గ్రామాభివృద్ధికి నిధులు సమకూర్చే ఆస్తి పన్ను వసూళ్ల ప్రక్రియ దారితప్పింది. పన్ను రూపంలో వసూలు చేసిన మొత్తాన్ని ప్రభుత్వ ఖజానాకు జమ కాకుండా ప్రైవేటు ఖాతాకు మళ్లినట్లు వెలుగుచూసింది. తీగలాగితే డొంక కదులుతుందని భావించిన జిల్లా పంచాయతీ శాఖ విచారణకు ఆదేశించింది. విచారణ పూర్తయిన తర్వాత వచ్చిన నివేదికల్లో అక్రమాల తంతు బయటపడనుంది.
- సాక్షి, రంగారెడ్డి జిల్లా
సాక్షి, రంగారెడ్డి జిల్లా: గ్రామంలో అభివృద్ధి పనులు చేపట్టడంతోపాటు గ్రామ పంచాయతీని బలోపేతం చేసుకునేందుకు కీలక వనరు ఆస్తి పన్ను వసూలు ప్రక్రియ. ఇంతటి ముఖ్యమైన పన్ను వసూళ్లలో అక్రమాలు చోటుచేసుకున్నాయి. పన్ను పైసలు సేకరించే బిల్ కలెక్టర్లే ఈ అక్రమాలకు కేంద్ర బిందువులుగా మారారు. ఒకటి కాదు రెండు కాదు పదుల సంఖ్యలోని పంచాయతీల్లో ఇలాంటి బాగోతమే జరుగుతోంది. ఈ అంశంపై జిల్లా పంచాయతీ శాఖకు ఫిర్యాదులు రావడంతో రంగంలోకి దిగిన అధికారులు.. అక్రమాల గుట్టును రట్టు చేసేందుకు ఉపక్రమించారు. 2013- 14, 2014 -15 ఆర్థిక సంవత్సరాల్లో పంచాయతీల వారీగా పన్ను వసూలు ప్రక్రియ, నిధులు జమచేసిన విధానంపై ఆరా తీసేందుకు పంచాయతీ శాఖ ప్రత్యేకంగా విచారణాధికారులను నియమించింది.
శివారు పంచాయతీల్లో..
రాజధానికి ఆనుకుని ఉన్న పంచాయతీల్లో ఆస్తి పన్ను లక్ష్యం అధికంగా ఉంది. ఈ పంచాయతీల పరిధిలో ఆర్థికంగా మెరుగైన పరిస్థితి ఉండడంతో వసూళ్ల ప్రక్రియ కూడా ఆశాజనకంగా ఉంది. ఈ క్రమంలో సర్కారుకు భారీగా ఆదాయం వస్తున్న ఈ పంచాయతీల్లో అక్రమాలు సైతం అదేస్థాయిలో ఉన్నాయి. పన్ను రాబడి అధికంగా ఉన్నప్పటికీ ఖజానాకు మాత్రం తక్కువ మొత్తంలో జమ అవుతోంది. జిల్లా పంచాయతీ శాఖ అధికారి పద్మజారాణి ఇటీవల పలు గ్రామాల్లో పర్యటించి ఈ అక్రమాల్ని గుర్తించారు. దీంతో వాస్తవంగా వసూలైన పన్ను ఎంత.. ఖాతాలో జమైన నిధులెన్ని అనే అంశంపై స్పష్టత కోసం విచారణకు ఆదేశించారు. వివిధ మండల పరిషత్‌లలో పనిచేస్తున్న విస్తరణాధికారులకు ఈ విచారణ బాధ్యతలు అప్పగించారు. ఈనెల 25లోపు విచారణ పూర్తి చేసి నివేదిక సమర్పించాలని స్పష్టం చేశారు.
విచారణ ఇలా..
గ్రామ పంచాయతీ పరిధిలో ఆస్తిపన్ను వసూళ్ల ప్రక్రియలో నిర్వహించే తీరు ఆధారంగా విచారణ చేపట్టనున్నారు. వాస్తవానికి పన్ను వసూలు చేసిన రోజేఆ మొత్తాన్ని బ్యాంకు ఖాతాలో జమచేయాలి. రసీదుల్లో పేర్కొన్న మొత్తం.. బ్యాంకులో జమచేసిన మొత్తానికి సరిపోలాలి. ఈ క్రమంలో తేడాలొస్తే అక్రమాలకు ఆస్కారం ఉన్నట్లే. ఈ అంశాల ఆధారంగా విచారణాధికారులు పరిశీలనకు ఉపక్రమించారు. ఇప్పటికే పలు గ్రామాల్లో పర్యటించి అక్రమాలను గుర్తించినట్లు సమాచారం. ఈనెల 25లోగా కొందరు, వచ్చేనెల ఏడో తేదీలోగా మరికొందరు ఈ విచారణ నివేదికలు జిల్లా పంచాయతీ అధికారికి సమర్పించనున్నారు.
విచారణ చేపట్టే పంచాయతీలివే..
నగరానికి చుట్టూ విస్తరించి ఆదాయం సమృద్ధిగా వచ్చే మండలాలపై పంచాయతీ శాఖ దృష్టి సారించింది. ఈక్రమంలో ఫిర్యాదుల ఆధారంగా విచారణ చేపట్టాలని నిర్ణయించింది. ఇందులో భాగంగా తొలుత 22 గ్రామ పంచాయతీలను గుర్తించి విచారణకు ఆదేశించింది. వీటిలో మణికొండ, బండ్లగూడ, నిజాంపేట, దమ్మాయిగూడ, బాచుపల్లి, కొంపల్లి, దూలపల్లి, బోడుప్పల్, ఫిర్జాదీగూడ, చెంగిచర్ల, మీర్‌పెట్, మేడిపల్లి, జిల ్లలగూడ, చౌదరిగూడ, బాలాపూర్, జల్‌పల్లి, రాగన్నగూడ, నాగారం, రాంపల్లి, కీసర, పుప్పాల్‌గూడ, పరిగి గ్రామ పంచాయతీలున్నాయి. వీటి విచారణకు వివిధ మండలాల విస్తరణ అధికారులను నియమించి వారికి డీపీఓ ఆదేశాలు జారీ చేశారు.
పన్నుల వసూళ్లలో కేటుగాళ్లు!
Published Wed, Feb 25 2015 1:49 AM | Last Updated on Wed, Mar 28 2018 11:11 AM
Advertisement