పాఠశాల వద్ద ఆందోళనకు దిగిన విద్యార్థులు, తల్లిదండ్రులు
సాక్షి, ఖమ్మం : అసలే అద్దెభవనాలు, ఆపై వాటిలో అరకొర వసతులు, విద్యార్థులకు సరిపడా టాయిలెట్స్, నీటి సౌకర్యం లేకుండా అవస్థలు పడుతూ గురుకుల పాఠశాలలో చదువులు కొనసాగించలేమని విద్యార్థులు, తల్లిదండ్రులు టీసీలు ఇవ్వాలని సోమవారం ఆందోళనకు దిగారు. వేరే ప్రాంతం నుంచి గురుకుల పాఠశాలను తరలించి ఒకే క్యాంపస్‌లో ఏర్పాటు చేయడాన్ని నిరసిస్తూ నగరంలోని వెలుగుమట్ల గుట్టపై ఉన్న ఖమ్మం నియోజకవర్గ గురుకుల పాఠశాలకు చెందిన విద్యార్థులు, వారి తల్లితండ్రులు ఆందోళనకు దిగారు. ఇలాంటి ఇబ్బందికర పరిస్థితిలో తమ పిల్లలను చదివించలేమని, టీసీలు ఇస్తే ఇంటికి తీసుకెళ్తామని పాఠశాలకు తాళం వేసి అందోళన చేశారు. జ్యోతిరావుపూలే బీసీ గురుకుల పాఠశాలను గత ఏడాది ఒక ప్రైవేటు కాలేజీ భవనాన్ని అద్దెకు తీసుకొని ఏర్పాటు చేశారు. పాఠశాలలో 5, 6, 7 తరగతులకు సంబంధించిన సుమారు 200 మందికిపైగా విద్యార్థులు విద్యనభ్యసిస్తున్నారు. అదే పాఠశాల ఆవరణంలో ఒక భవనంలో వైరా నియోజకవర్గంలోని తాటిపూడిలో ఉన్న బీసీ గురుకుల పాఠశాలకు కేటాయించారు.
దసరా సెలవులకంటే ముందే తీసుకొచ్చే ప్రయత్నం చేస్తే అప్పటిలో తెలుసుకున్న విద్యార్థులు, తల్లితండ్రులు ఆందోళన చేశారు. తర్వాత దాన్ని వాయిదా వేశారు. తీరా సెలవులు అనంతరం పాఠశాలలు పునః ప్రారంభం రోజున ఖమ్మం నియోజకవర్గం పాఠశాలకు, ఒక భవనం, వైరా నియోజకవర్గం పాఠశాలకు మరొక భవనం కేటాయించి ఇక్కడ వసతి ఏర్పాటు చేశారు. రెండు పాఠశాల విద్యార్థులు తమ లగేజీలతో బస్సులు, ఆటోలలో పాఠశాలకు వచ్చారు. అసలే అరకొర వసతులతో ఇబ్బంది పడుతుంటే దానికి తోడు వేరే పాఠశాల నుంచి 200 మంది విద్యార్థులను ఇక్కడకు తరలించడంతో సమస్యలు ఏర్పడ్డాయి. చిన్నపాటి క్యాంపస్‌లో 400 మంది పైగా విద్యార్థులు ఉండటాన్ని బట్టి చూస్తే పరిస్థితి ఎంత దారుణంగా ఉంటుందో అర్థం చేసుకోవచ్చు. ఈ సమస్యల మధ్య తమ పిల్లలను చదివించలేమని టీసీలు ఇవ్వాలంటూ ఉపాధ్యాయులపై వత్తిడి చేశారు. ఒకేసారి వందలాది మంది విద్యార్థులు, తల్లితండ్రుల రాకతో ఆ ప్రాంతం కోలాహలంగా మారింది. అసలే రోడ్డు పక్కన లేక పోవడంతో లోపల ఉన్న కిలో మీటరు రావడం కష్టంగా ఉందని, ఇలాంటి చోట వైద్య పరంగా ఇబ్బందులు ఉన్నాయని, ఇంత మందితో అద్దె భవనంలో సాగడం కష్టంగా ఉంటుందని నినాదాలు చేశారు. పాఠశాల గేటు వద్ద, ఖమ్మం–వైరా ప్రధాన రహదారిపై కూడా ఆందోళనకు దిగారు.
Comments
Please login to add a commentAdd a comment