
అమరుల ఫైలుపైనే తొలి సంతకం
మొదటి కేబినెట్ సమావేశంలో 10 తీర్మానాలు
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్ర తొలి ముఖ్యమంత్రిగా జూన్ 2న ఉదయం 8.15కు టీఆర్‌ఎస్ అధినేత కె.చంద్రశేఖరరావు ప్రమాణస్వీకారం చేయనున్నారు. రాజ్‌భవన్‌లోనే అత్యంత సాదాసీదాగా 15 మందితో కేబినెట్‌ను ఏర్పాటు చేస్తారని ఆయన సన్నిహితులు వెల్లడించారు. ప్రమాణ స్వీకారం అనంతరం మధ్యాహ్నం 12.57కు సీఎం కార్యాలయమైన సమతా బ్లాకులోకి కేసీఆర్ అడుగు పెడతారు. అదే రోజున తొలి కేబినెట్ సమావేశం నిర్వహిస్తారు. అందులో 10 ముఖ్యమైన తీర్మానాలు చేయవచ్చని తెలుస్తోంది. ఉద్యమంలో అమరులైన వారి కుటుంబాలకు ఎక్స్‌గ్రేషియా అందించే ఫైలుపై సీఎం హోదాలో కేసీఆర్ తొలి సంతకం చేయనున్నారు. రైతులకు లక్ష లోపు రుణాల మాఫీ, విద్యార్థులపై కేసుల ఎత్తివేత, కాంట్రాక్టు ఉద్యోగుల క్రమబద్ధీకరణ వంటి ఎన్నికల మేనిఫెస్టోలోని కీలకమైన 10 అంశాలపై కూడా తొలి కేబినెట్ భేటీలో తీర్మానాలు చేయాలని భావిస్తున్నట్టు తెలిసింది.
ఢిల్లీ నుంచి వచ్చాకే స్పష్టత
ప్రధానిగా నరేంద్రమోడీ ప్రమాణ స్వీకార కార్యక్రమంలో పాల్గొనేందుకు కేసీఆర్ ఆదివారం ఢిల్లీ వెళ్లనున్నారు. సోమవారం ఆ కార్యక్రమం పూర్తయ్యాక మంగళవారం హైదరాబాద్ తిరిగొస్తారు. ప్రభుత్వ నియామకాలు, తన కార్యాలయ సిబ్బంది కూర్పు, తొలి కేబినెట్‌లో చేయాల్సిన 10 తీర్మానాలు తదితరాలపై ఆ తర్వాతే ఆయన స్పష్టత ఇవ్వవచ్చు. తెలంగాణ ప్రభుత్వ తొలి ప్రధాన కార్యదర్శిగా చందనాఖన్ పేరు కేసీఆర్ నివాసంలో శనివారం చర్చకు వచ్చింది. నిన్నటిదాకా నాగిరెడ్డి పేరునే ప్రధానకార్యదర్శిగా అనుకున్నారు. కానీ ఆయనైతే సర్వీసుపరంగా సాంకేతిక సమస్యలు వస్తాయని, చందనాఖన్ పేరుతో ఇబ్బందులు రావని సీనియర్ ఐఏఎస్‌లు ప్రతిపాదించారు. డీజీపీగా అనురాగ్‌శర్మ పేరు ఖరారయిందని అనుకున్న తరుణంలో అనూహ్యంగా టి.పి.దాస్ పేరు పరిశీలనకు వచ్చింది. రాష్ట్రం ఏర్పాటయ్యాక ప్రభుత్వ నియామకాలన్నీ సీఎం విచక్షణాధికారాలకు లోబడి ఉంటాయని, సీనియర్లు, జూనియర్ల వంటి సర్వీసు అభ్యంతరాలు అడ్డంకి కాబోవని అంటున్నారు. జార్ఖండ్, ఛత్తీస్‌గఢ్ వంటివి ఇందుకు ఉదాహరణ అంటున్నారు. ఆ ప్రకారం చూసుకుంటే నాగిరెడ్డి, రాజీవ్ శర్మలో ఒకరు సీఎస్, అనురాగ్ శర్మ డీజీపీ కావచ్చని కేసీఆర్ సన్నిహిత వర్గాలు వెల్లడించాయి. మజ్లిస్ నేతలు ఎస్.ఎ.హూడా పేరును ప్రతిపాదించినట్టు తెలిసింది. ఐఏఎస్ అధికారి నర్సింగరావును ముఖ్యమంత్రి పేషీ రాజకీయ, ముఖ్య కార్యదర్శిగా దాదాపుగా నియమించుకున్నట్టే. ఓఎస్‌డీగా రాజశేఖర్‌రెడ్డి నియామకం కూడా ఇప్పటికే పూర్తయింది. గోపాల్‌రెడ్డికి సీఎం కార్యాలయంలో కీలకశాఖల పర్యవేక్షణను అప్పగించనున్నారు.