నగరం ‘హై’ఫైగా ఉండాలి
హైదరాబాద్ ట్రాఫిక్‌పై సీఎం సమీక్ష
సాక్షి, సిటీబ్యూరో: నగరంలో ట్రాఫిక్ రద్దీని నియంత్రించేందుకు సమగ్ర ప్రణాళిక తయారు చేయాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు అధికారులను ఆదేశించారు. సచివాలయంలో సోమవారం ఉప మఖ్యమంత్రి మహమూద్ అలీ, హోంమంత్రి నాయిని నర్సింహారెడ్డి, మంత్రులు మహేందర్‌రెడ్డి, టి.పద్మారావు, జీహెచ్‌ఎంసీ, పోలీసు, రవాణా శాఖ ఉన్నతాధికారులతో జరిగిన సమావేశంలో కేసీఆర్ ట్రాఫిక్ సమస్యపై సమీక్షించారు. హైదరాబాద్ లో ట్రాఫిక్ నియంత్రణ, రహదారుల భద్రత, వాహనదారులు, పాదచారుల సౌకర్యం, ఆర్టీసీ బస్సుల సేవలు, డంప్‌యార్డులు తదితర అంశాలపై ఈ సమావేశంలో సుదీర్ఘంగా సమీక్షించారు. పెరుగుతున్న జనాభాకు పబ్లిక్ ట్రాన్స్‌పోర్టు సిస్టమే పరిష్కారమని ఆయన చెప్పారు. నగరంలో ఆర్టీసీ బస్సుల రాకపోకలు ప్రజలకు సౌకర్యవంతంగా ఉండాలని సూచించారు.అలాగే బస్టాప్‌లను ఆధునికీకరించాల్సి ఉందని, ఎల్‌సీడీ స్క్రీన్లను కూడా ఏర్పాటు చేసే అవకాశాలను పరిశీలించాలని ఆయన అధికారులను కోరారు.
ముంబైలో ప్రభుత్వం ట్రాన్స్‌పోర్టు సిస్టం చాలా బాగా పనిచేస్తోందని మంత్రి మహేందర్‌రెడ్డి నేతృత్వంలో అధికారుల బృందం అక్కడకు వెళ్లి పరిస్థితిని అధ్యయనం చేయాలని కేసీఆర్ సూచించారు.రవాణా, ఆర్టీసీ, జీహెచ్‌ఎంసీ, పోలీసు శాఖలు పరస్పరం సమన్వయంతో వ్యవహరించాలని, ఇందుకోసం ఓ సమావేశాన్ని కూడా పెట్టుకోవాలని అడ్మిస్ట్రేషన్ స్టాఫ్ కాలేజీ ఆఫ్ ఇండియా (ఆస్కీ) నోడల్ ఏజెన్సీగా పనిచేయాలని కేసీఆర్ సూచించారు. పోలీసు శాఖకు కొత్తగా సమకూరనున్న 1650 ఇన్నోవా వాహనాలు ఆగస్టు నాటికి కంపెనీ నుంచి డెలివరీ అయ్యేలా చర్యలు తీసుకోవాలని రాష్ట్ర ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు సోమవారం పోలీసు ఉన్నతాధికారులను ఆదేశించారు.