దామాషా ప్రకారం కృష్ణా జలాలు వదలాలి
సీపీఎం నేత జూలకంటి
సాక్షి, హైదరాబాద్: మహారాష్ట్ర, కర్ణాటక రాష్ట్రాలు కృష్ణానదిపై అక్రమంగా కొత్త ప్రాజెక్టులు నిర్మించడంతో పాటు, ఉన్న ప్రాజెక్టుల సామర్థ్యం పెంచుకుని వచ్చే నీటిని మొత్తం వారే వాడుకుంటున్నారని సోమవారం సీపీఎం నేత జూలకంటి రంగారెడ్డి విమర్శించారు. ప్రస్తుతం కర్ణాటకలోని ఆల్మట్టి, నారాయణపూర్ ప్రాజెక్టులు పూర్తిగా నిండిఉన్నాయని, అయినా, కిందకు నీటిని వదలడం లేదని అన్నారు.
ఈ ఏడాది ఇప్పటి వరకు శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు చుక్కనీరు రాలేదని, ఇక ముందు వస్తుందన్న ఆశకూడా లేకుండా పోయిందని అన్నారు. ఇలాంటి పరిస్థితుల్లో శ్రీశైలం, నాగార్జునసాగర్ ప్రాజెక్టులకు నీళ్లు రావాలంటే ఎగువ నుంచి వచ్చే నీటిని ఎప్పటికప్పుడు మహారాష్ట్ర, కర్ణాటకలు కొంత వాడుకుని, కొంత నీటిని దామాషా పద్ధతిలో కిందకు విడుదల చేయాలని, అప్పుడే అన్ని ప్రాంతాలకు న్యాయం జరుగుతుందని అన్నారు. ఈ విషయంలో కేంద్ర ప్రభుత్వం, కృష్ణాబోర్డు నిర్ణయం తీసుకుని అమలు చేయాలని కోరారు.