సాక్షి, హైదరాబాద్: మహానగరం ఒక్కసారిగా పల్లె జ్ఞాపకాల్లోకి వెళ్లబోతోంది. ఈ నెల 13, 14, 15 తేదీల్లో సికింద్రాబాద్ పరేడ్, జింఖానా మైదానాలు స్వీట్, కైట్ ఫెస్టివల్‌కు వేదిక కాబోతున్నాయి. గత మూడేళ్లుగా నిర్వహిస్తున్న సంక్రాంతి సంబరాలకు ఏటా ఓ కొత్త ఈవెంట్‌ను జోడించే క్రమంలో భాగంగా ఈసారి గ్రామీణ పని, ఆటపాటలను (విలేజ్ గేమ్స్ అండ్ కల్చర్) జోడిస్తున్నారు. పల్లెల్లోనూ కనిపించకుండా పోయిన విసుర్రాయి, తాడూ బొంగరం, చిర్రగోన, టైరు ఆట, గోలీలాటల సందడితో పదికి పైగా ప్రత్యేక స్టాళ్లు ఏర్పాటు చేయనున్నారు.
20 దేశాల పతంగ్‌లు..
ఇంటర్నేషనల్ కైట్ ఫెస్టివల్‌లో భాగంగా ఈసారి అమెరికా, సింగపూర్, ఇండోనేసియా, థాయ్‌లాండ్, శ్రీలంక తదితర 20 దేశాల పతంగ్‌లు ఎగరనున్నాయి. 13న ఉదయం, సాయంత్రం వేళల్లో 100 మంది పతంగ్ ఫ్లయర్స్ తో పాటు ముప్‌పైకి పైగా కైట్ క్లబ్‌లు ఈ పెస్టివల్‌లో పాల్గొంటాయి. ఇక స్వీట్ ఫెస్టివల్‌లో భాగంగా ఆంధ్రా పూతరేకులు, తమిళ పొంగళ్, గుజరాత్ బాసుంది, జార్ఖండ్ అనార్సా, మణిపూర్ ఖీర్, సిక్కిం సీల్‌రోటీ ఇలా దాదాపు 1,200 రకాల స్వీట్లన్నీ ఒకే చోట నోరూరించనున్నాయి. 13, 14, 15 తేదీల్లో మధ్యాçహ్నం 2 నుంచి రాత్రి వరకు ఈ స్టాళ్లు అందుబాటులో ఉంటాయి.
ఏటా కొత్త ఈవెంట్లు
నగరానికి పండుగ కళ తీసుకువచ్చే క్రమంలో 2016 నుంచి కైట్, 2017 నుంచి స్వీట్ ఫెస్టివల్‌ను నిర్వహిస్తున్నాం. ఈ యేడు కొత్తగా విలేజ్ గేమ్స్ అండ్ కల్చర్ ఈవెంట్లను కొత్తగా తీసుకువస్తున్నాం. వచ్చే ఏడాది మరో కొత్త అంశాన్ని యాడ్ చేస్తాం. ఈసారి జరిగే ఉత్సవాలకు 15 లక్షల మందికి పైగా జనాలు వస్తారని అంచనా వేసి ఆ మేరకు ఏర్పాట్లు చేస్తున్నాం. – బుర్రా వెంకటేశం, పర్యాటక శాఖ కార్యదర్శి
Comments
Please login to add a commentAdd a comment