బాధిత కుటుంబాన్ని ఆదుకోండి
ఇబ్రహీంపట్నం రూరల్ : విద్యుత్ అధికారుల నిర్లక్ష్యం కారణంగా బలైన రైతు కుటుంబానికి రూ. 10 లక్షల పరిహారమివ్వాలని వైఎస్సార్‌సీపీ జిల్లా కన్వీనర్ ఈసీ శేఖర్‌గౌడ్ ప్రభుత్వాన్ని డిమాండ్ చేశారు. ఆదిభట్ల గ్రామానికి చెందిన కోరె మాణిక్యం(38) విద్యుత్ ప్రమాదంలో మృతి చెందాడు. విషయం తెలియగానే సోమవారం గ్రామానికి వచ్చి బాధిత కుటుంబ సభ్యులను పరామర్శించారు. బాధితులకు బాసటగా నిలిచారు. ఆందోళన చేస్తున్న గ్రామస్తులకు సంఘీభావం ప్రకటించారు. అధికారులు వచ్చేవరకూ శవాన్ని తీయబోమని స్పష్టం చేశారు. హుటాహుటిన సంఘటనాస్థలానికి వచ్చిన ఏఈ లక్ష్మయ్యతో శేఖర్‌గౌడ్ మాట్లాడారు. లైన్‌మెన్ ఇష్టారాజ్యంగా వ్యవహరించి రైతును బలితీసుకున్నారని ఫిర్యాదు చేశారు.
బాధ్యత తెలియని సిబ్బందిని పెట్టుకుని ఎంతమంది ప్రాణాలను బలిగొంటారని మండిపడ్డారు. విద్యుత్ ఎస్‌ఈతో శేఖర్‌గౌడ్ ఫోన్‌లో మాట్లాడి రైతు కుటుంబం దీనస్థితిని వివరించారు. ఎస్‌ఈ హామీతో ఆందోళన విరమించారు. మాణిక్యం కుటుంబానికి ప్రభుత్వం వెంటనే రూ.10 లక్షల ఎక్స్‌గ్రేషియా చెల్లించాలని శేఖర్‌గౌడ్ డిమాండ్ చేశారు. రైతు మరణవార్త తెలియగానే ఆదిభట్ల సర్పంచ్ భూపతిగళ్ల రాజు, ఉప సర్పంచ్ పల్లె గోపాల్‌గౌడ్, టీడీపీ గ్రామశాఖ అధ్యక్షుడు గుడిదేవుని రఘువీర్‌గౌడ్, వైఎస్సార్ సీపీ మండల అధ్యక్షుడు పల్లె సాయిబాబగౌడ్ తదితరులు ఘటనాస్థలానికి వచ్చి బాధితులకు అండగా నిలిచారు. రైతు కుటుంబాన్ని ఆదుకోవాలని కోరారు.