దత్తాత్రేయకు గొర్రెపిల్లను బహుకరిస్తున్న గొల్లకురుమ సంఘం ప్రతినిదులు
కేయూ క్యాంపస్/చేర్యాల(సిద్దిపేట): గొల్ల, కురుమల్లో అనేకమంది ఇంకా ఆర్థికంగా వెనుకబాటులోనే ఉన్నారని, కుల వృత్తినే నమ్ముకొని జీవిస్తున్నవారి అభివృద్ధికి కృషి చేయాల్సిన అవసరం ఉందని హిమాచల్‌ప్రదేశ్ గవర్నర్ బండారు దత్తాత్రేయ అన్నారు. విద్యతోనే వారి అభివృద్ధి జరుగుతుందని, గొల్ల, కురుమలను ఎస్టీ జాబితాలో చేర్చేలా కేంద్ర ప్రభుత్వం దృష్టికి తీసుకువెళతానని పేర్కొన్నారు. ఆదివారం వరంగల్ అర్బన్ జిల్లా హన్మకొండలో, సిద్దిపేట జిల్లా చేర్యాలలో దత్తాత్రేయ గౌరవార్థం ఆత్మీయ సమ్మేళనాలు నిర్వహించారు.
హన్మకొండలో గోకుల్ ఇంటలెక్చువల్ ఫోరం ఆధ్వర్యంలో నిర్వహించిన కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ కళలు, సంస్కృతి సంప్రదాయాలను పరిరక్షించుకోవాల్సిన అవసరం ఉందని అన్నారు. కేంద్ర ప్రభుత్వం బలహీనవర్గాల కోసం ముద్ర రుణాలను ఇస్తోందని, గొల్ల, కురుమలు దీనిని వినియోగించుకోవాలని సూచించారు. ఒగ్గు కళలు అంతరించిపోకుండా ప్రోత్సహించాలని పేర్కొన్నారు. శంషాబాద్‌లో ప్రియాంకారెడ్డి, వరంగల్‌లో మానసపై జరిగిన ఘటనలు దురదృష్టకరమని దత్తాత్రేయ పేర్కొన్నారు. ప్రియాంక హత్య ఉదంతం తనను కలచి వేసిందని చేర్యాల సభలో అన్నారు. ఇలాంటి ఘటనలు పునరావృ తం కాకుండా చట్టాలు చేసేలా కృషి చేస్తానన్నారు. కాగా, హిమాచల్‌ప్రదేశ్‌లో పర్యటించేవారికోసం హైదరాబాద్‌లో త్వరలోనే ఓ కార్యాలయాన్ని ఏర్పాటు చేయబోతున్నట్లు వెల్లడించారు.
Comments
Please login to add a commentAdd a comment