వడివడిగా ఖరీఫ్ | Kharif dashes | Sakshi
Sakshi News home page

వడివడిగా ఖరీఫ్

Published Fri, Jun 19 2015 5:03 AM | Last Updated on Tue, Jun 4 2019 5:04 PM

Kharif dashes

సాగులోకి 85,912 ఎకరాలు
ఊపందుకున్న వ్యవసాయ పనులు
సాధారణ వర్షపాతం నమోదు
 
 కరీంనగర్‌అగ్రికల్చర్ : ఆశలసాగు వడివడిగా సాగుతోంది. ఆశించిన వర్షపాతం నమోదు కావడంతో ఖరీఫ్ సాగు ఊపందుకుంటోంది. అధికారుల అంచనాల కంటే పంటల విస్తీర్ణం పెరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. ఇప్పటికే జిల్లావ్యాప్తంగా సాధారణ వర్షపాత  నమోదు కాగా 27 మండలాల్లో అధిక వర్షం కురిసింది. గతేడాదితో పోలిస్తే ప్రస్తుతం పంట లసాగు వేగంగా జరుగుతోంది. ప్రధానంగా రైతులు పత్తి, వరినాట్ల వైపే మొగ్గు చూపుతున్నారు. ఖరీఫ్ సాధారణ సాగు విస్తీర్ణం 5.66 లక్షల హెక్టార్లు కాగా ఇప్పటివరకు 85,912 ఎకరాలు (34,365 హెక్టార్లు) వివిధ పం టలు సాగయ్యాయి.

గత ఖరీఫ్‌లో 4,92,286 హెక్టార్లలో పంటలు సాగయ్యాయి. గతేడాది జూన్‌లో ఇదే సమయానికి 70 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదు కాగా 3వేల ఎకరాల  సాగు కూడా మించలేదు. ఈ ఏడాది ఇప్పటివరకు 102.2 మి.మీ. వర్షం కురవగా రైతన్నలు ఆనందంతో పంటలసాగు ప్రారంభించారు. అత్యధికంగా 76,120 ఎకరాలు(30,448 హెక్టార్లు) పత్తి, 4,062 ఎకరాలు (1,625 హెక్టార్లు) వరి సాగు మొదలుపెట్టారు. 6,145 ఎకరాలలో (2,458 హెక్టార్లు) మొక్కజొన్న నాటుకున్నారు. కందులు 1,887 ఎకరాలు, ఇతర పంటలు 962 ఎకరాల్లో సాగయ్యూరుు.

 వర్షం.. హర్షం
 జిల్లాలో జూన్ 1 ఖరీఫ్ ఆరంభమైనప్పటి నుంచి ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 85.6 మిల్లీమీటర్లకు గాను 102.2 మిల్లీమీటర్ల వర్షం కురిసింది. జిల్లాలోని 57 మండలాలకు గాను 27 మండలాల్లో అధిక వర్షం కురిసింది. 12 మండలాల్లో సాధారణ, 15 మండలాల్లో లోటు, 3 మండలాల్లో అత్యంత లోటు వర్షపాతం నమోదయ్యింది. కరీంనగర్ డివిజన్‌లోని 10 మండలాల్లో ఇప్పటివరకు సాధారణ వర్షపాతం 72.7 మి.మీకు గాను 85.6 మిమీ వర్షం కురిసింది.

హుజూరాబాద్ డివిజన్‌లోని 8 మండలాల్లో 64.7 మిమీ సాధారణ వర్షపాతానికి గాను 99.7 మిమీ కురిసింది. జగిత్యాల డివిజన్‌లోని 14 మండలాల్లో 94.4 మిమీ సాధారణ వర్షపాతానికి 71.7 మిమీ వర్షం కురిసింది. సిరిసిల్ల డివిజన్‌లోని 9 మండలాల్లో 91.7 మిమీ సాధారణ వర్షపాతానికి గాను 99 మిమీ వర్షం కురిసింది. పెద్దపల్లి డివిజన్‌లో 9 మండలాల్లో 99.7 మిమీ సాధారణ వర్షపాతానికి 120.7 మిమీ వర్షం కురిసింది. మంథని డివిజన్‌లోని 7 మండలాల్లో 85.6 మిమీ సాధారణ వర్షపాతానికి 102.2 మిమీ వర్షం కురిసింది.

 లోటు వర్షపాతం నమోదైన మండలాలు
 తిమ్మాపూర్, చిగురుమామిడి, గొల్లపల్లి, మల్లాపూర్, కోరుట్ల, ఇబ్రహీంపట్నం, కథలాపూర్, సారంగాపూర్, ధర్మపురి, కోనరావుపేట, చందుర్తి, గంభీరావుపేట, ఎల్లారెడ్డిపేట, వెల్గటూర్, రామగుండం అత్యంత లోటు సైదాపూర్, జగిత్యాల, మేడిపల్లి

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement