ఉప ఎన్నికల్లో ధర్మానిదే గెలుపు
ఉప ఎన్నికల్లో ధర్మానిదే గెలుపు
Published Fri, Mar 3 2017 11:08 AM | Last Updated on Wed, Aug 29 2018 4:18 PM
కనగల్ :
మండల కేంద్రంలోని సర్పంచ్ స్థానంతోపాటు రేగట్టె, పగిడిమర్రి ఎంపీటీసీ స్థానాలకు నిర్వహించే ఉప ఎన్నికల్లో ధర్మమే గెలుస్తుందని నల్లగొండ ఎమ్మెల్యే, సీఎల్పీ ఉపనేత కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి అన్నారు. గురువారం మండలకేంద్రంలో ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో ఆయన మాట్లాడారు. గతంలో కాంగ్రెస్ పార్టీ గుర్తుపై గెలిచిన రేగట్టె, పగిడిమర్రి ఎంపీటీసీలు టీఆర్‌ఎస్ పార్టీకి అమ్ముడు పోయిన తరుణంలో హైకోర్టును ఆశ్రయించగా ధర్మాసనం వారిని అనర్హులుగా ప్రకటించిన విషయాన్ని గుర్తుచేశారు. స్వలాభం కోసం ఓట్లేసి గెలిపించిన ప్రజలను మోసం చేస్తూ నీతిమాలిన రాజకీయాలకు పాల్పడే వారిని ఉప ఎన్నికల్లో ఓడించి బుద్ధి చెప్పాలని ఓటర్లను కోరారు.
నియోజకవర్గ అభివృద్ధిలో భాగంగా నాలుగు పర్యాయాల తన ఎమ్మెల్యే పదవీ కాలంలో మండలాన్ని అన్ని రంగాల్లో అభివృద్ధి చేసినట్లు తెలిపారు. పల్లెల్లో మౌలిక వసతుల కల్పనకు కృషి చేస్తున్నట్లు వివరించారు. అధికార టీఆర్‌ఎస్ పార్టీ ప్రజలను మభ్యపెడుతూ రంగుల ప్రపంచంలో విహరింపజేస్తుందే తప్ప పేదలకు ఒరిగిందేమీలేదన్నారు. ఉప ఎన్నికల్లో ఓటర్లు విజ్ఞత ప్రదర్శించి సేవ చేసే వారిని గెలిపించాలని పిలుపునిచ్చారు. రైతులకు లోఓల్టేజీ సమస్య లేకుండా మండలంలో ఏడు సబ్ స్టేషన్ల నిర్మాణంతోపాటు ఒక మదర్ సబ్ స్టేషన్‌ను నిర్మించినట్లు తెలిపారు.
అనంతరం రేగట్టె, పగిడిమర్రి ఎంపీటీసీ స్థానాలకు కాంగ్రేస్ పార్టీ నుంచి పోటీ చేస్తున్న భారత వెంకటేశం, కదిరె యాదమ్మలకు పార్టీ బీ ఫామ్‌లు అందజేశారు. ఈ కార్యక్రమంలో కనగల్ జెడ్పీటీసీ నర్సింగ్ శ్రీనివాస్‌గౌడ్, కాంగ్రెస్ మండల అధ్యక్షుడు గడ్డం అనూప్‌రెడ్డి, సర్పంచ్ జగాల్‌రెడ్డి, నాయకులు రవీందర్‌రెడ్డి, వెంకటేశం, వెంకట్‌రెడ్డి, నర్సిరెడ్డి, సత్తయ్య, శ్రీశైలం, రామచంద్రు, సైదులు తదితరులు పాల్గొన్నారు.
Advertisement