
కోరుట్ల: మహిళలపై వివక్ష ఇంటి నుంచే పోవాలి. ఆడపిల్ల అనే చిన్నచూపు చూడొద్దు. అప్పుడే వారు ఉన్నత చదువులతో సమాజంలో గుర్తింపు తెచ్చుకుంటారు. స్త్రీలు చేస్తున్న వివక్షపై పోరాటానికి మద్దతుగా నిలిస్తే సమాజాభివృద్ధి కూడా సాధ్యమంటున్నారు కోరుట్లకు చెందిన న్యాయవాది మామిడిపల్లి విజయలక్ష్మి. మహిళలపై వివక్ష ఎలా కొనసాగుతుంది..ఎలా దూరం చేయాలనే అంశాలను ‘సాక్షి’తో మాట్లాడారు.
చిన్న సమస్యలే..
మూడేళ్ల క్రితం న్యాయవాది కోర్సు పూర్తి చేశా. ఏడాదిన్నరగా ప్రాక్టిస్ చేస్తున్నా. ఇంత తక్కువ వ్యవధిలోనే మహిళలకు సంబంధించిన వివక్ష కేసులు ఎన్నో నా దృష్టికి వచ్చాయి. అన్నీ చిన్నచిన్న సమస్యలే. ఓ భర్త భార్య అందంగా ఉందని తరచూ గుండు కొట్టిస్తూ ఆమెను అనాకారిగా ఉంచే ప్రయత్నం చేసిన కేసును పరిశీలించా.
పెళ్లి చేసుకునే సమయంలో అందంగా ఉండాలంటారు. తర్వాత ఇలా ఇబ్బంది పెడతారు. రంగు..రూపు..సంతానం..ఎక్కువ చదువు వంటి ఎన్నో చిన్నపాటి సమస్యలతో మహిళలను భర్తలు ఇబ్బందులు పెడుతున్న కేసులు అనేకం చూశాను. ఈ వివక్ష రూపుమాపడానికి సమాజంలో అన్ని వర్గాలు కలిసి రావాలి. వివక్ష అంతానికి మహిళలు చేసే పోరాటానికి మద్దతుగా నిలవాలి.
ఆర్థికంగా బలోపేతం కావాలి
మహిళలు సైతం ఒకరిపై ఆధారపడి బతికే పరిస్థితి నుంచి వాళ్ల కాళ్లపై వారు నిలబడాలి. ఆడపిల్లలు చిన్ననాటి నుంచి సమాజంలో ఎదురవుతున్న అవరోధాలు అధిగమించడం కష్టమే. కానీ వాటిని ఆత్మస్థైర్యంతో ఎదుర్కోవాలి. ఇల్లు.. పరిసరాలు.. సమాజం ఎక్కడిక్కడే ఆడపిల్లల చుట్టూ గిరిగీసి చిన్నచూపుతో వ్యవహరిస్తున్న ఫలితంగానే ఇబ్బందులు ఎదురవుతున్నాయి.
మహిళలపై వివక్ష.. రక్షణకు ఎన్నో చట్టాలు ఉన్నప్పటికీ సమాజంలో మార్పు రావడం కీలకం. తల్లిదండ్రులు ఆడపిల్లల విషయంలో వివక్ష చూపకపోతే వారి కుటుంబానికి ఆధారంగా నిలుస్తారు. ఇంటిలో నుంచి మొదలయ్యే వివక్షను తల్లిదండ్రులు దూరం చేస్తే చాలు.. అమ్మాయిలు అన్ని రంగాల్లో దూసుకెళ్తారు.
Comments
Please login to add a commentAdd a comment