‘కారు’ చిచ్చు | Konda Couple Exit Creates Ripples | Sakshi
Sakshi News home page

‘కారు’ చిచ్చు

Published Mon, Sep 10 2018 11:45 AM | Last Updated on Sat, Sep 15 2018 10:55 AM

Konda Couple Exit Creates Ripples - Sakshi

సాక్షి, వరంగల్‌ ప్రతినిధి: భూపాలపల్లి.. స్టేషన్‌ ఘన్‌పూర్‌.. వరంగల్‌ పశ్చిమ.. పాలకుర్తి.. జనగామ.. ఒక్కొక్క సెగ్మెంట్‌లో అగ్గి రాజుకుంటోంది. అభ్యర్థి అవినీతిపరుడని ఒక చోట, అసమర్థుడని ఇంకో చోట, ఉద్యమకారులను విస్మరించారని మరో చోట.. ఒక్కో తీరు కారణాలతో టీఆర్‌ఎస్‌ అసంతృప్త నేతలు తిరుగుబాటు చేస్తున్నారు.  భూపాలపల్లిలో గండ్ర సత్యనారా యణరావుతో టీఆర్‌ఎస్‌లో మొదలైన తిరుగుబాటు తాజాగా పాలకుర్తికి పాకింది. టీఆర్‌ఎస్‌ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి, ఉమ్మడి ఖమ్మం జిల్లా పార్టీ ఇన్‌చార్జి తక్కళ్లపల్లి రవీందర్‌రావు నిరసన స్వరం వినిపించారు.

పాలకుర్తి సోమేశ్వర లక్ష్మీనర్సింహాస్వామికి ప్రత్యేక పూజలు చేసిన అనంతరం ఆయన తిరుగుబాటు గళం విప్పారు. తనకు రెండుసార్లు అన్యాయం జరిగిందని, ఈసారి పాలకుర్తి టికెట్‌ తనకు ఇవ్వాల్సిందేనని స్పష్టం చేశారు. మూడు రోజుల్లో గులాబీ బాస్‌ కేసీఆర్‌ పునరాలోచనతో ప్రకటన చేయాలని లేదంటే తన కార్యాచరణ ప్రకటిస్తానంటూ  అల్టిమేటం జారీ చేశారు. టీడీపీ నుంచి గెలిచిన దయాకర్‌రావు పాలకుర్తికి చేసింది లేదని చెప్పారు. పాలకుర్తిలో భారీ మోటార్‌ సైకిళ్ల ర్యాలీ తీశారు.
 
స్టేషన్‌ ఘన్‌పూర్‌లో అసమ్మతి సెగలు..  
స్టేషన్‌ ఘన్‌పుర్‌లో డాక్టర్‌ రాజయ్యపై అసమ్మతి సెగలు అంతకంతకు పెరుగుతున్నాయి.  రాజారపు ప్రతాప్‌ తిరుగుబాటుతో రాజుకున్న అసమ్మతిని ఉప ముఖ్యమంత్రి కడియం శ్రీహ రి అనుచర వర్గం అందుకుంది. రాజయ్యకు టికెట్‌ ఇవ్వొద్దనే డిమాండ్‌తో శనివారం నియోజకవర్గంలోని మండలాల్లో ముఖ్యఅనుచరుల సమావేశాలు జరిగాయి. ఆది వారానికి అది కాస్తా విస్తరించి టీఆర్‌ఎస్‌ ప్రజాప్రతినిధులు, ముఖ్యకార్యకర్తలతో భారీ సమావేశమే జరిగింది. ఇందులో పలువురు ఎంపీటీసీ సభ్యులు, జెడ్పీటీసీ సభ్యులు  పాల్గొన్నారు. అవినీతి, కమీషన్ల దందా ఉన్న రాజయ్యకు టికెట్‌ ఇస్తే తాము సహకరించబోమని ప్రకటించారు. కడియం శ్రీహరి కుమార్తె కడియం కావ్య లేదా రాజారపు రమేష్‌లో ఎవరికి ఇచ్చినా తాము ప్రచారం చేసి గెలిపిస్తామని చెప్పారు.
 
జనగామ మొదలైన నిరసన.. 

జనగామ నియోజవర్గంలో తాజా మాజీ ఎమ్మెల్యే ముత్తిరెడ్డి యాదగిరిరెడ్డిపై నిరసన వ్యక్తమవుతోంది. గుడి వంశీధర్‌రెడ్డికి టికెట్‌ ఇవ్వాలనే డిమాండ్‌తో టీఆర్‌ఎస్‌ యువజన విభాగం నాయకులు జనగామలోని ఆర్‌అండ్‌బీ అతిథి గృహంలో ముఖ్యనాయకుల సమావేశం నిర్వహించారు. సమావేశానికి నర్మెట, బచ్చన్నపేట, తరిగొప్పుల, పెద్దపహడ్, జనగామ మండలాలకు చెందిన నేతలు గులాబీ కండువాలు ధరించి వచ్చారు. ఈ సందర్భంగా ముత్తిరెడ్డికి వ్యతిరేకంగా నినాదాలు చేశారు. ఆయన కార్యకర్తలను ఏనాడూ  పట్టించుకోలేదని ఆరోపించారు. గుడి వంశీధర్‌రెడ్డికి టికెట్‌ ఇస్తే భారీ మెజార్టీతో గెలిపిస్తామని చెప్పారు.

తొలి తిరుగుబాటు ఇక్కడే..
భూపాలపల్లిలో మధుసూదనాచారికి టికెట్‌ కేటాయించిన రోజు నుంచే గండ్ర సత్యనారాయణరావు తన పని తాను చేసుకుపోతున్నారు. ఆదివారం ఆయన ఘన్‌పూర్‌ నుంచి చెల్పూరు మీదుగా భూపాలపల్లి అజంనగర్‌ వరకు బైక్‌ ర్యాలీ తీశారు. స్వతంత్ర అభ్యర్థిగా పోటీ చేస్తానని, తనకు సహకరించాలని అడుగుతున్నారు. త నకు ఎమ్మెల్యే టికెట్‌ ఇస్తామని నమ్మించి మోసం చేశారని అధిష్టానంపై ఆరోపణలు చేస్తున్నారు.

ఆ రెండు నియోజకవర్గాల్లోనూ..
మహబూబాబాద్‌ నుంచి టీఆర్‌ఎస్‌ టికెట్‌ను ఆశించి భంగపడిన మోహన్‌లాల్‌ తిరిగి టీడీపీలోకి వెళ్లిపోయారు. ఎక్సైజ్‌ అధికారిగా పనిచేస్తున్న ఆయన గత ఎన్నికల్లో టీడీపీ తరఫున మహబూబాబాద్‌ ఎంపీ స్థానానికి పోటీ చేసి ఓడిపోయారు. ఆ తర్వాత టీఆర్‌ఎస్‌లో చేరారు. టికెట్‌ రాకపోవటంతో ఆయన తిరిగి సొంత గూటికి వెళ్లిపోయారు. డోర్నకల్‌ నియోజకవర్గం నుంచి టికెట్‌ ఆశించిన సత్యవతి రాథోడ్‌  ఇప్పటి వరకు ఎలాంటి ప్రకటన చేయలేదుగానీ, ఇటీవల ఎడ్చర్లలో తన ముఖ్య అనుచరులతో కలిసి సమావేశం నిర్వహించారు. సమావేశ వివరాలు పూర్తి గోప్యంగా ఉంచారు. అయితే వారం రోజుల తర్వాత ఆమె ఒక స్పష్టమైన ప్రకటన చేయాలని భావిస్తున్నట్లు తెలుస్తోంది.

ములుగులో..
ములుగు టికెట్‌ను అపద్ధర్మ మంత్రి అజ్మీరా చందూలాల్‌కు తిరిగి కేటాయించడంపై కొందరు టీఆర్‌ఎస్‌ నేతలు అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ములుగు జెడ్పీటీసీ సభ్యుడు, జెడ్పీ ఫ్లోర్‌ లీడర్‌ సకినాల శోభన్, మంగపేట జెడ్పీటీసీ సభ్యుడు సిద్ధంశెట్టి వైకుంఠంతోపాటు పలువురు  టీఆర్‌ఎస్‌ సీనియర్‌ నాయకులు అబ్బాపురం ఎంపీటీసీ సభ్యుడు పోరిక గోవింద్‌నాయక్‌కుగానీ, మరెవరికైనా టికెట్‌ ఇవ్వాలని అధిష్టానాన్ని కోరినట్లు తెలి సింది.  చందూలాల్‌కు టికెట్‌ ఇస్తే తాము సహకరించబోమని నియోజకవర్గంలోని 20 మంది టీఆర్‌ఎస్‌ ముఖ్యనేతలు ఆదివారం మంగపేటలో సమావేశమై చర్చించినట్లు సమాచారం. 

కొండా అల్టీమేటమ్‌కు నేడే గడువు..
రాష్ట్రంలో 105 మందికి టికెట్లు ప్రకటించిన అపద్ధర్మ సీఎం కేసీఆర్‌ తనకు ఎందుకు ఇవ్వలేదో చెప్పాలని డిమాండ్‌ చేస్తూ గులాబీ బాస్‌కు కొండా సురేఖ ఇచ్చిన రెండు రోజుల గడువు నేటితో ముగియనుంది. ఆమె సవాల్‌పై జిల్లా టీఆర్‌ఎస్‌ నాయకత్వం స్పందించింది కానీ.. ఇప్పటి వరకైతే అధినాయకత్వం నుంచి ఎలాంటి సమాధానం రాలేదు. వారి నుంచి సమాధానం రాదనే ఆలోచనతో ఉన్న కొండా దంపతులు బహిరంగ లేఖాస్త్రాన్ని సంధించటానికి సిద్ధమవుతున్నట్లు సమాచారం. టీఆర్‌ఎస్‌తో దాదాపు తెగదెంపులు చేసుకున్న ఆ దంపతులు ప్రస్తుతానికి ఇంకా ఏ పార్టీలో చేరలేదు. అయితే కాంగ్రెస్‌ పార్టీ పెద్దలకు టచ్‌లో ఉన్నట్లు తెలుస్తోంది. కాంగ్రెస్‌తో పొసగకపోతే స్వతంత్రంగా పోటీ చేసేందుకు ఏర్పాట్లు చేసుకుంటున్నారు. స్వతంత్రంగా అయితే భూపాలపల్లి, తూర్పు, పరకాల నియోజకవర్గాల్లో పోటీ చేయాలని భావిస్తున్నట్లు తెలిసింది.  

No comments yet. Be the first to comment!
Add a comment
Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement
Advertisement