బంగారు తెలంగాణ పేరుతో ముఖ్యమంత్రి కె. చంద్రశేఖర్‌రావు కుటుంబమే నిండు బంగారు కుటుంబంగా మారిపోయిందని బీజేపీ రాష్ట్ర అధ్యక్షులు జి.కిషన్ రెడ్డి విమర్శించారు. మంగళవారం హైదరాబాద్‌లోని పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆయన విలేకరులతో మాట్లాడుతూ బంగారు తెలంగాణలో రైతుల ఆత్మహత్యలు ఎందుకు జరుగుతున్నాయని ప్రశ్నించారు. 700 మందికి పైగా రైతులు ఆత్మహత్యలు చేసుకున్నా కేసీఆర్ పట్టించుకోవట్లేదని ఆరోపించారు.
నీటి ప్రాజెక్టులు, విద్యుత్ ప్రాజెక్టులు పూర్తయ్యేదాకా రైతు ఆత్మహత్యలను పట్టించుకోరా? అని ఆయన నిలదీశారు. సీఎం హెలికాప్టర్లలో కాకుండా గ్రామాల్లో తిరిగితే రైతు సమస్యలు తెలుస్తాయని కిషన్‌రెడ్డి సూచించారు. మిగులు బడ్జెట్ అని, ధనిక రాష్ట్రం అంటూ విలాసాలకు విచ్చలవిడిగా ఖర్చు పెడుతున్న సీఎం కేసీఆర్ ప్రజలపై భారం మోపేవిధంగా విద్యుత్‌చార్జీలు ఎలా పెంచుతారని ప్రశ్నించారు. ఒక్కొక్కరికీ రూ. 2 కోట్ల చొప్పున బహుమతులిస్తూ చార్జీలు ఎలా పెంచుతారని నిలదీశారు. మిషన్ కాకతీయను పూర్తిగా పార్టీ కార్యక్రమంగా మార్చేశారని కిషన్‌రెడ్డి విమర్శించారు. జీహెచ్‌ఎంసీ ఎన్నికల విషయంలో ప్రభుత్వ తీరు అప్రజాస్వామికమని, ఎన్నికలకు సిద్ధమంటూనే వాటి నిర్వహణకు 249 రోజుల గడువు కోరడం ప్రభుత్వ అసమర్థ, దివాలాకోరుతనానికి నిదర్శనమని దుయ్యబట్టారు. కిరణ్‌కుమార్‌రెడ్డి హయాంలో నెలలోనే వార్డుల విభజన, రిజర్వేషన్ల ప్రక్రియ పూర్తైఎన్నికలు జరిగాయని కిషన్‌రెడ్డి గుర్తుచేశారు.
ప్రభుత్వానికి చిత్తశుద్ధి ఉంటే వెంటనే ఎన్నికలను నిర్వహించాలని డిమాండ్ చేశారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో ఓటమితో గ్రేటర్ ఎన్నికలపై భయపడుతున్న టీఆర్‌ఎస్ మజ్లిస్‌తో పొత్తు పెట్టుకున్నా ఓడిపోవడం ఖాయమన్నారు. ఏపీ నుంచి వచ్చే వాహనాలపై రవాణా పన్ను విధిస్తూ ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఉపసంహరించాలని డిమాండ్ చేశారు. 2019లో శక్తివంతమైన పార్టీగా అవతరించేలా కార్యాచరణ ప్రణాళికను రూపొందిస్తున్నామన్నారు. ఈ నెల 2,3,4 తేదీల్లో బెంగుళూరులో జరిగే జాతీయ కార్యవర్గ సమావేశాల్లో దీనిపై వ్యూహరచన చేస్తామన్నారు.
'సీఎం కుటుంబమే బంగారుమయం'
Published Wed, Apr 1 2015 2:52 AM | Last Updated on Tue, Aug 14 2018 10:51 AM
Advertisement
Advertisement