ఏళ్లుగా.. ఎదురుచూపులే | Kinnersani Tourism Development Works Are Pending In Khammam | Sakshi
Sakshi News home page

ఏళ్లుగా.. ఎదురుచూపులే

Published Mon, Aug 12 2019 11:43 AM | Last Updated on Mon, Aug 12 2019 11:43 AM

Kinnersani Tourism Development Works Are Pending In Khammam - Sakshi

కిన్నెరసానిలో అసంపూర్తిగా ఉన్న ఫుడ్‌కోర్టు

సాక్షి, ఖమ్మం(పాల్వంచరూరల్‌) : పర్యాటకులను అలరించే ప్రకృతి అందాలకు నిలయమైన కిన్నెరసాని గురించి ఎంతో మంది కవులు ఎన్నో రకాలుగా వర్ణించారు. అందుకు తగ్గట్టుగానే దీన్ని దర్శించేందుకు రాష్ట్రంలోని అనేక ప్రాంతాల నుంచి నిత్యం వందలాది మంది యాత్రీకులు తరలివస్తుంటారు. ఇక్కడి డీర్‌పార్కులో దుప్పులు, నెమళ్లు, డక్‌పార్కులో బాతులు, కోతులు, కొండముచ్చులు పర్యాటకులను ఆకట్టకుంటాయి. రిజర్వాయర్‌లో బోటుషికారు మరింతగా ఆకర్షిస్తుంది.  దీన్ని మరింతగా అభివృద్ధి చేసే లక్ష్యంతో కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ ప్రాంతాన్ని పర్యాటక హబ్‌గా మారుస్తామని ప్రకటించాయి. తదనుగుణంగా నిధులు కూడా మంజూరు చేశాయి. అయితే మూడేళ్లు దాటినా అభివృద్ధి పనులు ఎక్కడివక్కడే నిలిచిపోవడంతో కిన్నెరసాని కళావిహీనంగా మారింది.  

పర్యాటకులకు నిరాశే.. 
ప్రకృతి అందాలు, పర్యాటక సొగసులను తిలకించేందుకు వచ్చేవారికి కిన్నెరసాని పర్యాటక ప్రాంతం నిరాశనే మిగిలిస్తోంది. మూడేళ్ల క్రితం ఇక్కడ చేపట్టిన అభివృద్ధి పనులు ఇంకా ఊరిస్తూనే ఉన్నాయి. కిన్నెరసాని, కొత్తగూడెంలోని పర్యాటక అభివృద్ధి పనులు ఏడు నెలలుగా ఆగిపోయాయి. 2015లో నీతి ఆయోగ్‌ పథకం కింద కేంద్ర ప్రభుత్వం రూ.3.24 కోట్లు, రాష్ట్ర ప్రభుత్వం నుంచి ఏకో టూరిజం అభివృద్ధి కింద రూ.7.53 కోట్లు కేటాయించాయి. ఈ నిధులతో కొత్తగూడెంలో టూరిజం హోటల్, కిన్నెరసానిలో అద్దాలమేడ, తొమ్మిది కాటేజీల పునర్నిర్మాణం, ఫుడ్‌ కోర్టు నిర్మాణ పనులు చేపట్టారు. హైదరాబాద్‌కు చెందిన చాప్రాస్‌ అసోసియేట్‌ కంపెనీకి చెందిన కాంట్రాక్టర్‌ తొమ్మిది కాటేజీలు, రెండంతస్తుల్లో నిర్మిస్తున్న అద్దాలమేడ, ఫుడ్‌కోర్టుకు స్లాబ్‌ వేసి వదిలేశారు.

ఆ తర్వాత కూలీల సమస్య వస్తోందని చెపుతూ గత డిసెంబర్‌ నుంచి పనులు చేయడం ఆపేశారు. ఆయినా అధికారులు పట్టించుకోకపోవడంతో అభివృద్ధి పనులు పడకేశాయి. గతంలో శిథిలమైన కాటేజీలు, అద్దాలమేడ స్థానంలో కొత్తగా పనులు ప్రారంభించడంతో వాటి కోసం పర్యాటకులు  ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. అయితే నిర్మాణ పనులు మాత్రం నత్తను మరిపిస్తున్నాయి. పనులు శరవేగంగా పూర్తిచేసి పర్యాటకులకు అందుబాటులోకి తీసుకు రావాల్సి ఉండగా కాంట్రాక్టర్‌ నిర్లక్ష్యం, అధికారుల పర్యవేక్షణ లోపంతో జాప్యం జరుగుతోంది. దీంతో పర్యాటకులు నిరాశగా వెనుదిరుగుతున్నారు.  

పనులు ఎప్పుటికి పూర్తయ్యేనో... 
రెండు సంవత్సరాల క్రితం రాష్ట్ర పర్యాటక శాఖ కమిషనర్‌తోపాటు అప్పటి జిల్లా కలెక్టర్‌ రాజీవ్‌గాంధీహన్మంతు కిన్నెరసానిలో జరుగుతున్న అభివృద్ధి పనులను పరిశీలించి అసంతృప్తి వ్యక్తం చేశారు. ఇవేం పనులంటూ సంబంధిత కాంట్రాక్టర్‌ను ప్రశ్నించారు. 2017 డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేయాలని, లేకుంటే బ్లాక్‌లిస్ట్‌లో పెడతామని హెచ్చరించారు. దీంతో 2018 డిసెంబర్‌ వరకు సమయం కావాలని కాంట్రాక్టర్‌ కోరారు. అయితే ఆ గడువు దాటి ఏడు నెలలైనా ఇప్పటికీ పనులు పూర్తికాకపోగా.. కమిషనర్‌ ఆదేశాలను సైతం భేఖాతర్‌ చేస్తూ పనులు మధ్యలోనే వదిలి కాంట్రాక్టర్‌ వెళ్లిపోయారు. దీంతో వి«విధ ప్రాంతాల నుంచి వచ్చే పర్యాటకులు నిరాశ, నిరుత్సాహాలతో వెనుదిరుగుతున్నారు. కాగా, కొంతవరకు చేపట్టిన అద్దాలమేడ, కాటేజీలు, ఫుడ్‌కోర్టు నిర్మాణ పనుల్లోనూ నాణ్యత ప్రమాణాలపై పలు ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. నిబంధనలకు విరుద్ధంగా దొడ్డు ఇసుకను వినియోగిస్తున్నారనే విమర్శలు వస్తున్నాయి.  
కాంట్రాక్ట్‌ రద్దు చేయాలని

ప్రతిపాదనలు పంపాం 
కిన్నెరసాని, కొత్తగూడెంలో జరుగుతున్న పర్యాటక అభివృద్ధి పనుల్లో జాప్యం చేయడంతో పాటు చెప్పకుండా మధ్యలోనే వెళ్లిపోయిన  కాంట్రాక్టర్‌కు పనులను రద్దు చేయాలని పర్యాటక శాఖ ఎస్‌ఈకి ప్రతిపాదనలు పంపాం. ఈ ఏడాది డిసెంబర్‌ నాటికి పనులు పూర్తి చేయాలని కాంట్రాక్టర్‌ను ఆదేశించాం. కొంత మేర పనులు చేసినప్పటికీ మధ్యలోనే వెళ్లిపోయాడు. మళ్లీ కొత్తగా టెండర్లు పలిచి పనులను కొనసాగించే అవకాశం ఉంది. 
–రాంబాబు, పంచాయతీరాజ్‌ ఏఈ  

No comments yet. Be the first to comment!
Add a comment
1
1/1

అసంపూర్తిగా నిలిచిన అద్దాలమేడ పనులు (ఇన్‌సెట్‌) స్లాబ్‌ నిర్మాణం పూర్తయిన కాటేజీలు

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement