పేదరికాన్ని జయించి జాతీయ స్థాయి క్రీడాకారునిగా ఎదిగి..
ఆర్మూర్ : పేదరికాన్ని జయించి జాతీయ స్థాయి క్రీడాకారునిగా ఎదిగి.. పాముకాటుతో ప్రాణాపాయ స్థితిలో ఉన్న కిక్ బాక్సర్ కుమ్మరి దిలీప్‌ను ఆదుకోవడానికి తెలంగాణ ప్రభుత్వం ముందుకొచ్చింది. మెరుగైన వైద్య సేవలందించడానికి తక్షణ సహాయం కింద ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి రూ. 4 లక్షలు మంజూరు చేసింది. ఈ విషయాన్ని ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి సోమవారం ‘సాక్షి’తో తెలిపారు. అవసరాన్ని బట్టి అతడి చికిత్స కోసం మరింత మొత్తాన్ని సైతం మంజూరు చేస్తానని ముఖ్యమంత్రి కేసీఆర్ హామీ ఇచ్చారని పేర్కొన్నారు.
మాక్లూర్ మండలం రాంచంద్రపల్లి గ్రామానికి చెందిన కుమ్మరి దిలీప్ కిక్ బాక్సింగ్‌లో జాతీయ స్థాయిలో ప్రతిభ కనబరుస్తున్నాడు. ప్రస్తుతం ఆర్మూర్ పట్టణంలోని నరేంద్ర జూనియర్ కళాశాలలో ఇంటర్మీడియట్ మొదటి సంవత్సరం చదువుతున్నాడు. కాగా ఈ నెల 2న తన గ్రామంలో వ్యవసాయ కూలీ పనులకు వెళ్లి పాము కాటుకు గురయ్యాడు. విషం శరీరమంతా వ్యాపించడంతో ప్రాణాపాయ స్థితికి చేరాడు. చావు బతుకుల మధ్య ఉన్న తమ కుమారుడిని బతికించుకోవడానికి సునీత, విజయ్ దంపతులు అప్పులు చేసి సికింద్రాబాద్‌లోని యశోద ఆస్పత్రిలో చికిత్స చేయిస్తున్నారు.
ఈ క్రీడాకారుడి దీన స్థితిని తెలుపుతూ ‘చావు బతుకుల్లో కిక్ బాక్సర్’ శీర్షికతో ‘సాక్షి’ ఈ నెల 12వ తేదీన మానవీయ కథనాన్ని ప్రచురించింది. ఈ కథనాన్ని చూసి తక్షణమే స్పందించిన ఇజ్రాయిల్ దేశంలోని ఇజ్రాయిల్ తెలంగాణ అసోసియేషన్ సభ్యులు రూ. 50 వేల ఆర్థిక సహాయాన్ని పంపించారు. ఈ మొత్తాన్ని శుక్రవారం ఆర్మూర్ ఎమ్మెల్యే ఆశన్నగారి జీవన్‌రెడ్డి చేతుల మీదుగా బాధితుని కుటుంబానికి అందించారు. దిలీప్‌ను జీవన్‌రెడ్డి పరామర్శించి, మేమున్నామన్నా భరోసా ఇచ్చారు. ముఖ్యమంత్రి సహాయ నిధి ద్వారా చికిత్సకు డబ్బులు మంజూరు చేయిస్తానని హామీ ఇచ్చారు.
అసెంబ్లీ సమావేశాల్లో బిజీగా ఉన్న ముఖ్యమంత్రి కేసీఆర్ వద్దకు వెళ్లి దిలీప్ ఆరోగ్య పరిస్థితిని వివరించారు. గ్రామీణ ప్రాంతంలో ప్రభుత్వ పాఠశాలలో చదివి పట్టుదలతో జాతీయ స్థాయి కిక్ బాక్సర్‌గా ఎదిగిన దిలీప్‌ను ఆదుకోవాలని కోరారు. ముఖ్యమంత్రి కేసీఆర్ సానుకూలంగా స్పందించారని ఎమ్మెల్యే జీవన్‌రెడ్డి తెలిపారు. చికిత్స నిమిత్తం తక్షణ సహాయం కింద రూ. 4 లక్షలు మంజూరు చేశారన్నారు.
ముఖ్యమంత్రి సహాయ నిధి నుంచి లక్ష రూపాయలలోపే ఆర్థిక సహాయం అందించవచ్చు. అయితే గ్రామీణ క్రీడాకారుడిని బతికించుకోవాలన్న ఉద్దేశంతో ముఖ్యమంత్రి రూ. 4 లక్షలు మంజూరు చేశారని ఎమ్మెల్యే పేర్కొన్నారు. సీఎం రిలీఫ్ ఫండ్ మంజూరకు సంబంధించిన జీఓను సోమవారం రాత్రి ఆస్పత్రిలో అందించామన్నారు. దిలీప్ తొందరగా కోలుకోవాలని ప్రార్థిస్తున్నామన్నారు.