రాజుకుంటున్న ఎమ్మెల్సీ అగ్గి | Komatireddy Raj Gopal Reddy Congress Party MLC in nalgonda district | Sakshi

రాజుకుంటున్న ఎమ్మెల్సీ అగ్గి

Published Wed, Jan 14 2015 4:38 AM | Last Updated on Mon, Mar 18 2019 7:55 PM

రాజుకుంటున్న ఎమ్మెల్సీ అగ్గి - Sakshi

రాజుకుంటున్న ఎమ్మెల్సీ అగ్గి

జిల్లానుంచి ఇద్దరు శాసనమండలి సభ్యులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమవుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి.

 సాక్షి ప్రతినిధి, నల్లగొండ : జిల్లానుంచి ఇద్దరు శాసనమండలి సభ్యులను ఎన్నుకోవాల్సిన సమయం ఆసన్నమవుతున్న కొద్దీ రాజకీయాలు వేడెక్కుతున్నాయి. చాపకింద నీరులా ఉన్న ఈ రాజకీయ ‘అగ్గి’.. అన్ని పార్టీల ఆశావహులకు చలికాలంలోనూ వేడి పుట్టిస్తోంది. ముఖ్యంగా తాజాగా కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి చేసిన వ్యాఖ్యలు జిల్లా కాంగ్రెస్ పార్టీలో చర్చనీయాంశమవుతున్నాయి. అధిష్టానం ఆదేశిస్తే తాను బరిలో ఉంటానని మాజీ ఎంపీ రాజగోపాల్‌రెడ్డి బహిరంగంగానే చెప్పడం ద్వారా ఎట్టి పరిస్థితుల్లో తాము ‘రింగ్’లో ఉంటామనే సంకేతాలు కోమటిరెడ్డి బ్రదర్స్ ఇచ్చారని రాజకీయ పరిశీలకులు భావిస్తున్నారు. అయితే, అదే పార్టీలో మరికొందరు స్థానిక సంస్థల ఎమ్మెల్సీ సీటు ఆశిస్తుండడంతో ఏం జరుగుతుందోననే ఆసక్తి అందరిలో నెలకొంది. మరోవైపు, టీఆర్‌ఎస్ పక్షాన ఈ ఎన్నికలలో మండలి డిప్యూటీ చైర్మన్ నేతి విద్యాసాగర్ బరిలో ఉంటారని పార్టీ వర్గాల్లో ప్రచారం జరుగుతోంది. ఈ ఎన్నికలను టీఆర్‌ఎస్ కూడా ప్రతిష్టాత్మకంగా తీసుకునే అవకాశం ఉండడంతో, కోమటిరెడ్డి కాంగ్రెస్ పక్షాన బరిలో ఉంటే జిల్లా రాజకీయం రాష్ట్రంలోనే హాట్‌టాపిక్‌గా మారనుందనే అభిప్రాయం రాజకీయ వర్గాల్లో వ్యక్తమవుతోంది.
 
 బలం... చెరిసగం
 వాస్తవానికి జిల్లాలో స్థానిక సంస్థలకు కాంగ్రెస్ పార్టీ పక్షాన గెలిచిన ప్రజాప్రతినిధులే ఎక్కువగా ఉన్నారు. జిల్లాలోని మున్సిపాలిటీల్లో ఉన్న మొత్తం 210 వార్డులకు గాను కాంగ్రెస్ 104 స్థానాల్లో గెలుపొందింది. టీడీపీ 42, బీజేపీ 19, టీఆర్‌ఎస్ 11, సీపీఎం7, సీపీఐ 4, ఎంఐఎం 3, వైఎస్సార్‌కాంగ్రెస్ పార్టీ 3, ఇతరులు 17 స్థానాల్లో గెలుపొందారు. ఇక, జిల్లాలోని 835 ఎంపీటీసీ స్థానాలకు గాను కాంగ్రెస్ 397, టీడీపీ 148, టీఆర్‌ఎస్ 114, సీపీఎం 54, సీపీఐ 19, బీజేపీ 16, వైఎస్సార్‌సీపీ 9, ఇతరులు 78 స్థానాల్లో గెలుపొందారు. మొత్తం 59 జెడ్పీటీసీలకు గాను 43 కాంగ్రెస్, టీఆర్‌ఎస్ 13, టీడీపీ 2, సీపీఐ1 స్థానంలో గెలుపొందాయి. ఇప్పుడు స్థానిక సంస్థలకు చెందిన ప్రజాప్రతినిధులు పెద్దఎత్తున టీఆర్‌ఎస్‌లోకి వెళ్లడంతో పార్టీల బలాబలాల్లో చాలా మార్పులు వచ్చాయి.
 
 అయినా 50శాతం కంటే ఎక్కువ మంది కాంగ్రెస్ పక్షానే ఉన్నారని లెక్కలు చెబుతున్నాయి. కాంగ్రెస్, టీఆర్‌ఎస్‌ల మధ్య ఉన్న వ్యత్యాసం వందలోపే ఉన్న నేపథ్యంలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఎన్నిక చాలా హాట్‌హాట్‌గా జరగనుంది. ఈలోపే విజయానికి తగినంతమందిని పార్టీలో చేర్చుకునే ఆలోచనలో టీఆర్‌ఎస్ ఉండగా, తమ పార్టీ నుంచి గెలిచి టీఆర్‌ఎస్‌లోకి వెళ్లిన వారిలో చాలా మంది తమకే ఓటేస్తారని, ఇతర పార్టీల మద్దతు కూడా అధికార పార్టీకి కాకుండా తమకే లభిస్తుందని కాంగ్రెస్ నేతలు లెక్కలు కడుతున్నారు. దీంతో కాంగ్రెస్ పార్టీలో ఈ స్థానానికి ఇప్పటి నుంచే పెద్ద ఎత్తున పోటీ కూడా మొదలైంది.
 
 ఆశావహులు అడుగుతున్నారు..
 కాంగ్రెస్ పార్టీలో స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం నుంచి పోటీ చేసేందుకు చాలా మంది ఉత్సాహం చూపుతున్నారు. అయినా, ముందు వరుసలో ఎంపీ కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి ఉన్నారని, ఆయన అభ్యర్థిత్వం ఖరారయితే పోటీ రసకందాయంగా ఉంటుందని పార్టీ వర్గాలంటున్నాయి. కోమటిరెడ్డితో పాటు పార్టీ జిల్లా మాజీ అధ్యక్షుడు తూడి దేవేందర్‌రెడ్డి, సుంకరి మల్లేశ్‌గౌడ్ కూడా అధిష్టానంపై ఒత్తిడి తెస్తున్నారు. పార్టీ అధ్యక్షుడిగా తాను చేసిన సేవలను గుర్తించి టికెట్ ఇవ్వాలని తూడి అడుగుతుండగా, గతంలో నేతి విద్యాసాగర్‌కు ఇచ్చిన టికెట్ తనకు రావాల్సిందని, ఇప్పుడయినా అవకాశం ఇవ్వాలని మల్లేశ్‌గౌడ్ అడుగుతున్నారు. బలహీన వర్గాలకు చెందిన వ్యక్తిగా తన అభ్యర్థిత్వాన్ని పరిగణనలోకి తీసుకోవాలని ఆయన అధిష్టానం ముందు తన వాదనలు వినిపిస్తున్నారు. జెడ్పీ మాజీ చైర్మన్ కసిరెడ్డి నారాయణరెడ్డితో పాటు మరికొందరు నాయకులు లైన్‌లో ఉన్నట్టు తెలుస్తోంది.
 
 గ్రాడ్యుయేట్స్ ఏమవుతుందో?
 స్థానిక సంస్థల ఎమ్మెల్సీ స్థానం కన్నా ముందు ఖాళీ అయ్యే నల్లగొండ, ఖమ్మం, వరంగల్ నియోజకవర్గాల గ్రాడ్యుయేట్స్ నియోజకవర్గానికి ఇంకా అభ్యర్థులను కూడా అన్ని పార్టీలు ఖరారు చేయలేదు. ఈ విషయంలో ముందున్న బీజేపీ తమ అభ్యర్థిగా ఎర్రబెల్లి రామ్మోహనరావును ఖరారు చేసి చాపకింద నీరులా ప్రచారం చేసుకుంటూ వెళుతోంది. ఇక, అధికార పార్టీ అయిన టీఆర్‌ఎస్ నుంచి పార్టీ జిల్లా అధ్యక్షుడు బండా నరేందర్‌రెడ్డికి టికెట్ వచ్చినట్టేనని, ఈ మేరకు కేసీఆర్ గ్రీన్‌సిగ్నల్ లభించిందని ప్రచారం జరుగుతున్నా అధికారికంగా మాత్రం ప్రకటించలేదు. ఇక, వామపక్ష పార్టీలు కూడా తమ అభ్యర్థి ఎవరనే దానిపై ప్రాథమిక కసరత్తులోనే ఉన్నాయి. వామపక్షాల తరఫున తెలంగాణ మొత్తానికి తెలిసిన ఒక ప్రముఖుడిని నిలపాలా లేక పార్టీకి సానుభూతిపరులుగా ఉన్న ప్రొఫెసర్లను బరిలో దించాలా అనేది తేల్చుకోలేదు. ఈ విషయంలో కాంగ్రెస్ మాత్రం తాము అభ్యర్థులను నిలిపే ఆలోచన లేదని, అన్ని పార్టీల అభ్యర్థిత్వాలు ఖరారయ్యాక ఏదో అభ్యర్థికి మద్దతిస్తామని అంటోంది. మొత్తం మీద శాసనమండలి రాజకీయం రానున్న రోజుల్లో జిల్లాలో మరింత వేడిని పుట్టించనుంది.
 

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Photos

View all
Advertisement