kurumas
-
కురుమలు నమ్మకానికి మారుపేరు: సీఎం రేవంత్
సాక్షి, హైదరాబాద్: కురుమలు తెలంగాణ పునర్నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు. కోకాపేట్లో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నమ్మకానికి మారుపేరు, మృదుస్వభావులు కురుమ సోదరులు.. అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య.. సాయుధ రైతాంగ పోరాటాన్ని ముందుండి నడిపిన గొప్ప పోరాట యోధుడు అని రేవంత్ కొనియాడారు.‘‘ఆయన పేరుతో దొడ్డి కొమురయ్య భవన్‌ను ప్రారంభించుకోవడం సంతోషం. కురుమ సోదరులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వ హాస్టల్స్‌లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు గత ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్.. ఇలా అన్ని సంక్షేమ పథకాల్లో బలహీనవర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.ఐలయ్య చెప్పినట్లు జమీందార్ల తెలంగాణ తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ తల్లి మన తల్లుల ప్రతిరూపం. బిడ్డలు అభివృద్ధి పథం వైపు నడవాలనే ఆశీర్వదించే తల్లిని మనం ప్రతిష్టించుకున్నాం. కుల గణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం. కుల గణన 98 శాతం పూర్తయింది. ఇంకా కేవలం 2 శాతం మాత్రమే మిగిలి ఉంది. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన పూర్తయితే కురుమలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన వాటా దక్కుతుంది’’ అని రేవంత్ చెప్పారు.గత ఎన్నిల్లో కాంగ్రెస్ కురుమ సోదరులకు రెండు, యాదవ సోదరులకు రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. మీరు కలిసికట్టుగా గెలిపించుకున్నప్పుడే రాజకీయ పార్టీలు మళ్లీ టికెట్లు ఇస్తాయి. ముఖ్యమంత్రిగా విప్‌లే నా కళ్లు, చెవులు. ప్రజా ప్రభుత్వంలో నాలుగు సామాజిక వర్గాలకు విప్‌లుగా అవకాశం కల్పించాం.. బీర్ల ఐలయ్య విప్ గా ఉన్నాడు కాబట్టే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. వచ్చిన అవకాశం వదులుకోవద్దు.. మీ బిడ్డలను మీరు గెలిపించుకుంటేనే మీకు ప్రాధాన్యత ఉంటుంది. వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మీ సామాజిక వర్గాలను గెలిపించుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో మీకు మనుగడ ఉంటుంది.’’ అని రేవంత్ పేర్కొన్నారు. -
విద్యతోనే గొల్ల, కురుమల అభివృద్ధి
కేయూ క్యాంపస్/చేర్యాల(సిద్దిపేట): గొల్ల, కురుమల్లో అనేకమంది ఇంకా ఆర్థికంగా వెనుకబాటులోనే ఉన్నారని, కుల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నవారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యతోనే వారి అభివృద్ధి జరుగుతుందని, గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో, సిద్దిపేట జిల్లా చేర్యాలలో దత్తాత్రేయ గౌరవార్థం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు. హన్మకొండలో గోకుల్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళలు, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలహీనవర్గాల కోసం ముద్ర రుణాలను ఇస్తోందని, గొల్ల, కురుమలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. ఒగ్గు కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. శంషాబాద్‌లో ప్రియాంకారెడ్డి, వరంగల్‌లో మానసపై జరిగిన ఘటనలు దురదృష్టకరమని దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రియాంక హత్య ఉదంతం తనను కలచి వేసిందని చేర్యాల సభలో అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా చట్టాలు చేసేలా కృషి చేస్తానన్నారు. కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించేవారికోసం హైదరాబాద్‌లో త్వరలోనే ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు. -
యాదవులు అభివృద్ధి చెందాలి : సీఎం
సాక్షి, హైదరాబాద్ : యాదవ, కురుమలు సామాజికంగా, రాజకీయంగా, ఆర్థికంగా అభివృద్ధి సాధించాలని ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్‌రావు స్పష్టం చేశారు. టీఆర్ఎస్ రాజ్యసభ అభ్యర్థిగా బడుగుల లింగయ్య యాదవ్‌కు అవకాశం ఇచ్చిన సందర్భంగా యాదవ, కురుమ సంఘం నాయకులు, కార్యకర్తలు భారీ సంఖ్యలో బుధవారం కేసీఆర్‌ను ప్రగతిభవన్‌లో కలసి కృతజ్ఞతలు తెలిపారు. ఇచ్చిన మాట ప్రకారం యాదవులకు రాజ్యసభ అవకాశం ఇచ్చామని, త్వరలోనే కురుమలకు ఎమ్మెల్సీ సీటు ఇస్తామని సీఎం అన్నారు. రాష్ట్రవ్యాప్తంగా మరో 20 మంది గొల్ల, కురుమ నేతలను రాష్ట్ర స్థాయి కార్పొరేషన్లలో డైరెక్టర్లుగా నియమిస్తామని చెప్పారు. ఈ సందర్భంగా లింగయ్య యాదవ్‌ను సీఎం అభినందించారు. మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్, ఎమ్మెల్యే అంజయ్యయాదవ్, కార్పొరేషన్ చైర్మన్ కన్నెబోయిన రాజయ్య యాదవ్ తదితరులు పాల్గొన్నారు. -
గొర్రెల పంపిణీ ఘనత కేసీఆర్‌దే
సదాశివపేట(సంగారెడ్డి): కురుమలు ఆర్థికంగా ఎదిగేందుకు వారికి సబ్సిడీపై గొర్రెలు పంపిణీ చేసిన ఘనత ముఖ్యమంత్రి కేసీఆర్‌కే దక్కుతుందని కురుమ సంఘం రాష్ట్ర అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అన్నారు. పట్టణంలోని శుక్రవారం నిర్వహించిన మల్లికార్జున స్వామి కురుమ సంఘం ద్వితీయ వార్షికోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ.. గత పాలకులు కురుమజాతిని, కురుమల సమస్యలు పట్టించుకున్న పాపాన పోలేదన్నారు. ప్రస్తుతం టీఆర్ఎస్ ప్రభుత్వం కురుమల జీవన స్థితిగతులను గమనించి గొర్రెలను సబ్బడీపై పంపిణీ చేయడం అభినందనీయమన్నారు. కురుమలకు గొర్రెల పంపిణీతో పాటు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తానని ప్రకటించడం హర్షించద్గ విషయమన్నారు. ఎమ్మెల్యే చింతా ప్రభాకర్ మాట్లాడుతూ.. సీఎం కేసీఆర్ అన్ని కులాలకు సముచిత స్థానం కల్పించేందుకు వినూత్న పథకాలు ప్రవేశపెట్టి అమలు చేస్తున్నారని గుర్తుచేశారు. ప్రభుత్వం అందజేసిన సబ్బిడీ గొర్రెలను అమ్మకుండా పోషించుకుని ఆర్థికంగా ఎదగాలని సూచించారు. కార్యక్రమంలో కురుమసంఘం జిల్లా అధ్యక్షుడు బూరుగడ్డ పుష్పనాగేశ్, జిల్లా నాయకుడు డాక్లర్ శ్రీహరి, మహిళ కన్వీనర్ గీత, సదాశివపేట మం డల కురుమ సంఘం అధ్యక్షుడు కొత్తగొల్ల కృష్ణ, గడ్డమీది సత్యనారాయణ, మునిపల్లి మండల అధ్యక్షుడు శంకరయ్య, ప్రధాన కార్యదర్శి బండారి పాండు, ఆత్మకమిటీ చైర్మన్ సత్యనారాయణ, మల్లికార్జున కురుమ సం ఘం అధ్యక్షుడు పైతర సాయికుమార్, నాయకు లు అ నంతయ్య, రాంచందర్, చంద్రన్న, బక్కన్న, గో పాల్, శివశంకర్, రాములు, మల్లేశం, కిష్టయ్య, హనుమయ్య, జగన్నాథం, శివశంకర్, నర్సింలు పాల్గొన్నారు. -
ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి : కేసీఆర్
సాక్షి, హైదరాబాద్ : చాలా రంగాల్లో తెలంగాణ రాష్ట్రం నంబర్ వన్‌గా ఉందని ముఖ్యమంత్రి కే.చంద్రశేఖరరావు అన్నారు. రాష్ట్రంలో అన్ని వర్గాల ప్రజలు చిరునవ్వుతో ఉండాలన్నదే తమ ప్రభుత్వ లక్ష్యమన్నారు. కోకాపేటలో గొల్ల, కురుమ సంక్షేమ భవనాలు, హాస్టల్ భవనానికి సీఎం కేసీఆర్ శుక్రవారం శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన బహిరంగ సభలో ఆయన మాట్లాడుతూ..గొల్ల, కురుమ జాతి అత్యధికంగా ఉన్న తెలంగాణ భారతదేశానికి దిక్సూచి కావాలన్నారు. రాష్ట్రంలో మొత్తం 35 లక్షల గొర్రెలు పంపిణీ చేశామని, వీటితో వేల కోట్ల సంపదను యాదవలు సృష్టించబోతున్నారన్నారు. పశువుల కోసం మొబైల్ వ్యాన్లు ఏర్పాటు చేశామన్నారు. ఇక నుంచి తెలంగాణ నుంచే గొర్రెలు ఎగుమతి అయ్యే పరిస్థితి రావాలని కేసీఆర్ ఆకాంక్షించారు. బీసీలకు అన్ని రంగాల్లో అవకాశాలు కల్పిస్తామని, తెలంగాణ కురుమ సంఘం అధ్యక్షుడు ఎగ్గే మల్లేశంకు ఎమ్మెల్సీ పదవి ఇస్తామని ఆయన తెలిపారు. అలాగే జనవరి 1వ తేదీ నుంచి వ్యవసాయానికి 24 గంటల విద్యుత్ ఇస్తామని సీఎం తెలిపారు. అదే పక్క రాష్ట్రం అయిన ఆంధ్రప్రదేశ్‌లో వ్యవసాయానికి కేవలం 7 గంటలే విద్యుత్ ఇస్తున్నట్లు తెలిపారు. అలాగే తనకు జాతీయ రాజకీయాలపై ఆసక్తి లేదని కేసీఆర్ ఈ సందర్భంగా పేర్కొన్నారు. -
బీసీలకు అన్నిరంగాల్లో అవకాశాలు: కేసీఆర్
-
కురుమలకు దొడ్డి కొమురయ్య భవన్
* రూ. 5 కోట్లతో హైదరాబాద్‌లో నిర్మిస్తాం: కేసీఆర్ * తెలంగాణ సాయుధ పోరాటంలో కొమురయ్యది గొప్ప పాత్ర * కురుమలకు రాజకీయ ప్రాధాన్యం కల్పిస్తాం * కొమురవెల్లి మల్లన్న ఆలయానికి భూములిప్పిస్తాం * ఆ స్థలంలో విల్లాలు, కాటేజీలు నిర్మించవచ్చు * మల్లన్న కల్యాణానికి తెలంగాణ ముఖ్యమంత్రి హాజరు * ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, తలంబ్రాలు సమర్పించిన సీఎం సాక్షి ప్రతినిధి, వరంగల్: తెలంగాణ సాయుధ పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య పేరిట హైదరాబాద్‌లో కురుమ సంఘం భవనం నిర్మించనున్నట్లు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖరరావు ప్రకటించారు. ఎకరం లేదా ఎకరన్నర స్థలంలో రూ.5 కోట్లతో ఈ భవనం నిర్మిస్తామని తెలిపారు. ఆదివారం వరంగల్ జిల్లా కొమురవెల్లి శ్రీ మల్లికార్జునస్వామి కల్యాణం సందర్భంగా... ముఖ్యమంత్రి కేసీఆర్ రాష్ట్ర ప్రభుత్వం తరఫున పట్టువస్త్రాలు, ముత్యాల తలంబ్రాలు సమర్పించారు. మల్లన్న కల్యాణంలో పాల్గొన్నారు. అనంతరం కొమురవెల్లిలో కొత్తగా నిర్మించిన కురుమ సంఘం వసతి గృహాన్ని ప్రారంభించారు. అనంతరం కురుమ సంఘం భవనంలో ఏర్పాటు చేసిన సభలో ప్రసంగించారు. కొమురవెల్లి మల్లన్న కల్యాణానికి రావడం సంతోషంగా ఉందన్నారు. ‘‘తెలంగాణ సాయుధ పోరాటంలో దొడ్డి కొమురయ్య గొప్ప పాత్ర పోషించారు. ఆయన పేరు మీద భవనం లేకపోడమే వెలితి. ఉంటేనే మనకు గొప్ప. దొడ్డి కొమురయ్య పేరిట హైదరాబాద్‌లో మంచి భవనం కట్టుకుందాం. ఎకరం లేదా ఎకరంన్నర స్థలంలో రూ.5 కోట్లతో నిర్మిద్దాం. కురుమ సంఘం ముఖ్యులు రేపే (సోమవారం) ఉదయం 11 గంటలకు సచివాలయానికి రండి. నిధులు, భూమికి సంబంధించి రేపే ఉత్తర్వులు ఇస్తాను. దొడ్డి కొమురయ్య భవనం శంకుస్థాపన చేస్తా. ఒగ్గు కళాకారుల డోలు చప్పుళ్లతో ఆరోజు హైదరాబాద్ దద్దరిల్లేలా కార్యక్రమం చేసుకుందాం. కురుమలకు రాజకీయ ప్రాధాన్యం విషయం అడిగారు. మా దేవరమల్లప్ప గద భుజం మీద పెట్టుకుని తయారు మీద ఉన్నరు. యెగ్గె మల్లేశం కూడా ఉన్నరు. వీరిద్దరికీ రాజకీయ అవకాశాలు రావాలి. వచ్చేలా చేస్తా. కొమురవెల్లి మల్లన్నకు ప్రస్తుతం భూములు లేవు. దేవాదాయ శాఖ, జిల్లా కలెక్టర్‌తో చర్చించి కొంత భూమిని మల్లికార్జునస్వామి ఆలయ పరిధిలోకి తెచ్చేందుకు ప్రయత్నిస్తా. ఆ స్థలంలో కాటేజీలు, విల్లాలు నిర్మించవచ్చు’’ అని సీఎం అన్నారు. కురుమలది గొప్ప మేధాశక్తి.. కురుమ కులస్తులకు గొప్ప మేధాశక్తి ఉంటుందని కేసీఆర్ కొనియాడారు. పిల్లలను బాగా చదివించి గొప్పవాళ్లుగా తీర్చిదిద్దాలని సూచించారు. ‘‘గొర్రెల మందలో వంద ఉంటే ప్రతి జీవిని గుర్తు పెట్టుకుంటారు. గతంలో ఉన్న భూములు ఇప్పుడు లేవు. ఆధునిక పద్ధతుల్లో గొర్రెల పెంపకం ఫారంలలో నిర్వహించాలి. అటవీ భూములు ఉన్నాయి. మేకలు, గొర్రెల ఫారమ్స్ వస్తే బాగుంటుంది. చదువుకుంటే అన్నీ చేయవచ్చు. సిద్దిపేటలో ఎమ్మెల్యేగా ఉన్న సమయంలో చిన్న ఉండెపల్లె గ్రామం ఉండేది. బ్యాంకు మేనేజరు కురుమలకు అప్పు ఇవ్వడం లేదని ఆ ఊరి వాళ్లు వచ్చి చెప్పారు. మేనేజరును అడిగిన. వాళ్లు అప్పు కడతరా సార్.. అని మేనేజరు అన్నడు. నేను ఒక్కటే చెప్పిన. ‘ఎవలన్న ఎగబెడతరు గని వీళ్లు ఎగబెట్టరు. వీళ్లు పంచాయితీకి పోరు, కల్లు దుకాణంకాడికి పోరు. అసలు ఎక్కువగా ఊల్లెనే ఉండరు. వాళ్ల పని వాళ్లు చేసుకుంటరూ. పొదుపుగా జీవిస్తరు. నేను గ్యారెంటీ’ అని చెప్పిన. రూ.5 లక్షలు అప్పు ఇచ్చిండు. గడువులోపే కట్టిన్రు. అదే మేనేజరు వచ్చి ‘ఇంకా ఏ ఊర్లో అయినా ఉన్నారా.. సార్’ అని అడిగిండు. కురుమొల్ల దగ్గర గొప్పదనం ఉంది. మందలో నూరు గొర్లు ఉంటే.. ఫలానాది అని అంటే దాన్నే తీసుకువస్తరు. ఈ మేధాశక్తి వాళ్లకే ఉంటది. కురుమల డిమాండ్లపై సానుకూలంగా ఉంటా. అందరం కూర్చుని చర్చించుకుందాం’’ అని ముఖ్యమంత్రి పేర్కొన్నారు. కేసీఆర్‌కు కృతజ్ఞతలు: దత్తాత్రేయ కొమురవెల్లి కల్యాణానికి అధికారిక హోదాలో పట్టు వస్త్రాలు సమర్పించిన ముఖ్యమంత్రి కేసీఆర్‌కు కురుమల తరఫున ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలుపుతున్నట్లు ఈ కార్యక్రమంలో పాల్గొన్న కేంద్రమంత్రి బండారు దత్తాత్రేయ అన్నారు. కేసీఆర్ ఒక్కరే సీఎం హోదాలో ఇక్కడికి వచ్చారని చెప్పారు. చదువుతోనే ఎదుగుదల ఉంటుందని, తాను కేంద్రమంత్రి అయ్యేందుకు చదువే ఉపయోగపడిందని చెప్పారు. ఒగ్గు కళాకారులకు ప్రభుత్వం తరఫున చేయూత ఇవ్వాలని కోరారు. గొర్రెలు, గొర్రెల నుంచి వచ్చే ఉత్పత్తుల కోసం పరిశ్రమ ఏర్పాటు చేయాలని, అందుకు కేంద్రమంత్రిగా తన సహకారం అందిస్తానని చెప్పారు. కురుమ సంఘం అధ్యక్షుడు యెగ్గె మల్లేశం అధ్యక్షతన జరిగిన ఈ కార్యక్రమంలో ఉప ముఖ్యమంత్రి టి.రాజయ్య, మంత్రులు ఎ.ఇంద్రకరణ్‌రెడ్డి, ఎ.చందూలాల్, జెడ్పీ చైర్పర్సన్ జి.పద్మ, ఎంపీలు బి.నర్సయ్యగౌడ్, ఎ.సీతారాంనాయక్, కడియం శ్రీహరి, ఎమ్మెల్యేలు ఎం.యాదగిరిరెడ్డి, ఆర్.కృష్ణయ్య, ఎ.రమేశ్, కె.సురేఖ, డి.ఎస్.రెడ్యానాయక్, బి.శంకర్‌నాయక్, ఎమ్మెల్సీలు బి.వెంకటేశ్వర్లు, రాజలింగం తదితరులు పాల్గొన్నారు.