మాట్లాడుతున్న దిశ చైర్మన్, మహబూబాబాద్ ఎంపీ సీతారాం నాయక్, పక్కన ఖమ్మం ఎంపీ పొంగులేటి, జెడ్పీ చైర్‌పర్సన్ కవిత, కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ
సాక్షి, కొత్తగూడెం: ‘జిల్లాలో వివిధ రకాల అభివృద్ధి, సంక్షేమ పథకాలకు సంబంధించి ఏ ఒక్క అధికారైనా సరైన ప్రతిపాదనలు పంపించారా..? ఇప్పటివరకు జిల్లాలో ఐదు సార్లు జరిగిన సమావేశాల్లో చెప్పినప్పటికీ ఉపయోగం లేదు. అధికారుల సహకారం లేకపోతే కేంద్ర ప్రభుత్వ పథకాల నిధులను ఎలా సాధించాలి?’ అంటూ మహబూబాబాద్ ఎంపీ, దిశ కమిటీ చైర్మన్ అజ్మీరా సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. శుక్రవారం కొత్తగూడెం డీఆర్‌డీఓ కార్యాలయంలో ‘దిశ’ (జిల్లా అభివృద్ధి, సమన్వయ మరియు పర్యవేక్షణ కమిటీ) సమావేశం చైర్మన్ సీతారాంనాయక్, కో చైర్మన్ , ఖమ్మం ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డిల ఆధ్వర్యంలో జరిగింది.
ఈ సమావేశంలో కేంద్ర పథకాలపై చర్చ జరిగింది. పనితీరు సక్రమంగా లేని, కాకిలెక్కలు చెప్పిన అధికారులపై ఎంపీలిద్దరూ తీవ్ర అసహనం వ్యక్తం చేశారు. అన్ని శాఖల వివరాలు, గణాంకాలను కలెక్టర్ రజత్‌కుమార్ శైనీ నోటికి చెబుతుండగా, ఆయా శాఖల జిల్లా అధికారులు మాత్రం కాగితాలు వెతుక్కుంటుండగా.. ‘ఒకరి ముఖాలు ఒకరు చూసుకునేందుకు సమావేశానికి వచ్చారా..? అసలు ప్రిపేర్ కాకుండా ఎలా వచ్చారు’ అని ఎంపీలు ప్రశ్నించారు. కొన్ని శాఖల నుంచి ద్వితీయ శ్రేణి అధికారులు సమావేశానికి రావడంతో సదరు శాఖాధిపతుల వివరాలను నోట్ చేసుకోవాలని కలెక్టర్‌కు సూచించారు.
కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాలకుప్రతిపాదనలు ఎందుకు పంపలేదు..?
నేషనల్ హెల్త్ మిషన్ పథకం కింద కొత్తగూడెంలో నర్సింగ్ కళాశాల ఏర్పాటుకు, కొత్త అంబులెన్స్‌లకు ఇప్పటివరకు ప్రతిపాదనలు ఎందుకు పంపలేదని ఎంపీలు ప్రశ్నించారు. అధికారుల సహకారం లేకుంటే పార్లమెంట్‌లో ఎలా చర్చించాలన్నారు. 2013లో నిర్మాణం పూర్తిచేసుకున్న మణుగూరు ఏరియా ఆస్పత్రిలో ఇప్పటివరకు సేవలు ప్రారంభించలేదని పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు ఆవేదన వ్యక్తం చేశారు. గతం దిశ సమావేశాల్లో కూడా ఈ విషయం ప్రస్తావనకు వచ్చిందని, అక్కడి డాక్టర్లందరినీ డిప్యుటేషన్‌పై ఎలా పంపారంటూ వైద్యవిధాన పరిషత్ కో–ఆర్డినేటర్ రమేష్‌ను ప్రశ్నించారు. ఇల్లెందులోని 30 పడకల ఆస్పత్రిలో చిన్నపిల్లల వైద్య సేవలు అధ్వానంగా ఉన్నాయని ఇల్లెందు ఎమ్మెల్యే హరిప్రియ పేర్కొన్నారు. కాగా ఈ ఆస్పత్రిని వైద్య విధాన పరిషత్‌కు మార్చాలని ఎంపీ సీతారాంనాయక్ సూచించారు. ఇందుకు సంబంధించి ప్రిన్సిపల్ సెక్రటరీకి ప్రతిపాదనలు పంపుతానని కలెక్టర్ తెలిపారు.
భద్రాచలం, సారపాకలను అటూఇటూ కాకుండా ఎలా ఉంచారు..?: ఎంపీ సీతారాం నాయక్
భద్రాచలం, సారపాక పట్టణాలను మున్సిపాలిటీలుగా అప్‌గ్రేడ్ చేస్తూ ప్రతిపాదనలు పంపించడంపై ఎంపీ సీతారాంనాయక్ నిర్వేదం వ్యక్తం చేశారు. పైనుంచి అడగకపోయినప్పటికీ ఈ ప్రతిపాదనలు పంపడమేమిటన్నారు. ఈ రెండు పట్టణాలు ఇటు గ్రామ పంచాయతీగా కాకుండా, అటు మున్సిపాలిటీగానూ కాకుండా ఉండటం వల్ల ప్రజలకు సరైన సేవలు అందే పరిస్థితి లేదన్నారు. పాల్వంచ మున్సిపల్ కమిషనర్ షఫీఉల్లా సరైన వివరాలు చెప్పకపోవడంతో సరిగ్గా ప్రిపేర్ కాకుండా ఎలా వచ్చావని ఎంపీ సీతారాంనాయక్ షఫీఉల్లాపై ఆగ్రహం వ్యక్తం చేశారు.
అక్షయపాత్ర పథకం ఎవరికోసం పెట్టారు..? : కొత్తగూడెం ఎమ్మెల్యే వనమా
రాష్ట్రంలో ఎక్కడా లేని విధంగా ఒక్క కొత్తగూడెం నియోజకవర్గంలో మాత్రమే మధ్యాహ్న భోజన పథకం అమలు వ్యవహారాన్ని ‘అక్షయపాత్ర’ అనే సంస్థకు ఎవరి ప్రయోజనాల కోసం ఇచ్చారని వనమా ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయంపై స్పందించిన ఎంపీ పొంగులేటి శ్రీనివాసరెడ్డి సదరు భోజనానికి సంబంధించి ఫుడ్ ఇన్‌స్పెక్టర్ ద్వారా నాణ్యత, పరిమాణంపై పరిశీలన చేయించాలని కలెక్టర్‌కు సూచించారు. దివంగత మహానేత రాజశేఖరరెడ్డి ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ఇచ్చిన ఆర్‌ఓఎఫ్‌ఆర్ పట్టాలను కూడా అటవీ శాఖాధికారులు లాక్కుని ఆదివాసీ గిరిజనులపై అక్రమ కేసులు బనాయించడమేమిటని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ విషయమై స్పందించిన ఎంపీ సీతారాంనాయక్ బడాబడా స్మగ్లర్లను వదిలిపెట్టి అమాయక ఆదివాసీలపై అటవీ అధికారులు ఎందుకు కేసులు పెడుతున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. అటవీ అధికారులు జులూం వల్ల ఆదివాసీలు ఆత్మహత్యలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.
విద్యుత్ శాఖాధికారులు నిర్లక్ష్యం వీడాలి: పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు
పినపాక ఎమ్మెల్యే రేగా కాంతారావు మాట్లాడుతూ గుండాల మండలం సజ్జలగూడెం వద్ద విద్యుత్ తీగలు తెగిపడటంతో 6వ తరగతి విద్యార్థిని మృతి చెందిందని, కొన్ని పశువులు మృతిచెందాయన్నారు. కరకగూడెం మండలంలో ఊరి బయట నుంచి వెళ్తున్న విద్యుత్ లైన్‌ను మార్చి ఇళ్ల మధ్యనుంచి వేయడమేమిటని ప్రశ్నించారు. గుండాలలో ఇందిర జలప్రభపథకం కింద 9 బోర్లు వేయగా, ఏళ్లు గడుస్తున్నా ఇప్పటివరకు విద్యుత్ సరఫరా చేయకుండా ఆ శాఖాధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు.
మిషన్ భగీరథ అధికారులపై..
మిషన్ భగీరథ పథకం పనులకు సంబంధించి ఆ శాఖాధికారులు కాకిలెక్కలు చెప్పడంతో ఎంపీలు సీతారాంనాయక్, పొంగులేటి శ్రీనివాసరెడ్డిలు ఆయా అధికారులపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. పనులు ఆలస్యం కావడంపట్ల కాంట్రాక్టర్లను ఎందుకు ఉపేక్షిస్తున్నారని, వారేమైనా మీకు చుట్టాలా.. బం«ధువులా..? అంటూ ఎంపీ సీతారాంనాయక్ ఆగ్రహం వ్యక్తం చేశారు. థర్డ్‌పార్టీ విచారణ జరిపి, తమకు నివేదిక ఇవ్వాలని కలెక్టర్‌కు సూచించారు. ఇల్లెందుకు గతంలో నడిచిన ప్యాసింజర్ రైలును పునరుద్ధరించాలని ఎమ్మెల్యే హరిప్రియ కోరగా, స్పందించిన సీతారాంనాయక్ ఈ విషయంతోపాటు సారపాక రైల్వేలైన్ విషయంపై కూడా కేంద్ర మంత్రితో మాట్లాడతానన్నారు.
జిల్లాలోని చర్ల, దుమ్ముగూడెం, టేకులపల్లి, గుండాల, ములకలపల్లి, ఖమ్మం జిల్లాలోని సింగరేణి మండలాలకు ఏకలవ్య పాఠశాలలు మంజూరు చేశానని సీతారాంనాయక్ పేర్కొన్నారు. వచ్చే విద్యా సంవత్సరం నుంచి 100 మంది విద్యార్థులతో వీటిని ప్రారంభించేందుకు నిర్ణయించినట్లు పే ర్కొన్నారు. ఇప్పటికే మహబూబాబాద్ పట్టణంలో పాస్‌పోర్ట్ సేవా కేంద్రం మంజూరైందని, త్వరలో కొత్తగూ డెం పట్టణంలో కూడా పాస్‌పోర్ట్ కేంద్రం మంజూరు చేసే విధంగా ప్రతిపాదనలు చేశామన్నారు. సమావేశంలో అశ్వారావుపేట ఎమ్మెల్యే మెచ్చా నాగేశ్వరరావు, జెడ్పీ చైర్‌పర్సన్ గడిపల్లి కవిత, అన్ని విభాగాల జిల్లా అధికారులు పాల్గొన్నారు.
డీఎంఎఫ్ నిధులను ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారు..? ఎంపీ పొంగులేటి
సింగరేణి గనులు విస్తరించి ఉన్న కొత్తగూడెం, ఇల్లెందు, పినపాక నియోజకవర్గాలకు సంబంధించి వచ్చిన రూ.441 కోట్ల డిస్ట్రిక్ట్ మినరల్ ఫండ్ నిధులను ఏ విధంగా కేటాయించారని డీఆర్‌డీవో జగత్‌కుమార్ రెడ్డిని ఎంపీ పొంగులేటి ప్రశ్నించారు. ఇప్పటివరకు కొత్తగూడెం నియోజకవర్గానికి రూ.95 కోట్లు, ఇల్లెందు నియోజకవర్గానికి రూ.71.90 కోట్లు, పినపాక నియోజకవర్గానికి రూ.21.80 కోట్లు కేటాయించినట్లు డీఆర్‌డీవో తెలిపారు. తాము ఇద్దరం ఎంపీలము ఇచ్చిన ప్రతిపాదనలను పట్టించుకోకుండా ఏకపక్షంగా ఎలా కేటాయిస్తారని పొంగులేటి అసహనం వ్యక్తం చేశారు. దీనిపై కలెక్టర్ ఆధ్వర్యంలో ప్రత్యేక కమిటీ వేసి చర్చించాలని నిర్ణయించారు.
Comments
Please login to add a commentAdd a comment