'సీఎంకు భజనపరులుంటే చాలు’
హైదరాబాద్: ఎమ్మెల్యేల హక్కులు కాపాడాల్సిన బాధ్యత స్పీకర్ పైనే ఉందని బీజేపీ ఎల్పీ నేత కిషన్‌రెడ్డి అన్నారు. స్పీకర్ జోక్యం చేసుకుని బీజేపీ ఎమ్మెల్యేలపై ఉన్న సస్పెన్షన్‌ను తొలగించాలని కోరారు. ఉస్మానియా నుంచి తెలంగాణా ఉద్యమం మొదలైందని అటువంటి వర్సిటీ శతాబ్ధి ఉత్సవాలు న్యాయబద్ధంగా జరగటం లేదని ఆయన ఆరోపించారు. ఉస్మానియాలో కనీసం టాయిలెట్ అయినా కట్టించారా అని ప్రశ్నించారు. దేశం అంతా స్వచ్ఛ భారత్ అంటుంటే.. ఉన్నత చదువులు చదువుకునే ఉస్మానియా విద్యార్థులు చెంబు పట్టుకుని చెట్లలోకి వెళ్తున్నారన్నారు.
సభలో మా గొంతు నొక్కితే.. ఉస్మానియాలో విద్యార్థులు సీఎం గొంతు నొక్కారని వ్యాఖ్యానించారు. ఉస్మానియా విద్యార్థులు ఎవరికీ భయపడరని చెప్పారు. గత శాసనసభ సమావేశాల్లో, ఏకపక్షంగా, రాజ్యాంగ వ్యతిరేకంగా, 12 శాతం ముస్లిం రిజర్వేషన్లు కల్పించటాన్ని వ్యతిరేకించగా తమ గొంతు నొక్కి మాట్లాడకుండా చేశారని విమర్శించారు. సభ నుంచి తమ సభ్యులను సస్పెండ్ కూడా చేశారని తెలిపారు. భూ సేకరణ బిల్లు సవరణకు ఎందుకు అనుమతి ఇవ్వరని ప్రశ్నిస్తూ.. ఆదివారాలు సభ నడపటం ఎందుకో.. సీఎంకు ఏం సోకు అని ఎద్దేవా చేశారు. సాంకేతిక అంశాలు అడ్డం పెట్టుకుని తమను సభకు రాకుండా అడ్డుకుంటున్నారని ఆరోపించారు. శాసన సభకు, టీఆర్‌ఎస్ సభకు తేడా లేకుండా పోతోందని ఆగ్రహం వ్యక్తం చేశారు. బీజేపీ ఎమ్మెల్యేలు టీఆర్‌ఎస్ దయా దక్షిణ్యాలపై గెలవలేదని స్పష్టం చేశారు.