వరంగల్ జిల్లా చేర్యాల మండలం కొమురవెల్లిలో మల్లన్న కళ్యాణంలో ముత్యాల తలంబ్రాలు పోస్తున్న కేసీఆర్
* రూ. 5 కోట్లతో హైదరాబాద్‌లో నిర్మిస్తాం: కేసీఆర్
* తెలంగాణ సాయుధ పోరాటంలో కొమురయ్యది గొప్ప పాత్ర
* కురుమలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం
* కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భూములిప్పిస్తాం
* ఆ స్థలంలో విల్లాలు, కాటేజీలు నిర్మించవచ్చు
* మల్లన్న కల్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు
* ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం
సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరిట హైదరాబాద్‌లో కురుమ సంఘం భవనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఎకరం లేదా ఎకరన్నర స్థలంలో రూ.5 కోట్లతో ఈ భవనం నిర్మిస్తామని తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి కల్యాణం సందర్భంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మల్లన్న కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన కురుమ సంఘం వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం కురుమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి రావడం సంతోషంగా ఉందన్నారు.
‘‘తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య గొప్ప పాత్ర పోషించారు. ఆయన పేరు మీద భవనం లేకపోడమే వెలితి. ఉంటేనే మనకు గొప్ప. దొడ్డి కొమురయ్య పేరిట హైదరాబాద్‌లో మంచి భవనం కట్టుకుందాం. ఎకరం లేదా ఎకరంన్నర స్థలంలో రూ.5 కోట్లతో నిర్మిద్దాం. కురుమ సంఘం ముఖ్యులు రేపే (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయానికి రండి. నిధులు, భూమికి సంబంధించి రేపే ఉత్తర్వులు ఇస్తాను. దొడ్డి కొమురయ్య భవనం శంకుస్థాపన చేస్తా. ఒగ్గు కళాకారుల డోలు చప్పుళ్లతో ఆరోజు హైదరాబాద్ దద్దరిల్లేలా కార్యక్రమం చేసుకుందాం. కురుమలకు రాజకీయ ప్రాధాన్యం విషయం అడిగారు. మా దేవరమల్లప్ప గద భుజం మీద పెట్టుకుని తయారు మీద ఉన్నరు. యెగ్గె మల్లేశం కూడా ఉన్నరు. వీరిద్దరికీ రాజకీయ అవకాశాలు రావాలి. వచ్చేలా చేస్తా. కొమురవెల్లి మల్లన్నకు ప్రస్తుతం భూములు లేవు. దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్‌తో చర్చించి కొంత భూమిని మల్లికార్జునస్వామి ఆలయ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆ స్థలంలో కాటేజీలు, విల్లాలు నిర్మించవచ్చు’’ అని సీఎం అన్నారు.
కురుమలది గొప్ప మేధాశక్తి..
కురుమ కులస్తులకు గొప్ప మేధాశక్తి ఉంటుందని కేసీఆర్ కొనియాడారు. పిల్లలను బాగా చదివించి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. ‘‘గొర్రెల మందలో వంద ఉంటే ప్రతి జీవిని గుర్తు పెట్టుకుంటారు. గతంలో ఉన్న భూములు ఇప్పుడు లేవు. ఆధునిక పద్ధతుల్లో గొర్రెల పెంపకం ఫారంలలో నిర్వహించాలి. అటవీ భూములు ఉన్నాయి. మేకలు, గొర్రెల ఫారమ్స్ వస్తే బాగుంటుంది. చదువుకుంటే అన్నీ చేయవచ్చు. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిన్న ఉండెపల్లె గ్రామం ఉండేది. బ్యాంకు మేనేజరు కురుమలకు అప్పు ఇవ్వడం లేదని ఆ ఊరి వాళ్లు వచ్చి చెప్పారు. మేనేజరును అడిగిన. వాళ్లు అప్పు కడతరా సార్.. అని మేనేజరు అన్నడు. నేను ఒక్కటే చెప్పిన. ‘ఎవలన్న ఎగబెడతరు గని వీళ్లు ఎగబెట్టరు. వీళ్లు పంచాయితీకి పోరు, కల్లు దుకాణంకాడికి పోరు. అసలు ఎక్కువగా ఊల్లెనే ఉండరు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటరూ. పొదుపుగా జీవిస్తరు. నేను గ్యారెంటీ’ అని చెప్పిన. రూ.5 లక్షలు అప్పు ఇచ్చిండు.
గడువులోపే కట్టిన్రు. అదే మేనేజరు వచ్చి ‘ఇంకా ఏ ఊర్లో అయినా ఉన్నారా.. సార్’ అని అడిగిండు. కురుమొల్ల దగ్గర గొప్పదనం ఉంది. మందలో నూరు గొర్లు ఉంటే.. ఫలానాది అని అంటే దాన్నే తీసుకువస్తరు. ఈ మేధాశక్తి వాళ్లకే ఉంటది. కురుమల డిమాండ్లపై సానుకూలంగా ఉంటా. అందరం కూర్చుని చర్చించుకుందాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు.
కేసీఆర్‌కు కృతజ్ఞతలు: దత్తాత్రేయ
కొమురవెల్లి కల్యాణానికి అధికారిక హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కురుమల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్ ఒక్కరే సీఎం హోదాలో ఇక్కడికి వచ్చారని చెప్పారు. చదువుతోనే ఎదుగుదల ఉంటుందని, తాను కేంద్రమంత్రి అయ్యేందుకు చదువే ఉపయోగపడిందని చెప్పారు. ఒగ్గు కళాకారులకు ప్రభుత్వం తరఫున చేయూత ఇవ్వాలని కోరారు. గొర్రెలు, గొర్రెల నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అందుకు కేంద్రమంత్రిగా తన సహకారం అందిస్తానని చెప్పారు.
కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎ.చందూలాల్, జెడ్పీ చైర్‌పర్సన్ జి.పద్మ, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, ఎ.సీతారాంనాయక్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎం.యాదగిరిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎ.రమేశ్, కె.సురేఖ, డి.ఎస్.రెడ్యానాయక్, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.