
కేసీఆర్ మాటలకు, పాలనకు పొంతనేది?
వైఎస్సార్‌సీపీ తెలంగాణ అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి
సాక్షి, హైదరాబాద్: తెలంగాణ రాష్ట్రంలో ముఖ్యమంత్రి కేసీఆర్ చెపుతున్న మాటలకు.. ఆయన పాలనకు పొంతనే లేదని వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ తెలంగాణ రాష్ట్ర అధికార ప్రతినిధి కొండా రాఘవరెడ్డి ధ్వజమెత్తారు. గురువారం లోటస్‌పాండ్‌లోని పార్టీ కేంద్ర కార్యాలయంలో ఆయన మీడియాతో మాట్లాడుతూ.. మిషన్ కాకతీయ పేరుతో చెరువుల ప్రాధాన్యత గుర్తించిన కేసీఆర్‌కు.. ప్రస్తుతం నిర్మాణ దశలో ఉన్న 24 ప్రాజెక్టులు ఎందుకు గుర్తురాలేదని ప్రశ్నించారు. బడ్జెట్‌లో వీటికి కేటాయింపులు ఎందుకు చేయలేదో ప్రజలకు చెప్పాలని డిమాండ్ చేశారు.
ఈ ప్రాజెక్టులను పూర్తి చేస్తే దివంగత సీఎం వైఎస్సార్‌కు పేరు వస్తుందనే వాటిని పక్కన పెట్టారన్నారు. వైఎస్సార్ తెలంగాణ ప్రజల కోసం వేల కోట్లు ఖర్చు చేశారని, వైఎస్ ఐదేళ్ల వంద రోజుల పాలనలో అలీసాగర్, గుప్పా, సుద్దవాగు, రాలీవాగు ప్రాజెక్టులు పూర్తి చేసి లక్ష ఎకరాలకుపైగా ఆయకట్టుకు నీరు ఇచ్చార ని గుర్తు చేశారు. మాటలతో గారడీ చేస్తూ కేసీఆర్ ఎంతకాలం పాలన సాగిస్తారని ప్రశ్నించారు. ఏపీలో మంచి వ్యవసాయ భూములను మంత్రి నారాయణను అడ్డుగా పెట్టి ట్రాక్టర్లతో దున్నిస్తున్నారని, రైతులు ఏమైపోయినా చంద్రబాబుకు పట్టదన్నారు. అవసరమైతే తాము ప్రజల పక్షాన ఉద్యమాలు చేస్తామని రాఘవరెడ్డి హెచ్చరించారు. త్వరలో రాజధానిలో భారీ బహిరంగ సభ ఏర్పాటు చేస్తామని, తమ సత్తా చాటుతామన్నారు.
బాబుది క్రిమినల్ మైండ్..
టీడీపీ అధినేత చంద్రబాబు నేతృత్వంలో పనిచేస్తున్న ఎన్టీఆర్ ట్రస్ట్.. సేవా పన్ను ఎగవేసినట్లుగా ఎన్‌ఫోర్స్‌మెంట్ డెరైక్టరేట్ (ఈడీ) గుర్తించిందని రాఘవరెడ్డి చెప్పారు. అద్దె ద్వారా వచ్చే ఆదాయంలో 10.3 శాతం చొప్పున.. 2009 అక్టోబర్ నుంచి 2014 మార్చి వరకు రూ. 70 లక్షలు సేవా పన్ను చెల్లించాల్సి ఉందన్నారు. రూ.50 లక్షలు మించి సేవా పన్ను బకాయిపడిన వారిపై నాన్ బెయిలబుల్ వారెంట్ జారీ చేసే అవకాశం ఉందని, దీని నుంచి తప్పించుకొనేందుకు చంద్రబాబు తన క్రిమినల్ మైండ్ ఉపయోగించి రూ.30 లక్షలు చెల్లించారన్నారు. ఆ తర్వాత ఆ పన్ను గురించి పట్టించుకోకుంటే సర్వీస్ ట్యాక్స్ అధికారులు తాఖీదులు జారీ చేశారని తెలిపారు. దీని గురించి తెలంగాణ సీఎం కేసీఆర్ ఎందుకు మాట్లాడరని ప్రశ్నించారు.