గజ్వేల్‌ నుంచి ‘కంటి వెలుగు’ | KCR Starts A New Scheme Kanti Velugu From Gajwel | Sakshi
Sakshi News home page

ఆగస్టు 15న ప్రారంభించనున్న సీఎం 

Published Sun, Jul 22 2018 1:12 AM | Last Updated on Wed, Aug 15 2018 9:10 PM

KCR Starts A New Scheme Kanti Velugu From Gajwel - Sakshi

కంటి వెలుగు కార్యక్రమంపై శనివారం ప్రగతి భవన్‌లో సమీక్షిస్తున్న కేసీఆర్‌

సాక్షి, హైదరాబాద్‌ : రాష్ట్రంలోని పౌరులందరికీ ఉచిత కంటి పరీక్షలు నిర్వహించే ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమాన్ని ఆగస్టు 15న ప్రారంభించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. గజ్వేల్‌ నియోజకవర్గంలో మధ్యాహ్నం రెండు గంటలకు కార్యక్రమాన్ని కేసీఆర్‌ స్వయంగా ప్రారంభించనున్నారు. అదేరోజు గవర్నర్‌ నరసింహన్‌తో ఇంకో ప్రాంతంలో ఈ కార్యక్రమాన్ని ప్రారంభించాలని కోరనున్నట్లు ఆయన తెలిపారు. మంత్రులు, ఎంపీలు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఇతర ప్రజా ప్రతినిధులు ఇందులో భాగస్వాములు కావాలని కోరారు.

ఈ మేరకు అన్ని ఏర్పాట్లు చేయాలని అధికారులను ఆదేశించారు. రాష్ట్రంలోని ప్రతి ఒక్కరికి ఉచితంగా కంటి పరీక్షలు నిర్వహిం చాలని, అవసరమైన వారికీ కళ్లద్దాలు, మందులు ఇవ్వాలని, ఉచితంగా ఆపరేషన్లు నిర్వహించాలని ఆదేశించారు. కార్యక్రమానికి అవసరమైన సిబ్బంది, వైద్య పరికరాలు, వాహనాలు, కళ్లద్దాలు, మందులను సిద్ధం చేసుకోవాలని చెప్పారు. శనివారం ప్రగతిభవన్‌లో ‘తెలంగాణకు కంటి వెలుగు’కార్యక్రమంపై సీఎం సమీక్ష నిర్వహించారు. ఆరోగ్య శాఖ ముఖ్య కార్యదర్శి శాంతాకుమారి, కుటుంబ సంక్షేమ శాఖ కమిషనర్‌ వాకాటి కరుణ, ఆరోగ్యశ్రీ సీఈవో మాణిక్‌రాజ్, సరోజినీ దేవి కంటి ఆసుపత్రి సూపరింటెండెంట్‌ రవీందర్‌గౌడ్, పబ్లిక్‌ హెల్త్‌ డైరెక్టర్‌ శ్రీనివాస్, జాయింట్‌ డైరెక్టర్‌ మోతీలాల్, టీఎస్‌ఎండీసీ ఎండీ వేణుగోపాల్‌ తదితరులు పాల్గొన్నారు. 

అవగాహన కల్పించండి 
‘రికార్డు స్థాయిలో రాష్ట్రంలోని దాదాపు 3.70 కోట్ల మంది పౌరులకు ఉచిత కంటి పరీక్షలు నిర్వహించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇంత పెద్ద కార్యక్రమం గతంలో ఎవరూ, ఎప్పుడూ చేయలేదు. రాష్ట్రవ్యాప్తంగా ఈ కార్యక్రమం చేపడుతున్నందున అన్ని ఏర్పాట్లు చేసుకోవాలి. ప్రజాప్రతినిధులందరినీ భాగస్వాములను చేయాలి. కలెక్టర్లు ప్రజాప్రతినిధులందరితో సమావేశాలు నిర్వహించి జిల్లాస్థాయిలో షెడ్యూల్‌ను రూపొందించాలి. క్షేత్రస్థాయిలో కార్యక్రమ నిర్వహణపై సమీక్షలు జరపాలి. ప్రజలకు పూర్తి స్థాయిలో అవగాహన కల్పించాలి. ప్రతి ఒక్కరు కంటి వైద్య శిబిరాలకు వచ్చేలా ఏర్పాట్లు చేయాలి’అని అధికారులను సీఎం ఆదేశించారు. 

799 బృందాల ఏర్పాటు 
కంటి పరీక్షల నిర్వహణ కోసం చేసిన ఏర్పాట్లను అధికారులు ఈ సందర్భంగా ముఖ్యమంత్రికి వివరించారు. ‘రాష్ట్రవ్యాప్తంగా 799 బృందాలను ఏర్పాటు చేశాం. ప్రతి బృందంలో ఒక ఎంబీబీఎస్‌ డాక్టర్, ఆప్తోమెట్రిస్ట్, ఏఎన్‌ఎం ఉంటారు. ఒక్కో వైద్య బృందం రోజుకు సగటున 250 మందికి పరీక్షలు నిర్వహిస్తుంది. కంట్లో వేసే మందులను, ఇతర ఔషధాలను సిద్ధం చేస్తున్నాం. 34 లక్షల కంటి అద్దాలు సిద్ధం చేసి జిల్లాలకు పంపుతున్నాం. అవసరమైన వారికి ఆపరేషన్లు నిర్వహించడానికి రాష్ట్రవ్యాప్తంగా 114 కంటి ఆసుపత్రులను గుర్తించాం’అని అధికారులు తెలిపారు.  

సీఎం సూచనలివీ.. 
వర్షం వచ్చినా కంటి పరీక్షలు నిరాటంకంగా నిర్వహించేందుకు వీలుగా గ్రామ స్థాయిలో పాఠశాల భవవాన్నిగానీ, మరేదైనా పక్కా భవనాన్నిగానీ ఎంపిక చేసుకోవాలి. 
కంటి పరీక్షల కోసం నియమించే సిబ్బంది వల్ల సాధారణ వైద్య సేవలకు ఎక్కడా ఇబ్బంది రావద్దు. కంటి పరీక్షల శిబిరంలో పని చేయడానికి ఎంబీబీఎస్‌ పూర్తి చేసిన వైద్యుల సేవలను తాత్కాలిక పద్ధతిలో వినియోగించుకోవాలి. వివిధ ప్రభుత్వ ఆసుపత్రుల్లో పని చేస్తున్న వారిని వినియోగించవద్దు. 
ఏ రోజు ఏ గ్రామంలో పరీక్షలు నిర్వహిస్తున్నారనే విషయం ప్రజలకు తెలిసేలా విస్తృత ప్రచారం నిర్వహించాలి. కంటి పరీక్షలపై అవగాహన కల్పించాలి. ఎఎన్‌ఎంలు, ఆశా వర్కర్ల సేవలు వినియోగించుకోవాలి. స్థానిక ప్రజాప్రతినిధుల సహకారం తీసుకోవాలి. కంటి పరీక్షల నిర్వహణలో భాగస్వాములు కావాలని ఆహ్వానిస్తూ ప్రజా ప్రతినిధులకు వైద్య ఆరోగ్య శాఖ మంత్రి లేఖలు రాయాలి. 
వైద్య శిబిరాల్లో పాల్గొనే సిబ్బందికి వారానికి రెండు రోజులు కచ్చితంగా సెలవులు ఇవ్వాలి. వాళ్లు వచ్చి వెళ్లడానికి ప్రభుత్వ ఖర్చుతో వాహనాలు ఏర్పాటు చేయాలి. గ్రామాల్లో సరైన వసతి ఉండదు కాబట్టి సమీప పట్టణాల్లో వసతి ఏర్పాటు చేయాలి. ప్రభుత్వ, సింగరేణి, విద్యుత్‌ సంస్థల అతిథి గృహాలను ఇందుకోసం వినియోగించుకోవాలి. వీలైతే ప్రైవేటు హోటళ్లలోనూ బస ఏర్పాటు చేయాలి. పేదలకు వైద్య సేవలు అందించే వైద్య సిబ్బంది భోజన, వసతి ఏర్పాట్లు బాగుండాలి. 
దగ్గరి చూపు లోపం ఉన్న వారికి వెంటనే మందులను, అద్దాల (రీడింగ్‌)ను అందించాలి. ఇతరులకు డాక్టర్లు సూచించిన అద్దాలు పంపిణీ చేయాలి. ఆపరేషన్లు అవసరమైన వారికి ప్రభుత్వ, ప్రైవేటు ఆసుపత్రుల్లో దశల వారీగా ప్రభుత్వ ఖర్చుతో ఉచితంగా ఆపరేషన్లు చేయించాలి. 

సరోజినీ దేవి ఆసుపత్రికి కొత్త భవనం: సీఎం 
హైదరాబాద్‌లోని సరోజినీ దేవి కంటి ఆసుపత్రికి కొత్త భవనం నిర్మించడంతోపాటు అన్ని రకాల ఆధునిక వసతులు కల్పించనున్నట్లు సీఎం కేసీఆర్‌ ప్రకటించారు. ఇందుకు ప్రతిపాదనలు సిద్ధం చేయాలని అధికారులను ఆదేశించారు. సరోజినీ కంటి ఆసుపత్రికి మంచి పేరు, ప్రతిష్టలున్నాయని, అందుకు తగినట్లు కొత్త భవనాలు నిర్మించి రోగుల వైద్యానికి కావాల్సిన అన్ని ఏర్పాట్లు చేయాలన్నారు. హైదరాబాద్‌లో నిర్వహిస్తున్న బస్తీ దవాఖానాలు పేదలకు ఎంతో ఉపయోగపడుతున్నాయని, వాటి సంఖ్యను పెంచా లన్నారు. పేదలు ఎక్కువగా ఉండే ప్రాంతాల్లో బస్తీ దవాఖానాలు ఏర్పాటు చేయాలని చెప్పారు. బస్తీ దవాఖానాలను సందర్శించిన గవర్నర్‌.. అవి పేదలకు ఎంతగానో మేలు చేస్తున్నాయని అభినందించారని సీఎం పేర్కొన్నారు.

 

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement