సాక్షి ప్రతినిధి, మహబూబ్‌నగర్ : ఎన్నికల ప్రచారంలో భాగంగా రాష్ట్ర ఐటీ, పురపాలకశాఖ మంత్రి కేటీఆర్ నేడు ఉమ్మడి పాలమూరు జిల్లాలో సుడిగాలి పర్యటన చేయనున్నారు. మక్తల్, అచ్చంపేటల్లో భారీ బహిరంగ సభలలో పాల్గొననునన ఆయన ఎన్నికల వేళ పార్టీ కేడర్‌ను ఉత్సాహపరచనున్నారు. హైదరాబాద్ నుంచి మంత్రి కేటీఆర్ ప్రత్యేక హెలీకాప్టర్‌లో ఉదయం 11గంటలకు మక్తల్ చేరుకుంటారు. అక్కడి ప్రభుత్వ జూనియర్ కాలేజీ మైదానంలో ఏర్పాటు చేసిన బహిరంగ సభల్లో పాల్గొని ప్రసంగిస్తారు. అనంతరం మధ్యాహ్న భోజనం పూర్తయ్యాక హెలీకాప్టర్‌లో అచ్చంపేటకు చేరుకుని అక్కడ 2గంటలకు జరిగే బహిరంగ సభలో ప్రసంగిస్తారు. మంత్రి కేటీఆర్ బహిరంగ సభలను విజయవంతం చేయడాన్ని బరిలో నిలిచే అభ్యర్థులు అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకున్నారు. ఈ నేపథ్యంలో నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనాన్ని తరలించేలా ఏర్పాట్లు చేశారు. తద్వారా నియోజకవర్గంలో తమ బలాన్ని నిరూపించుకున్నట్లవుతుందని భావిస్తున్నారు.
పైచేయి సాధించేందుకే..
ఉమ్మడి జిల్లాలో టీఆర్‌ఎస్‌కు సంబంధించి మక్తల్, అచ్చంపేటలో పార్టీ నేతలు కొందరు అసమ్మతి రాగం వినిపిస్తున్నారు. మక్తల్‌లో అసమ్మతి నేతలు పార్టీలో ఉంటూనే వేరుగా ప్రచారం చేస్తున్నారు. అలాగే అచ్చంపేటలో పార్టీ అభ్యర్థిపై కొందరు అసమ్మతి రాగం వినిపిస్తూ పార్టీని వీడుతున్నారు. మక్తల్ అసమ్మతిని చల్లార్చే బాధ్యతలను ఎంపీ జితేందర్‌రెడ్డికి పార్టీ అధిష్టానం అప్పగించినా ఓ కొలిక్కి రావడం లేదు. ఇక అచ్చంపేటలో ఉన్న చిన్న పాటి మనస్పర్ధలను సరిచేసే బాధ్యతలను మంత్రి జూపల్లికి అప్పగించారు. అయితే, అక్కడ కూడా పరిస్థితులు చక్కబడడం లేదు. ఈ నేపథ్యంలో రెండు నియోజకవర్గాల్లో పార్టీని గాడిన పెట్టేందుకు టీఆర్‌ఎస్ అధిష్టానమే నేరుగా రంగంలోకి దిగింది. ఇలా అసమ్మతి వర్గంపై పైచేయి సాధించేందుకు మంత్రి కేటీఆర్ రంగప్రవేశం చేశారు. బహిరంగ సభల ద్వారా పార్టీ శ్రేణుల్లో ఊపు తీసుకొచ్చేందుకు ప్రణాళిక సిద్ధం చేశారు. ఎన్నికలు దగ్గర పడుతుండటంతో పార్టీలో ఉండే లుకలుకలను పక్కన పెట్టి అభ్యర్థి కోసం పని చేయాలనే మెస్సేజ్‌ను ఈ వేదికల ద్వారా పంపించనున్నట్లు పార్టీ వర్గాలు చెబుతున్నాయి.
అభివృద్ధి మంత్రం
తలాఫున కృష్ణమ్మ ప్రవహిస్తున్నా... పాలమూరులో సాగు, తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పడం లేదు. ఈ నేపథ్యంలో పెండింగ్‌లో ఉన్న ప్రాజెక్టుల పనులను టీఆర్‌ఎస్ నాలుగేళ్ల కాలంలో ఓ కొలిక్కి తీసుకొచ్చి భారీగా భూములను సాగులోకి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో ఎన్నికల ప్రచారంలో టీఆర్‌ఎస్ ప్రధాన అజెండాగా ఈ అంశాన్ని ప్రస్తావించనున్నట్లు పార్టీ వర్గాలు పేర్కొంటున్నాయి. అలాగే ప్రతీ నియోజకవర్గంలో నాలుగేళ్లుగా జరిగిన అభివృద్ధిపై ఇప్పటికే ఒక నివేదిక రూపంలో అందజేశారు. మంత్రి కేటీఆర్ కూడా మక్తల్, అచ్చంపేటల్లో జరిగే సభల ద్వారానాలుగేళ్లుగా చోటు చేసుకున్న అభివృద్ధితో పాటు సంక్షేమ పథకాలను వివరించనున్నట్లు పార్టీ వర్గాలు తెలిపాయి. మంత్రి కేటీఆర్ ప్రసంగం కోసం రెండు నియోజకవర్గాల్లోని కీలకమైన అంశాలను ఒక నోట్ రూపంలో అందజేసినట్లు సమాచారం. అలాగే మరోసారి టీఆర్‌ఎస్ ప్రభుత్వం అధికారంలోకి వస్తే చేపట్టబోయే కార్యక్రమాలను కూడా ఆయన ప్రజలకు వివరించనున్నట్లు తెలుస్తోంది.
భారీ జన సమీకరణ
నియోజకవర్గ స్థాయి సభ మాత్రమే అయినప్పటికీ జనసమీకరణ విషయంలో పార్టీ అభ్యర్థులు ఏ మాత్రం వెనక్కి తగ్గడం లేదు. నియోజకవర్గంలోని ప్రతీ గ్రామం నుంచి జనాన్ని తీసుకొచ్చేందుకు బాధ్యతను కార్యకర్తలకు అప్పగించారు. మక్తల్ బహిరంగ సభ కోసం పార్టీ అభ్యర్థి చిట్టెం రామ్మోహన్‌రెడ్డి గత నాలుగైదు రోజులుగా తీవ్రంగా కృషిచేస్తున్నారు. పక్కా ప్రణాళికతో జనసమీకరణపై దృష్టి కేంద్రీకరించారు. తద్వారా మక్తల్‌లో అసమ్మతి నేతలపై పై చేయి సాధించాలని భావిస్తున్నారు. అలాగే అచ్చంపేటలో 10 ఎకరాల స్థలంలో బహిరంగ సభ ఏర్పాటు చేశారు. పార్టీ అభ్యర్థి గువ్వల బాల్‌రాజ్ సైతం ఈ సభకు భారీగా జన సమీకరణ చేసి తన బలం నిరూపించుకోవాలని కృషి చేస్తున్నారు.
బలం..జనం!
Published Mon, Oct 29 2018 7:56 AM | Last Updated on Tue, Nov 6 2018 9:03 AM
Advertisement
Advertisement
Comments
Please login to add a commentAdd a comment