16న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ | kcr to expand cabinet on december 16th | Sakshi
Sakshi News home page

16న తెలంగాణ మంత్రివర్గ విస్తరణ

Published Sun, Dec 14 2014 1:24 AM | Last Updated on Wed, Aug 15 2018 9:04 PM

రాజ్‌భవన్‌లో నరసింహన్‌కు  పుష్పగుచ్ఛం ఇస్తున్న కేసీఆర్ - Sakshi

రాజ్‌భవన్‌లో నరసింహన్‌కు పుష్పగుచ్ఛం ఇస్తున్న కేసీఆర్

 గవర్నర్‌కు తెలిపిన తెలంగాణ సీఎం  కేసీఆర్
 తుమ్మల, జూపల్లి, లక్ష్మారెడ్డిలకు ఖాయమే
 మరో మూడింటికోసం ఆరుగురి పోటీ
 దాస్యం, ఇంద్రకరణ్‌లకు అవకాశం!
 చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్ నియామకం
 విప్‌లుగా గోవర్ధన్, సునీత, ఓదేలు
 కొత్తగా ‘పార్లమెంటరీ కార్యదర్శి’
 నలుగురు లేదా ఆరుగురికి అవకాశం
 మిగతావారికి కార్పొరేషన్ పదవులు
 సీనియర్లలో అసంతృప్తి రాగాలు

 
 
 సాక్షి, హైదరాబాద్: టీఆర్‌ఎస్ ఎమ్మెల్యేలు, పార్టీ నాయకులు ఎంతోకాలం నుంచి నిరీక్షిస్తున్న మంత్రివర్గ విస్తరణ, ఇతర పదవుల భర్తీకి ముహూర్తం ఖరారైంది. మంత్రివర్గంలోకి మరో ఆరుగురిని తీసుకోవాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు నిర్ణయించారు. ఈ నెల 16న ఉదయం 11 గంటలకు రాష్ట్ర కేబినెట్‌ను విస్తరించనున్నట్టు శనివారం రాజ్‌భవన్‌లో గవర్నర్ నరసింహన్‌ను కలసి ఆయన సమాచారం అందించారు. వీటితోపాటు నామినేటెడ్ తదితర పదవుల భర్తీకి కూడా సీఎం సిద్ధమయ్యారు. అందులో భాగంగా ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్‌ను, విప్‌లుగా గంపా గోవర్ధన్ (కామారెడ్డి), గొంగిడి సునీత మహేందర్‌రెడ్డి (ఆలేరు), నల్లాల ఓదేలు (చెన్నూరు) లను నియమించారు. ఈ మేరకు ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి రాజీవ్‌శర్మ శనివారం రాత్రి ఉత్తర్వులు కూడా జారీ చేశారు. ఇక మంత్రివర్గం విషయానికొస్తే, ఖమ్మం జిల్లా నుంచి తుమ్మల నాగేశ్వర్‌రావుకు చోటు ఖాయమని సీఎం సన్నిహిత వర్గాల నుంచి అందిన సమాచారం ప్రకారం తెలుస్తోంది. మహబూబ్‌నగర్ జిల్లా నుంచి జూపల్లి కృష్ణారావు, డాక్టర్ సి.లక్ష్మారెడ్డిలకూ బెర్తులు ఖరారయ్యాయి. మిగతా మూడింటికోసం కనీసం ఆరుగురు ఎమ్మెల్యేలు పోటీలో ఉన్నారు. వరంగల్ జిల్లా నుంచి ఆజ్మీరా చందూలాల్, కొండా సురేఖ, దాస్యం వినయ్‌భాస్కర్‌ల్లో చందూలాల్‌కు ఎక్కువగా అవకాశాలున్నాయని తెలుస్తోంది. ఆదిలాబాద్ జిల్లా నుంచి ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, కోవా లక్ష్మి పోటీపడుతుండగా ఇంద్రకరణ్‌కు చాన్సుందంటున్నారు. తొలిసారి ఎమ్మెల్యేగా ఎన్నికైనవారికి మంత్రివర్గంలో చోటు ఇవ్వకూడదని సీఎం భావిస్తున్నట్టు చెబుతున్నారు. హైదరాబాద్ నుంచి తలసాని శ్రీనివాస్ యాదవ్ పేరు కూడా బలంగా విన్పిస్తోంది. అయితే టీడీపీ నుంచి గెలిచిన తలసానికి మంత్రివర్గంలో చోటిస్తే సాంకేతిక సమస్యలు వస్తాయా అనే కోణంలోనూ చర్చ జరుగుతోంది.
 
 చీఫ్‌విప్‌గా కొప్పుల
 
 తెలంగాణ ప్రభుత్వ చీఫ్ విప్‌గా కొప్పుల ఈశ్వర్‌ను నియమిస్తున్నట్టుగా సీఎం కార్యాలయం శనివారం రాత్రి ఒక ప్రకటనలో పేర్కొంది. ముగ్గురు విప్‌లు, మంత్రివర్గ విస్తరణతోపాటు, కీలక స్థానాల నియామకాలకు సంబంధించిన సమాచారాన్ని కూడా వెల్లడించింది. విస్తరణకు ముందుగానే కార్పొరేషన్ చైర్మన్ల పదవులు భర్తీచేయనున్నట్టు తెలిపింది. కొత్తగా పార్లమెంటరీ కార్యదర్శుల వ్యవస్థను కూడా సీఎం తెరపైకి తెస్తున్నారు. విస్తరణలో అవకాశం దక్కని నలుగురు, లేదా ఆరుగురు ఎమ్మెల్యేల ఈ పదవుల్లో నియమించనున్నట్టు ప్రకటనలో ఆయన వెల్లడించారు. మొత్తంమీద సుమారు 20 మందికి పైగా కేబినెట్ హోదా కలిగిన పదవులు ఇవ్వనున్నట్లు తెలిపారు. జలగం వెంకట్రావు(కొత్తగూడెం), వి.శ్రీనివాస్‌గౌడ్(మహబూబ్‌నగర్) తదితరులతోపాటు నలుగురు లేదా ఆరుగురు ఎమ్మెల్యేలను పార్లమెంటరీ సెక్రటరీలుగా నియమించనున్నట్లు సీఎం తెలిపారు. ఐదారుగురు ఎమ్మెల్యేలకు కార్పొరేషన్ పదవులను ఇవ్వనున్నట్లు పేర్కొన్నారు.
 అసంతృప్తిలో పాతకాపులు
 
 విస్తరణ ఖరారైన నేపథ్యంలో... మంత్రివర్గంలో స్థానంపై ఆశలు పెట్టుకున్న టీఆర్‌ఎస్ సీనియర్ ఎమ్మెల్యేలు పలువురు తాజా పరిమాణాలపై తీవ్ర అసంతప్తితో ఉన్నారు. పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేసిన వారికి తప్పకుండా అవకాశాలు వస్తాయని ఇప్పటిదాకా కేసీఆర్ చెబుతూ వచ్చినా, ఆచరణలో మాత్రం పదవులు అందని ద్రాక్షలే అవుతున్నాయని వారు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం కొత్తగా మంత్రివర్గంలోకి తీసుకోబోయే ఆరుగురిలో పార్టీ ఆవిర్భావం నుంచి పనిచేస్తున్నది ఒక్క సి.లక్ష్మారెడ్డి మాత్రమే. మిగతావారంతా మధ్యలో వచ్చినవారేనన్నది సీనియర్ల వాదన. కష్టకాలంలో పార్టీకి అండగా ఉన్నవారిని కాదని, రాజకీయ అవసరాలకోసం వచ్చినవారికే అవకాశాలన్నీ ఇస్తున్నారని విమర్శిస్తున్నారు. ఉప ముఖ్యమంత్రి పదవి వస్తుందని ఆశించిన సీనియర్ నేత కొప్పుల ఈశ్వర్‌కు చీఫ్ విప్‌తో సరిపెట్టారు. ఈ పదవికి ఆయన విముఖంగా ఉన్నారు. ఉద్యోగసంఘాల నుంచి ఒకరికి మంత్రివర్గంలో స్థానం ఉంటుందని కేసీఆర్ ఎన్నోసార్లు చెప్పినా ఆచరణలో చూపించడం లేదని వి.శ్రీనివాస్‌గౌడ్ కూడా తన సన్నిహితులతో ఆవేదనను వ్యక్తం చేశారు. నిజామాబాద్‌కు చెందిన ఏనుగు రవీందర్ రెడ్డి, బిగాల గణేశ్ గుప్తా కూడా మంత్రివర్గంలో చోటును ఆశించి నా వారికీ అవకాశం రావడం లేదు. పార్టీకి కష్టకాలంలో ఆదుకున్నా తమను నిర్లక్ష్యం చేస్తున్నారని మరికొందరంటున్నారు. ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ కూడా కాని తుమ్మలకు అవకాశమెలా ఇస్తారని ప్రశ్నిస్తున్నారు. విస్తరణ పూర్తయిన తర్వాత ఈ అసంతృప్తి ఇంకా పెరిగే అవకాశాలున్నాయని భావిస్తున్నారు.
 
 పార్లమెంటరీ కార్యదర్శి అంటే...
 
 వీరు రాష్ట్ర సహాయ మంత్రి హోదాతో పనిచేస్తారు. సీఎం ఇష్టానుసారం వీరిని నియమించుకోవచ్చు. జీతభత్యాలు, వసతులు, ఇతర రవాణా సౌకర్యాల వంటివన్నీ దాదాపు మంత్రితో సమానంగానే ఉంటాయి. పంజాబ్, రాజస్థాన్, అస్సాం, హిమాచల్‌ప్రదేశ్, మణిపూర్, గోవా తదితర రాష్ట్రాల్లో ఈ వ్యవస్థ ఇప్పటికే ఉంది. సీఎం కేటాయించే శాఖలకు, సంబంధిత మంత్రి ఆధ్వర్యంలో వీరు బాధ్యులుగా పని చేస్తారు. మంత్రివర్గం పరిమాణం ఎమ్మెల్యేల సంఖ్యలో 15 శాతానికి మించకూడదన్న నిబంధనకు ఈ పదవులు తూట్లు పొడుస్తున్నాయంటూ పలు రాష్ట్రాల్లో ఇప్పటికే కోర్టుల్లో ప్రజాప్రయోజన వాజ్యాలు దాఖలయ్యాయి. ఇది రాజ్యాంగంలోని 164(1ఎ)కు విరుద్ధమని న్యాయ నిపుణులు కూడా అభిప్రాయపడుతున్నారు. ప్రస్తుతం తెలంగాణలోని 119 మంది ఎమ్మెల్యేల్లో టీఆర్‌ఎస్‌కు 73 మంది (కాంగ్రెస్, టీడీపీ, బీఎస్పీ, వైఎస్సార్‌సీపీల నుంచి చేరిన ఎమ్మెల్యేలతో కలిపి) ఉన్నారు. వీరిలో సీఎంతో కలిపి ఇప్పటికే 12 మంది మంత్రులుగా ఉన్నారు. విస్తరణ తర్వాత సలహాదారులు, పార్లమెంటరీ కార్యదర్శులు, కార్పొరేషన్ల చైర్మన్లతో కలిపి కేబినెట్ హోదాతో కూడిన పదవుల సంఖ్య భారీగా పెరిగే అవకాశముంది. కాగా, కొత్త మంత్రులకు చాంబర్లు కేటాయించేందుకు సీఎస్ శనివారం సచివాలయం డి-బ్లాక్‌ను పరిశీలించారు.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement