సాక్షి, హైదరాబాద్: హుజూరాబాద్ ఉప ఎన్నికలో విజయమే లక్ష్యంగా పావులు కదుపుతున్న సీఎం కె.చంద్రశేఖర్‌రావు రోజుకో వ్యూహాన్ని తెరమీదకు తెస్తున్నారు. దళితబంధు పథకం, ఇతర పార్టీల నుంచి చేరికలు, అభ్యర్థి ఖరారుపై కసరత్తు పూర్తిచేసిన కేసీఆర్.. రాజకీయ నిర్ణయాల్లో మరింత వేగం పెంచాలని నిర్ణయించారు. రాష్ట్రంలో ఇటీవల దూకుడు పెంచిన జాతీయ పార్టీలకు కళ్లెం వేయడం, తెరమీదకు కొత్తగా వస్తున్న రాజకీయ శక్తులకు చెక్ పెట్టడం లక్ష్యంగా సరికొత్త అస్త్రాలపై దృష్టిపెట్టారు. ఇందులో భాగంగా ‘దళితబంధు’ పథకానికి వీలైనంత త్వరగా చట్టబద్ధత కల్పించి, దానికి చైర్మన్‌గా మాజీ మంత్రి మోత్కుపల్లి నర్సింహులును నామినేట్ చేయాలని సీఎం కేసీఆర్ నిర్ణయించినట్టు విశ్వసనీయ వర్గాల సమాచారం. మోత్కుపల్లి నర్సింహులు
ఇప్పటికే బీజేపీకి రాజీనామా చేసినా అధికారికంగా టీఆర్‌ఎస్‌లో చేరలేదు. ఇది వ్యూహాత్మకంగానే వాయిదా పడిందని, కొద్దిరోజులుగా కేసీఆర్‌పై పొగడ్తల వర్షం కురిపిస్తున్న మోత్కుపల్లి టీఆర్‌ఎస్ ఆహ్వానం విషయాన్ని ఇప్పటికే ధ్రువీకరించారని పార్టీ వర్గాలు చెప్తున్నాయి. మరోవైపు ‘దళిత బంధు’ ప్రకటన తర్వాత విపక్షాల నుంచి వస్తున్న విమర్శలు, సవాళ్లకు మంత్రివర్గ విస్తరణ ద్వారా చెక్ పెట్టాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నారని.. హుజూరాబాద్ ఉప ఎన్నిక షెడ్యూల్ రాకముందే కేబినెట్‌లో మార్పులు జరగవచ్చని వెల్లడిస్తున్నాయి.
మంత్రివర్గంలో ఎస్సీల ప్రాతినిధ్యం పెంపు
రాష్ట్ర మంత్రివర్గంలో ఇటీవలి వరకు సీఎం కేసీఆర్ సహా 17 మంది ఉండగా.. ఈటల రాజేందర్ తొలగింపు తర్వాత 16 మందితో కొనసాగుతోంది. ఇందులో ఎస్సీ సామాజిక వర్గం నుంచి కొప్పుల ఈశ్వర్ (మాల సామాజికవర్గం) ఒక్కరే కేబినెట్‌లో ఉన్నారు. ఈ నేపథ్యంలోనే మంత్రివర్గ విస్తరణలో ఎస్సీ సామాజికవర్గం ప్రాతినిధ్యం పెంచాలని.. మాదిగ సామాజిక వర్గానికి ప్రాధాన్యత ఇవ్వాలని సీఎం కేసీఆర్ భావిస్తున్నట్టు సమాచారం.
శాసనసభలో ఎస్సీ కేటగిరీలో 19 మంది ఎమ్మెల్యేలు ఉండగా.. వారిలో 18 మంది టీఆర్‌ఎస్ నుంచే ప్రాతినిధ్యం వహిస్తున్నారు. ఇందులో ఎనిమిది మంది మాల, తొమ్మిది మంది మాదిగ సామాజిక వర్గం వారుకాగా.. బెల్లంపల్లి ఎమ్మెల్యే దుర్గం చిన్నయ్య నేతకాని సామాజికవర్గానికి చెందినవారు. తాజా విస్తరణలో కొత్తగా ఒకరిద్దరికి అవకాశం దక్కుతుందని అంచనా వేస్తున్నారు. ప్రధానంగా బాల్క సుమన్, గువ్వల బాలరాజు, సండ్ర వెంకట వీరయ్య పేర్లు పరిశీలనలో ఉన్నాయని.. వారికి సంబంధించి నిఘా వర్గాల నుంచి సమాచారం ముఖ్యమంత్రికి చేరిందని సమాచారం.
విపక్షాలు, కొత్త శక్తులకు కళ్లెం వేసేలా..
జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీ ఇటీవల రాష్ట్రంలో రాజకీయ కార్యకలాపాలు పెంచాయి. క్షేత్రస్థాయిలో కార్యాచరణను ప్రకటించాయి. పీసీసీ కొత్త అధ్యక్షుడు రేవంత్‌రెడ్డి ‘దళిత, గిరిజన ఆత్మగౌరవ దండోరా’ పేరిట భారీ సభ నిర్వహించగా.. బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు బండి సంజయ్ ఈ నెల 24 నుంచి రాష్ట్రవ్యాప్త పాదయాత్రకు సన్నాహాలు చేసుకుంటున్నారు. మాజీ ఐపీఎస్ అధికారి ఆర్‌ఎస్ ప్రవీణ్‌కుమార్ ఇటీవల బీఎస్పీలో చేరగా.. వైఎస్సార్‌టీపీ, తీన్మార్ మల్లన్న వంటి కొత్త రాజకీయ శక్తులు కూడా వివిధ సమస్యలపై ఆందోళన కార్యక్రమాలు చేపడుతున్నాయి.
చురుగ్గా మారిన జాతీయ పార్టీలు, కొత్త రాజకీయ శక్తులకు కళ్లెం వేసేందుకు ప్రత్యేక వ్యూహం అవసరమని సీఎం కేసీఆర్ ఇప్పటికే అంచనాకు వచ్చారని.. ఆయా పార్టీలు, వ్యక్తులను ఆత్మరక్షణలోకి నెట్టేలా ‘దళితబంధు’, మంత్రివర్గంలో ఎస్సీలకు ప్రాతినిధ్యం పెంపు వంటివాటిని తెరపైకి తేవాలని నిర్ణయించినట్టు తెలిసింది. హుజూరాబాద్ ఉప ఎన్నిక తర్వాత ‘దళిత బంధు’ అవగాహన పేరిట జిల్లాలు, నియోజకవర్గాల వారీగా భారీ సదస్సులు నిర్వహించేందుకు అవసరమైన ప్రణాళికపైనా కసరత్తు చేస్తున్నట్టు సమాచారం. తద్వారా విపక్షాల పాదయాత్రలు, సభలు, ఆందోళనా కార్యక్రమాలకు చెక్ పెట్టాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఆత్మరక్షణలోకి నెట్టేలా..
బీజేపీ, కాంగ్రెస్, ఇతర రాజకీయ శక్తులు విస్తృత కార్యాచరణకు దిగుతున్నాయి. అన్నీ దళిత అంశాలను లేవనెత్తుతున్నాయి. వాటిని ఆత్మరక్షణలోకి నెట్టేలా దళిత బంధు చైర్మన్, ఎస్సీలకు మంత్రి పదవులు వంటి కొత్త అస్త్రాలను సీఎం కేసీఆర్ తెరపైకి తెస్తున్నట్టు పార్టీ వర్గాలు చెప్తున్నాయి.
యువ ఎమ్మెల్యేలకు చాన్స్
ఎస్సీ సామాజికవర్గం నుంచి యువ ఎమ్మెల్యేలకు కేబినెట్ అవకాశమిస్తే ఎలా ఉంటుందనే కోణంలో సీఎం లెక్కలు వేస్తున్నట్టు తెలిసింది. గతంలో మాదిరిగా ఎస్సీ సామాజికవర్గానికి చెందిన మంత్రుల్లో ఒకరికి డిప్యూటీ సీఎం హోదా కల్పించే అంశాన్ని కూడా పరిశీలిస్తున్నట్టు సమాచారం.
Comments
Please login to add a commentAdd a comment