రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం గోల్‌మాల్ | KCR slams AP government | Sakshi
Sakshi News home page

రుణమాఫీపై ఏపీ ప్రభుత్వం గోల్‌మాల్

Published Tue, Nov 11 2014 1:22 AM | Last Updated on Mon, Oct 1 2018 1:21 PM

శాసనసభలో మాట్టాడుతున్న సీఎం  కేసీఆర్ - Sakshi

శాసనసభలో మాట్టాడుతున్న సీఎం కేసీఆర్

* శాసనసభలో సీఎం కేసీఆర్ విమర్శ
* అక్కడ రూపాయి కూడా ఇవ్వలేదు
* తెలంగాణ రాష్ట్రంలో ఇప్పటికే పంట రుణాలను మాఫీ చేశాం
* రైతులకు రూ. 8 వేల కోట్ల కొత్త రుణాలు కూడా అందాయి
* కొన్నిచోట్ల బ్యాంకులు ఇబ్బందులు సృష్టిస్తున్నాయని వ్యాఖ్య
* ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ వాకౌట్

 
సాక్షి, హైదరాబాద్: ఏపీ ప్రభుత్వం ఇప్పటివరకూ కూడా డ్వాక్రా, రైతుల రుణాలు మాఫీ చేయకపోగా.. గోల్‌మాల్ వ్యవహారాలు చేస్తోందని ముఖ్యమంత్రి చంద్రశేఖర్‌రావు విమర్శించారు. సోమవారం ఆయన అసెంబ్లీలో ప్రశ్నోత్తరాల సమయంలో.. పలుమార్లు కలుగజేసుకుని మాట్లాడారు. ఏపీలో మహిళలకు డ్వాక్రా రుణాలు కూడా మాఫీ చేశారని, తెలంగాణలో కూడా చేయాలని టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు కోరగా.. ఏపీ ప్రభుత్వ వ్యవహారాన్ని ఎండగట్టారు.
 
 ఈ సందర్భంగా ముఖ్య మంత్రి కేసీఆర్ మాట్లాడుతూ... పంట రుణాలకు సంబంధించి రూ. 17 వేల కోట్లు ఇవ్వడం చారిత్రాత్మక మని పేర్కొన్నారు. ఎన్నికల మేనిఫెస్టోలో తాము దీర్ఘకాలిక రుణాలు మాఫీ చేస్తామని చెప్పలేదని, మేనిఫెస్టో ఇంగ్లిష్‌లో స్పష్టంగా పంట రుణాలని ఉందని.. తెలుగులో ప్రచురితమైన మేనిఫెస్టోలో పొరపాటు జరిగిందని చెప్పారు. ఈ విషయంపై టీడీపీ సభ్యులు  జోక్యం చేసుకోవడంపై ఆగ్రహించిన సీఎం కేసీఆర్... ‘ఇష్టమొచ్చినప్పుడు రన్నింగ్ కామెంటరీ లాగా మాట్లాడితే మా వాళ్లు కూడా అలాగే చేస్తారు. సంయమనం ఉండాలండీ.. కూర్చోండి..’ అని సూచించారు. దీంతో అధికార సభ్యులు, టీడీపీ సభ్యులు కొద్దిసేపు గందరగోళం సృష్టించారు.
 
 రూ. 8 వేల కోట్ల కొత్త రుణాలిచ్చాం..
 అధికార, టీడీపీ సభ్యుల గందరగోళం మధ్య వ్యవసాయ మంత్రి పోచారం శ్రీనివాస్‌రెడ్డి మాట్లాడారు. 36,31,908 మంది రైతులకు సంబంధించిన రూ. 17 వేల కోట్ల రుణాలను మాఫీ చేశామని, అందులో తొలివిడతగా ప్రభుత్వం 25 శాతం చెల్లించిందని తెలిపారు. ఈ మొత్తానికి మరో 30 శాతం అదనంగా కలిపి రైతులకు కొత్త రుణాలివ్వాలని బ్యాంకర్లను కోరామన్నారు. ఇప్పటివరకు 19,60,721 మంది రైతులకు రూ. 8,123 కోట్ల కొత్త రుణాలు అందాయని చెప్పారు. బంగారం తాకట్టు పెట్టినవారు 3.63 లక్షల వరకూ ఉన్నారని, వారి రుణాలు రూ. 1,500 కోట్ల వరకూ ఉన్నాయని తెలిపారు. అయితే ఏడు శాతం వడ్డీతో ఇచ్చిన రుణాలను మాత్రమే పంట రుణాలుగా పరిగణిస్తామని, 14 శాతం వడ్డీతో ఇచ్చిన బంగారం రుణాలకు రుణమాఫీ వర్తించదని మంత్రి స్పష్టం చేశారు. ఈ నెలాఖరు నాటికి అర్హులైన రైతులకు పూర్తిస్థాయిలో రుణాలు అందేట్లు చేస్తామన్నారు.
 
 కౌలు రైతుల సంగతేమిటి?: ఎర్రబెల్లి
 అనంతరం టీడీపీ సభ్యుడు ఎర్రబెల్లి దయాకర్‌రావు మాట్లాడుతూ... కౌలు రైతులకు రుణమాఫీ వర్తిస్తుందా? అని ప్రశ్నించారు. రైతులకు ఏ షరతూ లేకుండా రూ. లక్ష వరకు రుణమాఫీ చేస్తామన్నారని, కానీ దీర్ఘకాలిక రుణాలను పక్కన పెట్టేశారని ఆయన పేర్కొన్నారు. దీనిపై మంత్రి హరీశ్‌రావు జోక్యం చేసుకుంటూ.. ఎన్నికల మేనిఫెస్టోను తూచా తప్పకుండా అమలుచేస్తున్నామని చెప్పారు.
 
  దీంతో ఎర్రబెల్లి టీఆర్‌ఎస్ ఎన్నికల మేనిఫెస్టోను చూపుతూ రైతులకు రూ. లక్ష రుణమాఫీ అని ప్రకటించారని, ఇప్పుడు అందులోంచి దీర్ఘకాలిక రుణాలను ఎందుకు మినహాయించారని ప్రశ్నించారు. దీనిపై మంత్రి పోచారం మాట్లాడుతూ... బంగారం రుణాలను మాఫీ చేశామని, వడ్డీ లేని రుణాలను కూడా కొనసాగిస్తామని చెప్పారు. పావలా వడ్డీని కూడా కొనసాగిస్తున్నామన్నారు. గిరిజనేతరులకు, కౌలు రైతులకు కూడా రుణమాఫీ కల్పిస్తామని తెలిపారు. అయితే.. ఈ సందర్భంగా రుణమాఫీపై ప్రభుత్వ తీరును నిరసిస్తూ కాంగ్రెస్ సభ్యులు సభ నుంచి వాకౌట్ చేశారు.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement