
పుట్టుక నుంచి చావు వరకు...అన్నింటిలోనూ కేసీఆర్ ముద్ర
ప్రజల అవసరాలను గుర్తిస్తున్న సీఎం: కేశవరావు
హన్మకొండ: తెలంగాణ రాష్ట్రం లో మనిషి పుట్టిన నాటి నుంచి చావు వరకు.. అందరు ప్రజల అన్ని అవసరాలూ సీఎం కేసీఆర్ చూసుకుంటున్నారని టీఆర్‌ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, రాజ్యసభ సభ్యుడు కె.కేశవరావు అన్నారు. హన్మకొండలో గురువారం జరిగిన టీఆర్‌ఎస్ ఆవిర్భావ బహిరంగ సభలో కె.కేశవరావు మాట్లాడారు. తెలంగాణను రైతు సమాజంగా మార్చాలన్న ధ్యేయంతో దేశంలోనే ఏ రాష్ట్రంలో లేని విధంగా ఏటా రెండు పంటలకు ఎకరానికి రూ.4 వేల చొప్పున పెట్టుబడికి ఇస్తామని సీఎం కేసీఆర్ చెప్పారని గుర్తుచేశారు. తెలంగాణను రైతు రాజ్యంగా మారుస్తున్నారన్నారు. తెలంగాణలో టీఆర్‌ఎస్ అధికారంలోకి వచ్చే నాటికి రాష్ట్రమంతా చీకటి మయంగా ఉందని, ప్రధాన సమçస్య అయిన విద్యుత్‌ను అనతికాలం లోనే పరిష్కరించారన్నారు.
వ్యవసాయానికి 9 గంటల విద్యుత్ తోపాటు, ఇతర అవసరాలకు నిరంతరాయంగా విద్యుత్ సరఫరా జరుగు తోందని చెప్పారు. నాటి పాలకులు చెరువులు, కుంటల బాగోగులను విస్మరించగా.. కాకతీయులను స్ఫూర్తిగా తీసుకున్న కేసీఆర్ మిషన్ కాకతీయ పేరుతో చెరువులు, కుంటలను పటిష్టం చేశారన్నారు. ఆకాశాన్నైనా బద్దలు కొట్టి తెలంగాణ తెస్తానని ఇదే వేదికపై చెప్పారని.. నాడు అన్న మాటను నిజం చేశారన్నారు. రాష్ట్ర ప్రగతిని అశేష జనవాణికి వివరించడానికి ఈ సభను ఏర్పాటు చేశామన్నారు. పోరాడి సాధించుకున్న తెలంగాణను బంగారు తెలంగాణగా తీర్చిదిద్దడానికి సీఎం కేసీఆర్ కంకణబద్దులై ముందుకు సాగుతున్నారని కేకే అన్నారు. రాష్ట్రంలో టీఆర్‌ఎస్‌కు బలం పెరిగిందని విర్రవీగడం లేదని, బాధ్యత పెరిగినట్లుగా భావిస్తున్నామని తెలిపారు.