కేసీఆర్‌వన్నీ తప్పుడు సర్వేలు
► విశాఖ మహానాడులో రేవంత్, సండ్ర
విశాఖ: ప్రజా వ్యతిరేక పాలన కొనసాగిస్తున్న సీఎం కేసీఆర్.. తప్పుడు సర్వేలతో ప్రజలను మభ్యపెడుతున్నారని టీటీడీపీ నేతలు రేవంత్‌రెడ్డి, సండ్ర వెంకటవీరయ్య విమర్శించారు. టీడీపీ మహానాడులో పాల్గొనేందుకు ఏపీలోని విశాఖపట్నానికి వచ్చిన వారు మీడియాతో మాట్లాడారు. తెలంగాణలో టీడీపీకి వచ్చిన స్పందన చూసి కేసీఆర్‌కు చెమటలు పట్టాయని రేవంత్ వ్యాఖ్యానించారు.
ఇప్పటికే టీఆర్‌ఎస్ కార్యకర్తల్లో ఆత్మస్థైర్యం పూర్తిగా సడలిపోయిందని, దాన్ని పెంపొందించేందుకే వచ్చే ఎన్నికల్లో 111 సీట్లు వస్తాయంటూ కేసీఆర్ ప్రచారం చేసుకుంటున్నారని విమర్శించారు. ఇది హాస్యాస్పదమన్నారు. అంతర్గత విశ్లేషణ కోసం ఏ రాజకీయ పార్టీ అయినా సర్వే చేయించుకుంటుందని.. అయితే సర్వే ఫలితాలు కేసీఆర్‌కు షాకివ్వడంతో తప్పుడు నివేదికలు ప్రకటిస్తున్నారని సండ్ర విమర్శించారు. కేసీఆర్ మేకపోతు గాంభీర్యాన్ని ప్రదర్శిస్తున్నారని.. ఆ సర్వేలు నిజమైతే తక్షణమే ప్రభుత్వాన్ని రద్దు చేసుకొని ఎన్నికలకు వెళ్లాలని సవాలు చేశారు.