చింతకాని/ముదిగొండ: రాష్ట్రవ్యాప్తంగా సంచలనం రేపిన ఇంజక్షన్ హత్య కేసు మిస్టరీ వీడింది. ముగ్గురు వ్యక్తులు పక్కా ప్రణాళికతో హత్యకు పాల్పడ్డారని.. లిఫ్ట్ అడగడం, అధిక డోసు మత్తు ఇంజక్షన్ గుచ్చడం, నంబర్ లేని ద్విచక్ర వాహనాన్ని వినియోగించడం అంతా పక్కాగా అమలు చేశారని పోలీసులు తేల్చారు. ఈ ఘటనతో ప్రత్యక్షంగా సంబంధమున్న ముగ్గురు నిందితులను గుర్తించారు. అందులో ఇద్దరిని మంగళవారం రాత్రి చింతకాని మండలం మత్కేపల్లిలో అదుపులోకి తీసుకున్నారు. వారిని బుధవారం అరెస్టు చూపే అవకాశం ఉంది. పరారీలో ఉన్న మరొకరికోసం గాలింపు కొనసాగుతోంది. వివాహేతర సంబంధం నేపథ్యంలోనే ఈ హత్య జరిగినట్టు ఆరోపణలు వినిపిస్తున్నాయి. దీనికి సంబంధించి పోలీసులు బుధవారం పూర్తి వివరాలు వెల్లడించే అవకాశముంది.
24 గంటల్లోనే తేల్చిన పోలీసులు
చింతకాని మండలం బొప్పారం గ్రామానికి చెందిన జమాల్ సాహెబ్ ద్విచక్ర వాహనంపై వెళ్తుండగా.. ముదిగొండ మండలం వల్లభి గ్రామ సమీపంలో అధిక డోసు మత్తు ఇంజక్షన్ ఇచ్చి హత్య చేసిన విషయం తెలిసిందే. ఖమ్మం జిల్లా ఎస్పీ సీపీ విష్ణు వారియర్ ఆదేశాల మేరకు రంగంలోకి దిగిన పోలీసులు వేగంగా దర్యాప్తు చేశారు. సీసీ కెమెరా పుటేజీలు, సెల్‌ఫోన్ కాల్ డేటా ఆధారంగా వల్లభి గ్రామంలో విచారణ నిర్వహించి వివరాలు సేకరించారు. జమాల్ సాహెబ్‌ను హత్య చేసిన అనంతరం నిందితులు నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై పారిపోయిన విషయం తెలిసి.. సెల్‌ఫోన్ లొకేషన్, కాల్‌డేటా ఆధారంగా చింతకాని మండలం మత్కేపల్లిలో విచారణ చేపట్టారు.
మత్కేపల్లిలో గోద మోహన్‌రావు వద్ద ఉన్న ద్విచక్ర వాహనానికి నంబర్ లేదని తెలిసి ప్రశ్నించేందుకు వెళ్లారు. ఈ సమయంలో ఆందోళన చెందిన మోహన్‌రావు పారిపోయినట్టు తెలిసింది. గాలింపు చేపట్టిన పోలీసులు.. గ్రామంలోనే తలదాచుకున్న మోహన్‌రావును, జమాల్ సాహెబ్‌కు ఇంజక్షన్ గుచ్చిన నర్సింశెట్టి వెంకటేశ్‌ను అదుపులోకి తీసుకున్నట్టు తెలిసింది. వారిని విచారించగా ఈ మత్తు ఇంజక్షన్‌ను మోహన్‌రావు బంధువైన ఆర్‌ఎంపీ వైద్యుడు బండి వెంకన్న సరఫరా చేసినట్టు గుర్తించినట్టు సమాచారం. బండి వెంకన్న పరారీలో ఉన్నాడని, అతడి కోసం గాలిస్తున్నామని పోలీసు వర్గాలు వెల్లడించాయి. అదుపులోకి తీసుకున్న ఇద్దరిని బుధవారం అరెస్టు చూపే అవకాశం ఉంది. కాగా.. హత్య సమయంలో వాడిన నంబర్ ప్లేట్ లేని సదరు వాహనానికి మంగళవారం ఉదయం కొత్త నంబర్ ప్లేట్ పెట్టుకున్నట్టు గుర్తించారు.
అంతా పక్కా ప్లాన్ ప్రకారం..
చింతకాని మండలం మత్కేపల్లికి చెందిన గోద మోహన్‌రావు ఓ రైతు వద్ద గుమస్తాగా పనిచేస్తుండగా, నర్సింశెట్టి వెంకటేశ్ ట్రాక్టర్ డ్రైవర్‌గా పనిచేస్తున్నాడు. ఇద్దరూ కలిసి జమాల్ సాహెబ్‌ను హత్య చేసేందుకు ప్లాన్ వేశారు. బండి వెంకన్నను కలిసి అధిక డోసు మత్తు ఇంజక్షన్‌ను సిద్ధం చేసుకున్నారు. జమాల్ సాహెబ్ ఏపీలోని ఎన్టీఆర్ జిల్లా గండ్రాయిలో ఉంటున్న తన పెద్దకుమార్తె వద్దకు వెళ్లేందుకు బొప్పారం గ్రామం నుంచి ద్విచక్ర వాహనంపై బయలుదేరాడు. ఈ విషయం తెలిసిన గోద మోహన్‌రావు, నర్సింశెట్టి వెంకటేశ్ తమ ప్లాన్ అమలు చేశారు.
నంబర్ ప్లేట్ లేని ద్విచక్ర వాహనంపై ఇద్దరూ బాణాపురం గ్రామ సమీపంలోకి చేరుకున్నారు. వెంకటేశ్ రోడ్డుపై వేచి ఉండగా.. మోహన్‌రావు చాటుగా దాక్కున్నాడు. ద్విచక్ర వాహనంపై వస్తున్న జమాల్ సాహెబ్‌ను వెంకటేశ్ లిఫ్ట్ అడిగి వెనుకాల ఎక్కాడు. ప్రయాణిస్తుండగా కొంతసేపటి తర్వాత జమాల్ సాహెబ్‌కు మత్తు ఇంజక్షన్ గుచ్చాడు. జమాల్ సాహెబ్ ద్విచక్ర వాహనాన్ని ఆపగానే వెంకటేశ్ దిగి పరుగెత్తాడు. వెనకాలే వస్తున్న మోహన్‌రావు అతడిని బైక్‌పై ఎక్కించుకుని పారిపోయారు. మరోవైపు జమాల్ సాహెబ్ షాక్‌లోకి వెళ్లిపోయి చనిపోయాడు.
Comments
Please login to add a commentAdd a comment