న్యూఢిల్లీ : శాతవాహన, పద్మావతి, గోదావరి, మచిలీపట్నం రైళ్లను భువనగిరి, జనగామ, ఆలేరు రైల్వేస్టేషన్లలో ఆపాలని రైల్వే మంత్రికి విజ్ఞప్తి చేసినట్లు భువనగరి ఎంపీ కోమటిరెడ్డి వెంకట్‌రెడ్డి తెలిపారు. బుధవారం ఆయన కేంద్ర మంత్రి పీయూష్ గోయల్‌తో భేటీ అయ్యారు. ఈ సందర్భంగా రైల్వే సమస్యలపై ఆయనకు వినతి పత్రం అందించారు. అనంతరం వెంకట్‌రెడ్డి మాట్లాడుతూ...‘ ప్రతిరోజు దాదాపు ముప్పై వేలకు మందికి పైగా ప్రభుత్వ, ప్రైవేటు సంస్థలలో పనిచేసే ఉద్యోగులు, విద్యార్థులు, వ్యాపారస్తులకు, రోజూవారీ కూలీలు అనునిత్యం భువనగిరి, జనగామ, ఆలేరు నుంచి హైదరాబాద్‌కు ప్రయాణిస్తుంటారు. అదే విధంగా రాష్ట్ర నలుమూల నుంచి శ్రీలక్ష్మీ నరసింహస్వామి దర్శనార్థం యాదగిరిగుట్టకు రోజూ యాభై వేల మంది పైచిలుకు భక్తులు వస్తూంటారు. ఈ క్రమంలో సరైన రైల్వే సౌకర్యాలు అనేక అనేక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు’ అని మంత్రికి వివరించినట్లు పేర్కొన్నారు.
కాగా తన విఙ్ఞాపనపై కేంద్ర మంత్రి సానుకూలంగా స్పందించినట్లు కోమటిరెడ్డి తెలిపారు. సంబంధిత అధికారులతో మాట్లాడి సర్వేలు చేయించి.. సమస్యలకు పరిష్కరిస్తామని కేంద్ర మంత్రి హామీ ఇచ్చినట్లు వెల్లడించారు. ఈ సందర్భంగా కోమటిరెడ్డి ఆయనకు కృతఙ్ఞతలు తెలియజేశారు.
Comments
Please login to add a commentAdd a comment