సాక్షి, సిటీబ్యూరో: ప్రపంచవ్యాప్తంగా గుర్తింపు పొందిన భారత వ్యాపారవేత్తల వివరాలను తెలియజేసేందుకు ’ఫోర్బ్స్’ పత్రిక రూపొందించిన తాజా ప్రత్యేక సంచికలో నగరవాసికి చోటు లభించింది. నగరానికి చెందిన యానిమేషన్, వీఎఫ్‌ఎక్స్ సంస్థ ‘క్రియేటివ్ మెంటర్స్’ వ్యవస్థాపకుడు కొవ్వూరి సురేశ్‌రెడ్డికి జాబితాలో చోటు లభించడంపై ‘క్రియేటివ్’ సంస్థ ప్రతినిధులు హర్షం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ... చిన్న వయసులోనే యానిమేషన్ సంస్థని స్థాపించి, 13 ఏళ్ల వ్యవధిలోనే ’ఫోర్బ్స్’ జాబితాలో చేరిన తొలి తెలుగు వ్యాపారవేత్తగా కొవ్వూరి సురేశ్‌రెడ్డి ఈ ఘనత సాధించారన్నారు. ఈ నెలాఖరులో విశ్వవ్యాప్తంగా విడుదల కానున్న ఫోర్బ్స్ ఇండియా పత్రికలో డాక్టర్ పి.శ్యామరాజు, రతన్ టాటా, రాహుల్ బజాజ్, హెచ్‌సీఎల్ శివ నాడార్, యదుపాటి సింఘానియా, కుమార మంగళం బిర్లా, హావెల్స్ అనిల్‌రాయ్ గుప్తా, మహేంద్ర గ్రూప్స్ ఆనంద్ జి.మహేంద్ర... ఇలా 51 మంది అగ్రగామి వ్యాపారవేత్తల సరసన నగరానికి చెందిన యువ వ్యాపారవేత్త చోటు దక్కించుకోవడం గర్వకారణమన్నారు. 30 ఏళ్ల వయసులోనే అనూహ్య విజయాలు సాధిస్తున్న 30 మంది జాబితాను ఫోర్బ్స్ పత్రిక ఇటీవల ప్రకటించింది. అందులో మన తెలుగు నటుడు విజయ్ దేవరకొండకు స్థానం లభించగా... తాజా సంచికలో సురేశ్‌రెడ్డికి చోటు దక్కడం విశేషం.
‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుకు అర్హత...
ఆసియాలోనే తొలిసారిగా కేబుల్స్ లేకుండా మోషన్ కాప్చర్ యానిమేషన్ ప్రక్రియ ప్రవేశపెట్టడం, వేలాది మంది విద్యార్థులను యానిమేషన్ సంబంధిత రంగాల్లో తీర్చిదిద్దడం, ఇటీవల ప్రసాద్స్ ల్యాబ్స్‌తో కలసి సినీరంగంలో విభిన్న శాఖల్లో ప్రవేశించాలనుకునే ఔత్సాహికులకు శిక్షణనివ్వడం... ద్వారా క్రియేటివ్ మెంటర్స్ సంస్థ నగరంలో యువతకు కెరీర్ పరంగా విభిన్న సేవలు అందిస్తోంది. మే 30న లండన్‌లో బీబీసీ సౌజన్యంతో నిర్వహించనున్న ‘గ్లోబల్ బిజినెస్ కాన్‌క్లేవ్–2019’ కార్యక్రమంలో భాగంగా ‘హౌస్ ఆఫ్ కామన్స్’ అవార్డుల ప్రదానోత్సవం జరగనుంది. ఈ సంచికలో చోటు సంపాదించిన 51 మందిని నామినేటెడ్ పర్సన్స్‌గా పరిగణించి, వారిలో 25 మందికి అవార్డులను ఇవ్వనున్నారు. ఈ నేపథ్యంలో సురేశ్‌రెడ్డికి ఆ పురస్కారం కూడా దక్కితే అది మన నగరానికి మరింత గర్వకారణం అవుతుందని క్రియేటివ్ ప్రతినిధులు ఆశాభావం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా సురేశ్‌రెడ్డి మాట్లాడుతూ... ఇది తన జీవితంలో ఊహించని, మరిచిపోలేని పరిణామం అన్నారు. చిన్న వయసులోనే సినీ రంగంలోని అన్ని విభాగాలలో పనిచేసి జాతీయ స్థాయిలో పేరు ప్రఖ్యాతులు పొందిన లెజెండరీ సినీ డైరెక్టర్, యాక్టర్, ప్రొడ్యూసర్ ఎల్‌వీ ప్రసాద్ తనకు స్ఫూర్తి అని చెప్పారు.
Comments
Please login to add a commentAdd a comment