.రవీందర్‌రావు, నిజామాబాద్ నుంచి అసెంబ్లీ స్పీకర్ పోచారం శ్రీనివాస్‌రెడ్డి తనయుడు భాస్కర్‌రెడ్డి, ఆదిలాబాద్ నుంచి అడ్డి బోజారెడ్డి, దామోదర్‌రెడ్డి, వరంగల్ నుంచి మార్నేని రవీందర్‌రావు, గుండేటి రాజేశ్వర్‌రెడ్డి, ఖమ్మం జిల్లా నుంచి తు ళ్లూరు బ్రహ్మయ్య, సత్వాల శ్రీనివాస్‌రావు, కూరాకుల నాగభూషణం పేర్లు జాబితాలో ఉన్నాయి.
Comments
Please login to add a commentAdd a comment