జనం తండ్లాడుతున్నా కనికరించరా?
పాలకులపై జేఏసీ చైర్మన్ కోదండరాం ధ్వజం
కల్వకుర్తి రూరల్/ ఉప్పునుంతల: రాష్ట్రంలో తీవ్ర దుర్భిక్ష పరిస్థితులు నెలకొని తాగునీటికి, పశుగ్రాసానికి ఎన్నో ఇబ్బందులు పడుతున్నా పాలకుల్లో చలనం కలగడం లేదని టీజేఏసీ చైర్మన్ ఆచార్య కోదండరాం అన్నారు. గురువారం మహబూబ్‌నగర్ జిల్లా కల్వకుర్తిలో విలేకరులతో ఆయన మాట్లాడారు. తాగునీటి కోసం జనం తండ్లాడుతున్నా ప్రభుత్వం కనికరించడం లేదన్నారు. గ్రామాల్లో ఉదయం నుంచి రాత్రి వరకు మహిళలు, పిల్లలు, పడుతున్న కష్టాలను స్వయంగా చూశామన్నారు. ఒక బిందె నిండటానికి గంట సమయం తీసుకుంటుందంటే పరిస్థితి ఎంత భయంకరంగా ఉందో తెలుస్తుందన్నారు.
ప్రభుత్వం తాగునీటి అంశంపై సమగ్రంగా సర్వే చేయాలని కోరారు. గ్రామంలో నీరు దొరికే అవకాశాలను, గ్రామం బయట దొరికే అవకాశాలను పొరుగూరిలో నీటి లభ్యతపై పరిశీలించి ప్రణాళిక ప్రకారం ముందుకు సాగితే నీటి కష్టాలను తీర్చే మార్గం లభిస్తుందన్నారు. ప్రస్తుత పరిస్థితుల్లో పశువులకు మేత, దాణాను ఉచితంగా సరఫరా చేయాలని డిమాండ్ చేశారు. తెలంగాణ వికాసమంటే కేవలం హైదరాబాద్‌లోనే అభివృద్ధే కాదని, పల్లెలు ప్రగతి చెందినప్పుడే నిజమైన తెలంగాణ వికాసమని కోదండరాం అన్నారు. పల్లెటూరు ఆదాయం కేవలం వందలో రూ.13 మాత్రమే ఉందన్నారు. వచ్చిన ఆదాయంతో అవసరాలు తీరడం లేదని చెప్పారు.
పాలమూరు కరువు కొరల్లో చిక్కుకుందని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. ఇలాంటి సమయాల్లో ప్రభుత్వంపై ఆధారపడకుండా ఊరు అభివృద్ధి కోసం సమష్టిగా కృషి చేయాలని కోరారు. పాడి పరిశ్రమపై ఆధారపడి జీవిస్తున్నారని వారికి నాలుగు రూపాయల ప్రోత్సాహకం వెంటనే చెల్లించాలని డిమాండ్ చేశారు. పాలమూరు ప్రజల కష్టాలు పోవాలంటే పెండింగ్ ప్రాజెక్టులు, కల్వకుర్తి ఎత్తిపొతల పథకం పూర్తి చేయడమే పరిష్కార మార్గమని కోదండరాం అన్నారు. ప్రజలు ఎదుర్కొంటున్న అన్ని సమస్యలపై జిల్లా జేఏసీ నాయకులతో చర్చించి ఉద్యమ ప్రణాళికను రూపొందిస్తామని చెప్పారు.