
తెలంగాణ సీఎం కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : ప్రతిష్టాత్మక ప్రాజెక్టు రీజినల్ రింగ్ రోడ్ సమగ్ర ప్రాజెక్టు నివేదిక (డీపీఆర్) పనులు శరవేగంగా సాగుతున్నాయి. తాజాగా ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు పనుల పురోగతిపై ఆర్ అండ్ బీ అధికారులకు ఫోన్ చేసి వివరాలు తెలుసుకున్నారు. వీలైనంత త్వరగా డీపీఆర్ పనులు పూర్తి చేయాలని ఆదేశించినట్లు సమాచారం. రాజధానిపై ట్రాఫిక్ కష్టాలను తీర్చడంతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి కనెక్టివిటీ పెంచేందుకు తెలంగాణ ప్రభుత్వం ఈ ట్రిపుల్ ఆర్ నిర్మించాలన్న పట్టుదలతో ఉంది. అందుకే, సీఎం ఈ ప్రాజెక్టును ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. దీంతో అధికారులు పనుల వేగం పెంచేందుకు సమాయత్తమవుతున్నారు. పార్లమెంటులో కేంద్ర సహాయ మంత్రి మాండవీయ రీజినల్ రింగ్‌రోడ్డులోని రెండు రోడ్ల నిర్మాణానికి అంగీకారాన్ని వెల్లడించారు. భూసేకరణలో తెలంగాణ ప్రభుత్వం సగం ఖర్చు భరిస్తుందని తెలిపారు. ఈ నేపథ్యంలో సీఎం కేసీఆర్ కూడా డీపీఆర్ పనులపై ఆరాతీయడం ప్రాధాన్యం సంతరించుకుంది. విశ్వసనీయ సమాచారం మేరకు వచ్చే వారాంతానికి డీపీఆర్ పనులు పూర్తికానున్నాయి.
భూసేకరణ మొత్తం గ్రీన్‌ఫీల్డే: మొత్తం 334 కిలోమీటర్ల దూరం రెండు దశల్లో సంగారెడ్డి–నర్సాపూర్, తూప్రాన్, గజ్వేల్–జగ్‌దేవ్‌పూర్– భువనగిరి–చౌటుప్పల్ (దాదాపు 154 కి.మీ), చౌటుప్పల్–షాద్‌నగర్–కంది (దాదాపు 180 కి.మీ) రోడ్డును అంతర్జాతీయ ప్రమాణాలతో ఎక్స్‌ప్రెస్ హైవేగా నిర్మించనున్నారు. ఈ రహదారి భూసేకరణకు మొత్తం గ్రీన్‌ఫీల్డ్‌నే తీసుకోవాలని అధికారులు ఇటీవల నిర్ణయించారు. వాస్తవానికి షాద్‌నగర్ నుంచి తూప్రాన్–భువనగిరి మార్గంలో ఇప్పటికే ఓ రోడ్డు అందుబాటులో ఉంది. తొలుత ఈ రోడ్డును విస్తరిస్తారని, చౌటుప్పల్ నుంచి షాద్‌నగర్ వరకు మాత్రమే గ్రీన్‌ఫీల్డ్ సేకరిస్తారని ప్రచారం జరిగింది. కానీ, ఉన్న రోడ్డు విస్తరణలో పలు సాంకేతిక, న్యాయ సంబంధ చిక్కులు వెల్లువెత్తే అవకాశం ఉండటంతో జాతీయ రహదారుల సంస్థ (ఎన్‌హెచ్‌ఏఐ) రెండు రహదారులకు గ్రీన్‌ఫీల్డ్‌నే ఎంచుకోవాలని సూచించింది. దీంతో గ్రీన్‌ఫీల్డ్‌నే సేకరించాలని అధికారులు నిర్ణయించారు.
ఈ మండలాల గుండా వెళ్లే అవకాశం!
విశ్వసనీయ సమాచారం ప్రకారం.. రీజినల్ రింగ్ రోడ్ తూప్రాన్, దౌలతాబాద్, నర్సాపూర్, శివ్వంపేట, తూప్రాన్, గజ్వేల్, జగ్‌దేవ్‌పూర్, తుర్కపల్లి, భువనగిరి, పోచంపల్లి, చౌటుప్పల్, సంస్థాన్ నారాయణపూర్, యాచారం, కడ్తాల్, కేశంపేట, షాద్‌నగర్, కొందుర్గ్, పరిగి, పూడూరు, చేవెళ్ల, శంకర్‌పల్లితోపాటు కంది, దొంతి తదితర ప్రాంతాల గుండా వెళ్లవచ్చని తెలుస్తోంది. వీటితోపాటు దాదాపు 150 గ్రామాలను అధికారులు గుర్తించినట్లు సమాచారం. డీపీఆర్ పనులు పూర్తయిన తర్వాత తెలంగాణ ప్రభుత్వం ఇక భూసేకరణపై దృష్టి సారించనున్నట్లు సమాచారం. వీలైనంత త్వరగా భూమిని సేకరించి, ఎన్‌హెచ్‌ఏఐకి అప్పగిస్తే వారు రోడ్డు నిర్మాణం మొదలు పెట్టనున్నారు.
4 ఉమ్మడి జిల్లాల్లో!
రెండు దశల్లో నిర్మించనున్న ఈ రహదారిని ఏకంగా 334 కి.మీల విస్తరణలో ఉండనుంది. మొత్తం నాలుగు ఉమ్మడి జిల్లాల (మెదక్, రంగారెడ్డి, నల్లగొండ, మహబూబ్‌నగర్)కు చెందిన దాదాపు 22 మండలాలు, సుమారు 150 గ్రామాల గుండా ఈ రోడ్డు వెళ్లనుంది. ఈ నేపథ్యంలో దాదాపు 4,500 హెక్టార్లు లేదా 11,000 ఎకరాల భూమిని సేకరించనున్నారు. ఇందుకోసం అయ్యే రూ.3,000 కోట్లలో తెలంగాణ ప్రభుత్వం రూ.1,500 కోట్లు భరించనుంది.