కురుమలు నమ్మకానికి మారుపేరు: సీఎం రేవంత్‌ | Cm Revanth Speech At The Inauguration Ceremony Of Kuruma Bhavan | Sakshi
Sakshi News home page

కురుమలు నమ్మకానికి మారుపేరు: సీఎం రేవంత్‌

Published Sat, Dec 14 2024 9:36 PM | Last Updated on Sat, Dec 14 2024 9:36 PM

Cm Revanth Speech At The Inauguration Ceremony Of Kuruma Bhavan

సాక్షి, హైదరాబాద్‌: కురుమలు తెలంగాణ పునర్‌నిర్మాణంలో భాగస్వాములు కావాలని సీఎం రేవంత్‌రెడ్డి పిలుపునిచ్చారు.  కోకాపేట్‌లో నూతనంగా నిర్మించిన దొడ్డి కొమురయ్య కురుమ భవనం ప్రారంభోత్సవ కార్యక్రమంలో సీఎం ముఖ్యఅతిథిగా పాల్గొని ప్రసంగించారు. నమ్మకానికి మారుపేరు, మృదుస్వభావులు కురుమ సోదరులు.. అలాంటి సామాజిక వర్గం నుంచి వచ్చిన పోరాట యోధుడు దొడ్డి కొమురయ్య.. సాయుధ రైతాంగ  పోరాటాన్ని ముందుండి నడిపిన గొప్ప పోరాట యోధుడు అని రేవంత్‌ కొనియాడారు.

‘‘ఆయన పేరుతో దొడ్డి కొమురయ్య భవన్‌ను ప్రారంభించుకోవడం సంతోషం. కురుమ సోదరులు చదువుకునేందుకు కావాల్సిన అన్ని సౌకర్యాలు ప్రభుత్వం కల్పిస్తుంది. ప్రభుత్వ హాస్టల్స్‌లో డైట్, కాస్మోటిక్ చార్జీలు పెంచేందుకు గత ప్రభుత్వానికి మనసు రాలేదు. కానీ డైట్ చార్జీలు పెంచి నాణ్యమైన విద్య అందించేందుకు మా ప్రభుత్వం కృషి చేస్తోంది. రైతు రుణమాఫీ, ఉచిత విద్యుత్.. ఇలా అన్ని సంక్షేమ పథకాల్లో బలహీనవర్గాలకు ప్రభుత్వం ప్రాధాన్యతనిస్తోంది.

ఐలయ్య చెప్పినట్లు జమీందార్ల తెలంగాణ తల్లి కాదు.. బహుజనుల తెలంగాణ తల్లిని మనం తెచ్చుకున్నాం. ఆ తెలంగాణ తల్లి మన తల్లుల ప్రతిరూపం. బిడ్డలు అభివృద్ధి పథం వైపు నడవాలనే ఆశీర్వదించే తల్లిని మనం ప్రతిష్టించుకున్నాం. కుల గణనలో తెలంగాణ దేశానికే ఆదర్శం. కుల గణన 98 శాతం పూర్తయింది. ఇంకా కేవలం 2 శాతం మాత్రమే మిగిలి ఉంది. కులగణన మెగా హెల్త్ చెకప్ లాంటిది. కుల గణన పూర్తయితే కురుమలకు జనాభా ప్రాతిపదికన దక్కాల్సిన వాటా దక్కుతుంది’’ అని రేవంత్‌ చెప్పారు.

గత ఎన్నిల్లో కాంగ్రెస్ కురుమ సోదరులకు రెండు, యాదవ సోదరులకు  రెండు ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చింది. మీరు కలిసికట్టుగా గెలిపించుకున్నప్పుడే రాజకీయ పార్టీలు మళ్లీ టికెట్లు ఇస్తాయి. ముఖ్యమంత్రిగా విప్‌లే నా కళ్లు, చెవులు. ప్రజా ప్రభుత్వంలో నాలుగు సామాజిక వర్గాలకు విప్‌లుగా అవకాశం కల్పించాం.. బీర్ల ఐలయ్య విప్ గా ఉన్నాడు కాబట్టే మీ సమస్యల పరిష్కారానికి కృషి చేస్తున్నాడు. వచ్చిన అవకాశం వదులుకోవద్దు.. మీ బిడ్డలను మీరు గెలిపించుకుంటేనే మీకు ప్రాధాన్యత ఉంటుంది. వేర్వేరు పార్టీల్లో ఉన్నా.. కొన్ని సందర్భాల్లో మీ సామాజిక వర్గాలను గెలిపించుకోవాలి. అప్పుడే ఈ సమాజంలో మీకు మనుగడ ఉంటుంది.’’ అని రేవంత్‌ పేర్కొన్నారు.

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
 
Advertisement