♦ వివరాలను పోలీస్‌బాస్‌కు పంపిన నల్లగొండ ఎస్పీ
♦ శ్రీలంక వెళ్లేందుకు ప్రభుత్వ అనుమతి కోరిన దుగ్గల్?
♦ హైదరాబాద్‌లో మరొకరిని అదుపులోకి తీసుకున్న నల్లగొండ పోలీసులు
సాక్షి ప్రతినిధి, నల్లగొండ: నల్లగొండ జిల్లాలో వెలుగుచూసిన సంచలన కిడ్నీ రాకెట్ వ్యవహారంపై పూర్తిస్థాయి నివేదిక రాష్ట్ర డీజీపీకి అందింది. ఈ మేరకు నల్లగొండ జిల్లా ఎస్పీ విక్రమ్‌జీత్ దుగ్గల్ రాకెట్‌కు సంబంధించి తాము వెలికితీసిన అన్ని అంశాలతో కూడిన నివేదికను డీజీపీ అనురాగ్‌శర్మకు పంపారు. ఇప్పటికే చాలావరకు దర్యాప్తులో తేలిందని, అయితే, కిడ్నీలు అమ్ముకున్న వారు పలు రాష్ట్రాల్లో ఉన్నందున అక్కడకు వెళ్లి వారిని తీసుకువస్తే మరిన్ని విషయాలు వెలుగులోనికి వస్తాయని కూడా ఎస్పీ తన నివేదికలో పేర్కొన్నట్లు సమాచారం. మరోవైపు శ్రీలంక రాజధాని కొలంబో కేంద్రంగా ఈ రాకెట్ నడుస్తున్న నేపథ్యంలో కొలంబో వెళ్లి విచారణ జరిపేందుకు ప్రభుత్వంతో తమకు అనుమతి ఇప్పించాలని కూడా నల్లగొండ ఎస్పీ దుగ్గల్ కోరినట్టు పోలీసు వర్గాలు చెబుతున్నాయి. మొత్తంమీద ఈ కిడ్నీ రాకెట్ వివరాలు హైదరాబాద్ చేరడంతో దర్యాప్తు మరింత వేగిరం అవుతుందని భావిస్తున్నారు.
అదుపులో మరొకరు?
ఇక, ఈ రాకెట్‌లో సూత్రధారి అయిన మరొకరిని నల్లగొండ పోలీసులు అదుపులోనికి తీసుకున్నారని తెలుస్తోంది. ఈ రాకెట్‌లో అరెస్టయిన నల్లగొండ పట్టణానికి చెందిన కస్పరాజు సురేశ్‌తో పాటు మరో ముగ్గురు యువకులు ఇచ్చిన సమాచారం మేరకు ఏయే రాష్ట్రాల్లో కిడ్నీ కుంభకోణం లింకులున్నాయో విచారించేందుకు నల్లగొండకు చెందిన ఓ పోలీసు బృందం హైదరాబాద్‌కు వెళ్లింది. అక్కడ విచారణలో భాగంగా నాంపల్లికి చెందిన ఓ యువకుడిని నల్లగొండ పోలీసులు అదుపులోనికి తీసుకున్నట్టు తెలుస్తోంది. ఈ రాకెట్‌లో కీలకంగా భావిస్తున్న ఇతను ఇచ్చే సమాచారం కూడా దర్యాప్తును వేగిరం చేయనుందని పోలీసువర్గాలు చెబుతున్నాయి.
కిడ్నీ రాకెట్‌పై డీజీపీకి నివేదిక
Published Sun, Jan 10 2016 2:45 AM | Last Updated on Tue, Aug 21 2018 5:52 PM
Advertisement
Advertisement