‘కాంట్రాక్ట్’కు మించిన దోపిడీ లేదు
టీ జేఏసీ చైర్మన్ కోదండరాం
సాక్షి, హైదరాబాద్: ‘‘కాంట్రాక్టర్ల వ్యవస్థ అన్యాయమైనది. ఇది ఓ వ్యక్తిని పోషించే వ్యవస్థ. ఏ పనీ చేయని మధ్య దళారి.. కార్మికుల జీతాల్లో కొంత భాగాన్ని ఎగరేసుకుపోతున్నాడు. అతనెవరో కార్మికులకూ తెలియదు.. పని చేసే వారిని కాదని ఏ పనీ చేయని కాంట్రాక్టర్లకు జీతాలు ఇవ్వడం సరికాదు..ఇంతకు మించిన అన్యాయమైన దోపిడీ వ్యవస్థ మరొకటి ఉండదు.’’ అని తెలంగాణ జేఏసీ చైర్మన్ కోదండరాం రాష్ట్రంలో కాంట్రాక్ట్ కార్మిక వ్యవస్థపై ఆగ్రహం వ్యక్తం చేశారు. తెలంగాణ విద్యుత్ కాంట్రాక్ట్ వర్కర్స్ యూనియన్ ఆధ్వర్యంలో ఈ నెల 31 నుంచి ప్రారంభం కానున్న విద్యుత్ కాంట్రాక్ట్ కార్మికుల హక్కుల యాత్ర పోస్టర్‌ను సోమాజీగూడ ప్రెస్‌క్లబ్‌లో బుధవారం ఆవిష్కరించారు. విద్యుత్ జేఏసీ సమన్వయకర్త, జేఏసీ అధికార ప్రతినిధి కె.రఘు నేతృత్వంలో కాంట్రాక్టు కార్మిక వ్యవస్థపై సబ్ కమిటీని ఏర్పాటు చేస్తున్నామని కోదండరాం ప్రకటించారు.
ఔట్ సోర్సింగ్ కార్మికులను క్రమబద్ధీకరించమని ప్రభుత్వం చెప్పడంలో అర్థం లేదన్నారు. విద్యుత్ సంస్థల్లో కాంట్రాక్ట్ ఉద్యోగాల నియామకాల్లో అవినీతి జరుగుతోందనీ, భవిష్యత్తులో క్రమబద్ధీకరిస్తారన్న ఆశతో నిరుద్యోగులు రూ.5లక్షల వరకు ముడుపులు చెల్లించి ఉద్యోగాల్లో చేరుతున్నారని విద్యుత్ జేఏసీ సమన్వయకర్త కె.రఘు ఆరోపించారు. విద్యుత్ కార్మికుల హక్కుల సాధన కోసం 31వ తేదీ నుంచి 90 రోజుల పాటు రాష్ట్రంలోని 31 జిల్లాల్లో యాత్రను నిర్వహిస్తామని, అన్ని శాఖల్లోని కాంట్రాక్టు కార్మికులను ఏకం చేస్తామని యూనియన్ అధ్యక్షుడు జి.నాగరాజు తెలిపారు. ఈ కార్యక్రమంలో జేఏసీ నేతలు పిట్టల రవీందర్, పురుషోత్తం తదితరులు పాల్గొన్నారు.