దేవాలయం వద్ద ఏర్పాట్లను పరిశీలిస్తున్న హరీశ్ రావు
నంగునూరు (సిద్దిపేట): సిద్దిపేట జిల్లా నంగునూరు మండలంలోని కోనాయిపల్లి ఆలయంలో పూజలు చేసేందుకు వస్తున్న సీఎం కేసీఆర్‌కు స్థానిక గ్రామ మహిళలే స్వాగతం పలకాలని మంత్రి హరీశ్‌రావు విజ్ఞప్తి చేశారు. ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున ఇతర గ్రామాల ప్రజలెవరూ రావద్దని కోరారు. మంగళవారం కోనాయిపల్లి వేంకటేశ్వరాలయంలో హరీశ్‌రావు ప్రత్యేకపూజలు చేసిన అనంతరం మాట్లాడారు. పూజా కార్యక్రమానికి సీఎం కేసీఆర్ బస్సులో వచ్చే అవకాశమున్నందున రోడ్డుకు మరమ్మతులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. ఆలయంలో పూజాఏర్పాట్లు చేయాలని స్థానిక నేతలకు సూచించారు. సీఎం రాక కోసం గ్రామంలో జరుగుతున్న ఏర్పాట్లను పరిశీలించి పలు సూచనలు చేశారు.
ఎన్నికల నియమావళి అమల్లో ఉన్నందున గ్రామస్తులే ఘన స్వాగతం పలికేలా ఏర్పాట్లు చేయాలని పార్టీ నేతలకు సూచించారు. బస్సు మార్గంలో ఆలయానికి రావడానికి మార్గాలను సూచించాలని అధికారులను కోరడంతో బందారం దర్గా నుంచి వెల్కటూర్ మీదు గా లేదా రంగధాంపల్లి నుంచి ముండ్రాయి మీదుగా కోనాయిపల్లికి చేరుకోవచ్చని వివరించారు. గ్రామంలో సీఎం మాట్లాడేలా చూడాలని స్థానిక నాయకులు కోరడంతో మాట్లాడటం వీలు కాదని మంత్రి చెప్పారు. ఆలయంలో కేసీఆర్ పూజలు నిర్వహించే సమయంలో కేవలం ముఖ్య నాయకులను మాత్రమే అనుమతించనున్నట్లు తెలిసింది.
Comments
Please login to add a commentAdd a comment