రాహుల్ పర్యటనను రైతులే అడ్డుకుంటారు
మెదక్: తెలంగాణలో కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ పర్యటనను రైతులే అడ్డుకుంటారని ఆ రాష్ట్ర బిజేపీ అధ్యక్షుడు, ఎమ్మెల్యే జి.కిషన్రెడ్డి అన్నారు. శుక్రవారం జి.కిషన్రెడ్డి మెదక్ జిల్లా సంగారెడ్డి వచ్చారు. ఈ సందర్భంగా రాహుల్ గాంధీ మెదక్ జిల్లా పర్యటనపై కిషన్రెడ్డి స్పందించారు. కాంగ్రెస్ హయాంలో లేని రైతు ఆత్మహత్యలు... బీజేపీ హయాంలోనే ఉన్నాయా అని ఎద్దేవా చేశారు. దేశంలో రైతుల దుస్థితికి కారణం కాంగ్రెస్ పార్టీయే అని కిషన్రెడ్డి స్పష్టం చేశారు.
తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తర్వాత ముఖ్యంగా సీఎం కేసీఆర్ సొంత జిల్లా మెదక్లో రైతుల ఆత్మహత్యల సంఖ్య రోజురోజూకు పెరుగుతుంది. దీనిపై కేసీఆర్ ప్రభుత్వం నిమ్మకునీరెత్తినట్లు ప్రవర్తిస్తుందని ప్రతిపక్షం కాంగ్రెస్ ఆరోపిస్తుంది. అయితే రైతుల్లో భరోసా కల్పించేందుకు కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీని మెదక్ జిల్లాలో పర్యటించేలా చేయాలని టీపీసీసీ భావించింది. అందుకోసం టీపీసీసీ చేసిన ప్రయత్నాలు ఫలించాయి. వచ్చే నెలలో రాహుల్ మెదక్ జిల్లాలో పర్యటించనున్నారు. రాహుల్ పర్యటన తేదీలు కూడా ఖరారైయ్యాయి. దీనిపై కిషన్రెడ్డిపై విధంగా స్పందించారు.