నమూనా చిత్రం
• ప్రతి జిల్లాలోనూ ఏర్పాటు చేయాలి: కేసీఆర్
• వీలైనంత త్వరగా డిజైన్లు ఖరారు చేయాలి
• వచ్చే బడ్జెట్‌లో నిధులు, ఏడాదిలోపు నిర్మాణం
• సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డిలకు మినహాయింపు
సాక్షి, హైదరాబాద్: ప్రతి జిల్లా కేంద్రంలోనూ సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాలు, జిల్లా పోలీసు కార్యాలయాలు నిర్మించాలని ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావు ఆదేశించారు. ‘‘సంగారెడ్డి, నల్లగొండ, రంగారెడ్డి జిల్లాల కలెక్టరేట్లను కొత్తగా నిర్మించినందున వాటి స్థానంలో నూతన కార్యాలయాలు నిర్మించాల్సిన అవసరం లేదు. మిగతా 28 జిల్లాల్లో కార్యాలయాలు నిర్మించాలి. 25 ఎకరాల విస్తీర్ణంలో ప్రజలకు, అధికారులకు సౌకర్యవంతంగా ఉండేలా సకల వసతులతో నిర్మించండి. తక్షణం డిజైన్లు ఖరారు చేసి టెండర్లు పిలవండి’’ అని అధికారులను ఆదేశించారు. ఏడాదిలోగా నిర్మాణాలు పూర్తి చేయాలని స్పష్టం చేశారు. వీటికి వచ్చే బడ్జెట్‌లో నిధులు కేటాయిస్తామన్నారు. సమీకృత జిల్లా కార్యాలయ సముదాయాల నిర్మాణాలపై గురువారం ప్రగతిభవన్లో సీఎం సమీక్ష జరిపారు.
మంత్రులు జగదీశ్‌రెడ్డి, జూపల్లి కృష్ణారావు, మిషన్ భగీరథ వైస్ చైర్మన్ ప్రశాంత్‌రెడ్డి, ప్రభుత్వ ముఖ్య సలహాదారు రాజీవ్‌శర్మ, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఎస్‌పీ సింగ్, సీనియర్ అధికారులు సునీల్ శర్మ, రామకృష్ణారావు, శాంతకుమారి, స్మితా సబర్వాల్ తదితరులు పాల్గొన్నారు. పాలన సౌలభ్యం, ప్రజా సౌకర్యం, అధికార వికేంద్రీకరణ లక్ష్యాలతోనే కొత్త జిల్లాలు ఏర్పాటు చేసినట్లు సీఎం ఈ సందర్భంగా గుర్తు చేశారు. ‘‘పాలన కార్యకలాపాలు సమర్థంగా జరగాలంటే మెరుగైన కార్యాలయాలు కావాలి. జిల్లా కేంద్రంలో పోలీస్, అగ్నిమాపక కార్యాలయాలు మినహా మిగతావన్నీ ఒకేచోట ఉండేలా సమీకృత జిల్లా కార్యాలయాల సముదాయాలు నిర్మిం చాలి. పనులపై వచ్చే ప్రజలకు, అధికారులకు సౌకర్యంగా ఉండాలి.
సమావేశాలు, రాష్ట్ర స్థాయి ఉత్సవాలు, ప్రభుత్వ కార్యక్రమాలు నిర్వహించుకోగలిగేలా ఉండాలి. సీఎం, మంత్రులు పర్యటనకు వచ్చినప్పుడు సమీ క్షలకు, సమావేశాలకు కాన్ఫరెన్స్ హాలుం డాలి. ప్రతి గదికీ క్రాస్ వెంటిలేషన్ ఉండాలి. పచ్చదనం ఉట్టిపడేలా ల్యాండ్‌స్కేపింగ్ చేయాలి. వాకింగ్ ట్రాక్స్, విశాలమైన పార్కింగ్ ఏర్పాటు చేయాలి. అధికారులు, ఉద్యోగులు, ప్రజల కోసం టాయిలెట్లు, క్యాంటీన్లు, లంచ్ రూమ్‌లు, బ్యాంకు, ఏటీఎం, మీసేవా కేంద్రం, రికార్డు రూమ్, స్ట్రాంగ్ రూమ్, విద్యుత్ సబ్‌స్టేషన్, జనరేటర్, ఫైర్ స్టేషన్, యానిమల్ ట్రాప్స్ విధిగా ఉండాలి.
వెయ్యి మంది పట్టే కాన్ఫరెన్స్ హాలు నిర్మించాలి. భావి అవసరాలనూ దృష్టిలో ఉంచుకోవాలి’ అన్నారు. ఆర్‌అండ్‌బీ శాఖ ఆధ్వర్యంలో రూపొందించిన డిజైన్లను సీఎం పరిశీలించారు. కార్యాలయ సముదాయాలకు స్థలాల గుర్తింపు ప్రక్రియ పూర్తయినందున వెంటనే లే ఔట్లు వేయాలన్నారు. ‘‘జిల్లా కేంద్రాల్లో పరేడ్ గ్రౌండ్స్‌తో కూడిన జిల్లా పోలీసు కార్యాలయాలు (డీపీఓ) నిర్మించండి. తమిళనాడులో డీపీఓలు బాగున్నాయం టున్నారు. డీజీ నేతృత్వంలో ఉన్నతస్థాయి బృందం వెంటనే అక్కడికెళ్లి అధ్యయనం నివేదిక సమర్పించాలి’’ అని ఆదేశించారు.
పోలీసులు నేర భాష మార్చుకోవాలి
నేర సమావేశాల నిర్వహణకు జిల్లాల్లో కాన్ఫరెన్స్ హాలు నిర్మించాలని సీఎం సూచించారు. ‘‘పోలీసులు నేర భాష మార్చుకోవాలి. నెల నెలా నిర్వహించే సమీక్షలకు క్రైమ్ మీటింగ్ అన్న పేరునూ మార్చాలి. సానుకూల దృక్ప థంతో ఉండే పేరు పెట్టాలి’’ అన్నారు. మిషన్ భగీరథ పనులు గ్రామాల్లో బాగానే ఉన్నా పట్టణాల్లో మంద కొడిగా ఉన్నాయన్నారు. పనుల్లో వేగం పెంచాలని సీఎస్‌ను ఆదేశించారు.