‘కృష్ణా’ సమస్య నాలుగు రాష్ట్రాలది
సాక్షి, హైదరాబాద్: కృష్ణా జలాల పంపిణీ సమస్య కేవలం ఆంధ్రప్రదేశ్, తెలంగాణ రాష్ట్రాలకే సంబంధించినది కాదనే విషయం కేంద్ర ప్రభుత్వానికి నివేదించాలని ఆంధ్రప్రదేశ్ సూత్రప్రాయంగా నిర్ణయించింది. కృష్ణా పరివాహక రాష్ట్రాలైన మహారాష్ట్ర, కర్ణాటకలనూ భాగస్వాములు చేసి జలాల పంపిణీపై నిర్ణయం తీసుకోవాలని అభిప్రాయపడింది. కృష్ణా జలాల పంపిణీలో బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ తమకు న్యాయం చేయలేదని, జలాల పంపిణీ ప్రక్రియకు మళ్లీ ప్రారంభించాలని కోరుతూ తెలంగాణ ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసిన విషయం విదితమే.
దానిపై ఏపీ అభిప్రాయాన్ని కోరుతూ కేంద్రం ఇటీవల లేఖ రాసింది. కేంద్రానికి జవాబు చెప్పే విషయం మీద రాష్ట్ర ప్రభుత్వం కసరత్తు ప్రారంభించింది. సోమవారం జలసౌధలో ‘సాంకేతిక సలహా సంఘం’ భేటీ ఏర్పాటు చేశారు. ఈ సమావేశానికి సాగునీటి శాఖ ఇంజనీర్లతో పాటు అదనపు అడ్వొకేట్ జనరల్ డి.శ్రీనివాస్ కూడా హాజరయ్యారు. సమావేశంలో వ్యక్తమైన అభిప్రాయాలు ఇవీ..
* కృష్ణా జలాల కేటాయింపు సమస్య కేవలం ఏపీ, తెలంగాణకు సంబంధించిందే కాదు. మహారాష్ట్ర, కర్ణాటకలను కూడా భాగస్వాములను చేయాలి.
* బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్ వాదనలు జరుగుతున్నప్పుడు ఆంధ్రప్రదేశ్ దిగువ రాష్ట్రం. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత ఏపీకి ఎగువన తెలంగాణ ఏర్పాటైంది. దిగువ రాష్ట్రంగా ఏపీ హక్కులను పరిగణనలోకి తీసుకోవాలి. తాజా వాదనలూ వినాలి.
* బ్రిజేష్‌కుమార్ ట్రిబ్యునల్‌ను పొడిగించిన నేపథ్యంలో.. మళ్లీ అన్ని రాష్ట్రాల వాదనలు విని నీటి పంపిణీ మీద కొత్తగా నిర్ణయం తీసుకొనేలా కేంద్రం ఆదేశించాలి. లేదంటే.. కొత్త ట్రిబ్యునల్ ఏర్పాటు చేయాలి.
కేంద్రానికి సీఎస్ ద్వారా లేఖ
సాంకేతిక సలహా సంఘంలో వ్యక్తమైన అభిప్రాయాలను అదనపు అడ్వొకేట్ జనరల్ ద్వారా సీనియర్ న్యాయవాది గంగూలీకి పంపించనున్నారు.మార్పులు అవసరమని భావిస్తే మరోసారి ఈ సంఘం సమావేశమై తుది నిర్ణయం తీసుకుంటుంది. ఆ లేఖను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి (సీఎస్) ద్వారా కేంద్రానికి పంపిస్తారు.