ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగల మకాం..! | Khammam Interstate stay pirates | Sakshi
Sakshi News home page

ఖమ్మంలో అంతర్రాష్ట్ర దొంగల మకాం..!

Published Sun, Nov 30 2014 2:49 AM | Last Updated on Sat, Sep 2 2017 5:21 PM

Khammam Interstate stay pirates

మూడు రోజులుగా  లాడ్జిలో తిష్ట
అర్థరాత్రి వేళ పోలీసుల దాడులు
తప్పించుకుని కారులో పరారు...
నల్లగొండ జిల్లా చిట్యాలలో పట్టివేత
ఖమ్మం క్రైం


నలుగురు సభ్యుల అంతర్రాష్ట దొంగల ముఠాను ఖమ్మం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు. అత్యంత విశ్వసనీయంగా తెలిసిన ప్రకారం.. రాజస్థాన్ రాష్ట్రానికి చెందిన ఈ ముఠా మూడు రోజుల కిందటే నగరానికి వచ్చింది. గాంధీచౌక్‌లోని లాడ్జిలో మకాం వేసింది. ఇంతకీ, ఈ ముఠా ఎలా పట్టుబడిందంటే...

నగరంలోని మున్సిపల్ రోడ్డులోగల సెల్ షాపునకు శుక్రవారం రాత్రి ఓ యువకుడు వచ్చాడు. సెల్ ఫోన్ కొన్నాడు. డబ్బు చెల్లించేందుకు తన వద్దనున్న క్రెడిట్ కార్డుతో స్వైప్ చేశాడు. కొద్ది క్షణాల్లోనే.. ఆ షాపునకు ఫోన్ కాల్ వచ్చింది. ‘‘ఇప్పుడు స్వైప్ చేసిన క్రెడిట్ కార్డు నాది. పోలీస్ స్టేషన్‌లో కంప్లైంట్ కూడా ఇచ్చాను. ఆ వ్యక్తిని అక్కడే ఉంచి, వెంటనే పోలీసులకు చెప్పండి’’ అని కోరారు. ఆ షాపు సిబ్బంది అప్రమత్తమయ్యూరు. వెంటనే పోలీసులకు సమాచారమిచ్చారు. వారు వచ్చేంత వరకు ఆ వ్యక్తిని మాటల్లో పెట్టారు. ఇంతలో పోలీసులు వచ్చి ఆ యువకుడిని అదుపులోకి తీసుకున్నారు.
 
లాడ్జిలో మకాం


ఆ యువకుడిని పోలీసులు స్టేషన్‌కు తీసుకెళ్లి విచారించారు. రాజస్థాన్‌కు చెందిన తాము మొత్తం నలుగురం ఉన్నామని, ముఠాగా ఏర్పడి చోరీలు చేస్తున్నామని చెప్పాడు. గాంధీచౌక్‌లోని లాడ్జిలో రూమ్ తీసుకున్నామని, మూడు రోజులుగా అక్కడే ఉంటున్నామని తెలిపాడు. అర్థరాత్రి దాటిన తరువాత, పోలీసులు ఆ లాడ్జిలోని రూముకు వెళ్లి సోదా చేశారు. అప్పటికే అక్కడి నుంచి ఆ ముగ్గురు వ్యక్తులు కారులో ఎటో పారిపోయూరు.

చిట్యాలలో దొరికారు

కారు నెంబరు, ఇతర ఆనవాళ్లను జిల్లాలోని చుట్టుపక్కల పోలీస్ స్టేషన్లకు, నల్గొండ జిల్లా పోలీసులకు పంపించారు. ఆయూ ప్రాంతాల పోలీసులు వేగంగా స్పందించి ఎక్కడికక్కడ తనిఖీలు చేపట్టారు. నల్లగొండ జిల్లా చిట్యాల వద్ద పోలీసుల తనిఖీలో ఈ కారు పట్టుబడింది. ఇందులోని ముగ్గురు వ్యక్తులను అక్కడి ఎస్సై అదుపులోకి తీసుకుని, ఖమ్మం పోలీసులకు సమాచారమిచ్చారు. వీరు అక్కడకు వెళ్లి, ఆ ముగ్గురినీ తీసుకొచ్చి విచారిస్తున్నారు.
 
భారీ చోరీలు
 
తాము నలుగురం ముఠాగా ఏర్పడ్డామని, భారీగా దొంగతనాలు చేస్తున్నామని వీరు పోలీసుల విచారణలో చెప్పినట్టు తెలిసింది. నగరానికి చెందిన వారే ఈ లాడ్జిలో తమకు రూమ్ బుక్ చేసినట్టుగా చెప్పారని, అరుుతే వారి వివరాలు మాత్రం ఇంకా వెల్లడించలేదని సమాచారం.
 మూడు రోజులుగా లాడ్జిలో ఉంటున్న ఈ నలుగురు ఎక్కడి నుంచి వచ్చారు..? వారి కారు నెంబర్ ఎంత..? అడ్రస్ ఎక్కడ..? ఎందుకోసం వచ్చారు..? తదితర వివరాలను లాడ్జి సిబ్బంది నమోదు చేయలేదని తెలిసింది.
 
పగలంతా బయట.. అర్థరాత్రి రాక

రాజస్థాన్‌కు చెందిన ఈ నలుగురు వ్యక్తులు పగటి పూట తమ గదిలో నుంచి బయటకు వెళ్లి, ఎప్పుడో అర్థరాత్రి దాటిన తరువాత తిరిగి వచ్చేవారని పోలీసులతో లాడ్జి సిబ్బంది చెప్పినట్టు తెలిసింది. ‘‘రూమ్‌లోకి వెళ్లిన తర్వాత వారు అసలు బయటకు వచ్చే వారు కాదు. హోటల్ బాయ్స్ లోపలికి వెళ్లినప్పుడు.. వారంతా ఫోన్‌లో హిందీలో మాట్లాడుతూ కనిపించేవారు. ఖమ్మంలో ముఖ్యమైన ప్రాంతాలు ఎక్కడెక్కడ ఉన్నాయని అడిగారు’’ అని, పోలీసులతో ఈ లాడ్జి సిబ్బంది చెప్పినట్టు సమాచారం. గాంధీచౌక్‌లోని ఓ హోటల్‌లో భోజనం, స్టేషన్ రోడ్డులోగల రాజస్థానీ హోటళ్లలో అల్పాహారం చేసేవాళ్లమని ఈ నలుగురు పోలీసులతో చెప్పినట్టు సమాచారం. మరిన్ని వివరాలు తెలుసుకునేందుకు వీరిని పోలీసులు విచారిస్తున్నట్టు తెలిసింది.

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement