'తెలంగాణ ఎందుకు వచ్చిందా అనిపిస్తోంది'
నల్గొండ: తెలంగాణ సీఎం కేసీఆర్పై కాంగ్రెస్ ఎమ్మెల్యే కోమటిరెడ్డి వెంకట్రెడ్డి శుక్రవారం నల్గొండలో నిప్పులు చెరిగారు. కేసీఆర్ పాలన చూస్తుంటే తెలంగాణ ఎందుకు వచ్చిందా అనిపిస్తోందని అన్నారు. ఎన్నికల హామీలు పేపర్లకే పరిమితమవుతున్నాయని ఆరోపించారు. అవి వాస్తవ రూపం దాల్చడం లేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇప్పటివరకు కేసీఆర్ ప్రభుత్వం ప్రజలకు ఒరగబెట్టిందేమీ లేదని విమర్శించారు. టీఆర్ఎస్ ప్రభుత్వంపై తిరగబడే రోజు దగ్గర్లోనే ఉందని అన్నారు.
నిరుద్యోగులకు ఉపాధి కల్పించే విధంగా చర్యలు చేపట్టాలని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. గ్రేటర్ ఎన్నికలు దృష్టిలో పెట్టుకుని కేసీఆర్ హైదరాబాద్లో హడావిడి చేస్తున్నారన్నారు. సచివాలయాన్ని మార్చడం సరికాదు... ప్రస్తుతం ఉన్న ప్రదేశంలోనే సచివాలయం ఉండగా తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం సిద్ధించిందని కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గుర్తు చేశారు.